75th Independence Day: భారతీయ విద్యార్థులకు 75 ఉపకార వేతనాలు : బ్రిటన్

ABN , First Publish Date - 2022-06-30T01:05:14+05:30 IST

భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా బ్రిటన్‌లో సెప్టెంబరు

75th Independence Day: భారతీయ విద్యార్థులకు 75 ఉపకార వేతనాలు : బ్రిటన్

లండన్ : భారత దేశ 75వ స్వాతంత్ర్య దినోత్సవాల సందర్భంగా బ్రిటన్‌లో సెప్టెంబరు నుంచి చదివే 75 మంది విద్యార్థులకు పూర్తి స్థాయి నిధులతో ఉపకార వేతనాలను ఇవ్వనున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం బుధవారం ప్రకటించింది. దీని కోసం భారత దేశంలోని వ్యాపార సంస్థలతో భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు తెలిపింది. 


లండన్‌లో జరిగిన ఇండియా గ్లోబల్ ఫోరంలో బ్రిటిష్, ఇండియన్ బిజినెస్ లీడర్స్, ప్రభుత్వ ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ ఫోరంలో బ్రిటిష్ హై కమిషనర్ అలెక్స్ ఎల్లిస్ మాట్లాడుతూ, ఈ ఉపకార వేతనాల పథకం గొప్ప మైలురాయి వంటిదని చెప్పారు. దీనికి పారిశ్రామిక రంగ భాగస్వాములు మద్దతిచ్చినందుకు ధన్యవాదాలు తెలిపారు. 75 ఉపకార వేతనాలను ప్రకటిస్తున్నందుకు సంతోషంగా ఉందన్నారు. 


ఒక సంవత్సరం కాల పరిమితిగల మాస్టర్స్ ప్రోగ్రామ్‌కు పూర్తి స్థాయి నిధులతో ఉపకార వేతనాలను ఇంత ఎక్కువ సంఖ్యలో ఇవ్వడం ఇంత వరకు ఇదే మొదటిసారి. ఈ ప్రత్యేక పథకంలో హెచ్ఎస్‌బీసీ, పియర్సన్ ఇండియా, హిందుస్థాన్ యూనిలీవర్, టాటా సన్స్, డువోలింగో భాగస్వాములయ్యాయి. ఏదైనా రికగ్నయిజ్డ్ బ్రిటిష్ యూనివర్సిటీలో నచ్చిన సబ్జెక్ట్‌లో ఒక ఏడాది కాలపరిమితిగల మాస్టర్స్ ప్రోగ్రామ్ చేసే అవకాశం లభిస్తుంది. ఈ ఉపకార వేతనాల్లో చెవెనింగ్ స్కాలర్‌షిప్స్ కూడా ఉంటాయి. 


సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథమెటిక్స్ (STEM)లో భారత దేశంలోని బ్రిటిష్ కౌన్సిల్ 18 ఉపకార వేతనాలను మహిళలకు అందజేస్తుంది. అదేవిధంగా ఆరు ఇంగ్లిష్ స్కాలర్‌షిప్స్‌ను కూడా ఇస్తుంది. హెచ్ఎస్‌బీసీ 15, పియర్సన్ ఇండియా 2 ఉపకార వేతనాలను; హిందుస్థాన్ యూనిలీవర్, టాటా సన్స్, డువోలింగో ఒక్కొక్క ఉపకార వేతనాన్ని ఇస్తాయి. 



Updated Date - 2022-06-30T01:05:14+05:30 IST