సౌదీ పర్యటనను సమర్థించుకున్న బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్

ABN , First Publish Date - 2022-03-16T20:53:32+05:30 IST

సౌదీ అరేబియాలో పర్యటించాలన్న తన నిర్ణయాన్ని బ్రిటన్

సౌదీ పర్యటనను సమర్థించుకున్న బ్రిటన్ పీఎం బోరిస్ జాన్సన్

లండన్ : సౌదీ అరేబియాలో పర్యటించాలన్న తన నిర్ణయాన్ని బ్రిటన్ ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్ సమర్థించుకున్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు చాలా ముఖ్యమని, అయితే మానవ హక్కుల అంశాలను కూడా లేవనెత్తుతానని చెప్పారు. చమురు సరఫరాను పెంచాలని ఆయన సౌదీ ప్రభుత్వాన్ని కోరబోతున్నారు. 


బోరిస్ జాన్సన్ బుధవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) చేరుకున్నారు. అనంతరం ఆయన సౌదీ అరేబియాలో పర్యటిస్తారు. ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం నేపథ్యంలో, రష్యా నుంచి చమురును దిగుమతి చేసుకోవడం మానేయడానికి వీలుగా, చమురు సరఫరాను మరింత పెంచాలని ఈ దేశాలను కోరేందుకు ఆయన ప్రయత్నిస్తున్నారు. రష్యాపై మరింత ఒత్తిడి పెరిగేలా చేయడం ఆయన లక్ష్యం. 


సౌదీ అరేబియా ఇటీవల 81 మందిని సామూహికంగా ఉరి తీసింది. ఇంత పెద్ద ఎత్తున సామూహిక ఉరితీతలు జరగడం దశాబ్దాల కాలంలో ఇదే తొలిసారి. దీంతో సౌదీ అరేబియా మానవ హక్కుల ఉల్లంఘనకు పాల్పడిందని బ్రిటన్ ఎంపీలు, ఇతర ప్రముఖులు ఆరోపిస్తున్నారు. ఇటువంటి సమయంలో సౌదీ అరేబియాలో బోరిస్ జాన్సన్ పర్యటిస్తుండటంపై కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. 


ఈ విమర్శలపై ప్రశ్నించినపుడు బోరిస్ మాట్లాడుతూ, ఈ విషయాలన్నిటినీ గతంలో తాను అనేకసార్లు ప్రస్తావించానని, ఇప్పుడు మళ్ళీ లేవనెత్తుతానని చెప్పారు. ప్రపంచంలోని ఈ ప్రాంతంతో తమకు చాలా సుదీర్ఘ కాలం నుంచి సంబంధాలు ఉన్నాయని చెప్పారు. ఇరు దేశాల మధ్య కేవలం చమురు విషయంలో మాత్రమే కాకుండా అనేక అంశాల్లో చాలా ముఖ్యమైన సంబంధాలు ఉన్నాయన్నారు. బ్రిటన్‌లో గ్రీన్ ఏవియేషన్ ఫ్యూయల్ ప్రాజెక్టులో సౌదీ పెట్టుబడులు పెట్టిందన్నారు. ఇలాంటి సంబంధాలను ప్రోత్సహించాలని చెప్పారు. ఇటువంటి సంబంధాలను కొనసాగించడమంటే, మనం మన సిద్ధాంతాలకు కట్టుబడి ఉండటం సాధ్యంకాదని కాదని చెప్పారు. మనం శ్రద్ధ చూపుతున్న అంశాలను లేవనెత్తలేమని కాదని తెలిపారు. రష్యా గ్యాస్, చమురుపై ఆధారపడటం పాశ్చాత్య దేశాలు చేసిన తప్పిదమని తెలిపారు. 


Updated Date - 2022-03-16T20:53:32+05:30 IST