కరెంట్ సప్లై నిలిచిపోవడంతో వ్యక్తికి తప్పని తిప్పలు.. ఫిర్యాదుతో స్పందించిన ఎలక్ట్రిసిటీ బోర్డు.. కోట్ల రూపాయల పరిహారం!

ABN , First Publish Date - 2022-02-16T22:50:38+05:30 IST

పవర్ సప్లై నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. కలలో కూడా ఉహించనంత భారీ మొత్తం అతడికి పరిహారం రూపంలో అందింది

కరెంట్ సప్లై నిలిచిపోవడంతో వ్యక్తికి తప్పని తిప్పలు.. ఫిర్యాదుతో స్పందించిన ఎలక్ట్రిసిటీ బోర్డు.. కోట్ల రూపాయల పరిహారం!

ఎన్నారై డెస్క్: పవర్ సప్లై నిలిచిపోవడం వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫిర్యాదు చేసిన ఓ వ్యక్తిని అదృష్టం వరించింది. కలలో కూడా ఉహించనంత భారీ మొత్తం అతడికి పరిహారం రూపంలో అందింది. ఆ తర్వాత తప్పు తెలుసుకున్న ఎలక్ట్రిసిటీ బోర్డు నాలుక కర్చుకుంది. దీంతో పరిహారం తాలూకు చెక్కు ఫొటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాల్లోకి వెళితే..


ఇంగ్లాండ్‌కు చెందిన గారెత్ హ్యూస్ అనే వ్యక్తి వెస్ట్ యార్క్‌షైర్‌లో నివసిస్తున్నాడు. వాతావరణ పరిస్థితుల వల్ల ఇతడు నివసించే ప్రాంతంలో కొద్ది రోజుల క్రితం కరెంట్ సరఫరా నిలిచిపోయింది. పవర్‌ సప్లై నిలిచిపోవడంతో రోజుల తరబడి అతడు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలోనే గారెత్ కీలక నిర్ణయం తీసుకున్నాడు. తన ఇబ్బందులు వివరిస్తూ ఎలక్ట్రిసిటీ బోర్డుకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు చేయడం వల్ల ఎంతో కొంత పరిహారం లభిస్తుందని అతడు భావించాడు. అయితే.. పరిహారంగా 2.3 ట్రిలియన్ పౌండ్ల (సుమారు రూ.23,49,02,91,00,00,00) చెక్కు అందడంతో అతడు ఒక్కసారిగా షాకయ్యాడు. 



అనంతరం సోషల్ మీడియా వేదికగా.. ఈ విషయాన్ని నార్తర్న్ పవర్‌గ్రిడ్ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ‘ఇంత పెద్ద మొత్తంలో పరిహారం చెల్లించినందుకు ధన్యవాదాలు. ఈ చెక్కును బ్యాంకులో వేసే ముందు ఒక విషయం స్పష్టం చేయండి. ఇంత భారీ మొత్తాన్ని మీరు పరిహారంగా చెల్లించగలరా?’ అంటూ అధికారులను పశ్నించాడు. దీంతో అధికారులు తమ తప్పు గ్రహించి, నాలుక కర్చుకున్నారు. పొరపాటు జరిగిపోయిందంటూ బదులిచ్చారు. కాగా.. ప్రస్తుతం ఈ చెక్కు‌కు సంబంధించిన ఫొటోలు ప్రస్తుతం వైరల్‌గా మారాయి. ఈ క్రమంలో నెటిజన్లు స్పందిస్తూ.. ఫన్నీ కామెంట్లు చేస్తున్నారు. ‘ఈ చెక్కును మీరు బ్యాంకులో వేయండి. ఆ తర్వత ఏం జరుగుతుందో చూడండి’ అని కొందరు.. ‘తొందరగా ఈ చెక్కును క్యాష్‌గా మార్చుకోండి. లేదంటే అధికారులతో 50 శాతం డీల్ మాట్లాడుకోండి’ అంటూ మరికొందరు గారెత్‌కు సూచనలు ఇస్తున్నారు. 




Updated Date - 2022-02-16T22:50:38+05:30 IST