బ్రిటన్‌ అధికార పార్టీ ఎంపీ హత్య

ABN , First Publish Date - 2021-10-17T08:06:37+05:30 IST

బ్రిటన్‌ అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన..

బ్రిటన్‌ అధికార పార్టీ ఎంపీ హత్య

కత్తితో పొడిచి చంపిన యువకుడు

నియోజకవర్గ ప్రజలతో స్థానిక సమస్యలపై 

చర్చిస్తున్న సమయంలోనే దారుణం

ఐదేళ్లలో ఇది రెండో సంఘటన


లండన్‌, అక్టోబరు 16: బ్రిటన్‌ అధికార పార్టీకి చెందిన ఎంపీ ఒకరు దారుణ హత్యకు గురయ్యారు. శుక్రవారం తన సొంత నియోజకవర్గంలో నిర్వహించిన సభలో సోమాలియా సంతతికి చెందిన పాతికేళ్ల యువకుడు కత్తితో విచక్షణా రహితంగా పొడవడంతో ఎంపీ కుప్పకూలిపోయారు. ఆసుపత్రికి తరలించినా.. కత్తిపోట్ల తీవ్రత ఎక్కువగా ఉండడంతో వైద్యులు ప్రాణాలు కాపాడలేకపోయారు. బ్రిటన్‌ మీడియా కథనం మేరకు.. 69 ఏళ్ల సర్‌ డేవిడ్‌ అమెస్‌.. ఎస్సెక్స్‌లోని సౌత్‌ ఎండ్‌ వెస్ట్‌ నుంచి అధికార కన్జర్వేటివ్‌ పార్టీ తరఫున ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్నారు. శుక్రవారం ఆయన తన నియోజకవర్గంలోని బెల్ఫెయిర్స్‌ మెథడిస్ట్‌ చర్చి ప్రాంతంలో ప్రజలతో స్థానిక సమస్యలపై చర్చిస్తున్నారు. ఈ సమయంలో ఓ యువకుడు ఎంపీని కత్తితో విచక్షణారహితంగా పొడిచాడు. యువకుడిని అదుపులోకి తీసుకుని, కత్తిని స్వాధీనం చేసుకున్నట్టు ఎస్సెక్స్‌ పోలీసులు తెలిపారు. ఘటనకు సంబంధించిన సమాచారం అందగానే తాము రంగంలోకి దిగి, ఎంపీని ఆసుపత్రికి తరలించామని, అయితే.. పరిస్థితి విషమించి ఆయన మృతి చెందారని వివరించారు. నిందితుడు సోమాలియా సంతతికి చెందిన వ్యక్తి అని, తమ అదుపులో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు. అమెస్‌ 1983 నుంచి ఎంపీగా వరుస విజయాలు సాధిస్తున్నారు. ఎలాంటి ఆరోపణలూ లేని ప్రజానేతగా, పిలిస్తే పలికే నాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. ఆయనకు భార్య, ఐదుగురు పిల్లలు ఉన్నారు. 


కాగా, అమెస్‌ హత్యను ప్రధాని బోరిస్‌ జాన్సన్‌ తీవ్రంగా ఖండించారు. ఈ ఘటన తనను దిగ్ర్భాంతికి గురిచేసిందని, సుదీర్ఘ రాజకీయ అనుభవం, ప్రజాభిమానం ఉన్న నాయకుడిగా అమెస్‌ గుర్తింపు పొందారని పేర్కొన్నారు. పలువురు మంత్రులు, ఎంపీలు ఈ హత్యను ఖండించారు. కాగా, ఈ ఘటన ప్రజాప్రతినిధుల రక్షణను ప్రశ్నార్థకం చేసిందని ప్రతిపక్షాలు విమర్శించాయి. ఇదిలావుంటే, 2016లో అప్పటి ఎంపీ జో కాక్స్‌ కూడా ఇలానే హత్యకు గురయ్యారు. అప్పట్లోనూ ఆమె వెస్ట్‌ యార్క్‌షైర్‌లోని తన నియోజకవర్గం ప్రజలతో సమావేశమైన సమయంలోనే హత్యకు గురయ్యారు. 


ఘటన వెనుక ఉగ్ర కోణం!: పోలీసులు

ఎంపీ అమెస్‌ హత్య వెనుక ఉగ్రవాదుల ప్రమేయం ఉందనే కోణంలోనూ దర్యాప్తు చేస్తున్నట్టు స్కాట్‌ల్యాండ్‌ యార్డ్‌ పోలీసులు తెలిపారు. ఉగ్రవాద నిరోధక విభాగం డిప్యూటీ అసిస్టెంట్‌ కమిషనర్‌ డీన్‌ హేడాన్‌ మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ హత్య వెనుక ఉగ్రకోణం ఉన్నట్టు ప్రాథమికంగా భావిస్తున్నట్టు తెలిపారు.

Updated Date - 2021-10-17T08:06:37+05:30 IST