బ్రిలియంట్‌ బ్రాడ్‌

ABN , First Publish Date - 2020-07-28T08:19:31+05:30 IST

బ్రిలియంట్‌ బ్రాడ్‌

బ్రిలియంట్‌ బ్రాడ్‌

  • ‘రికార్డు’కు వికెట్‌ దూరంలో ఇంగ్లండ్‌ పేసర్‌


సరిగ్గా 13 ఏళ్ల క్రితం టీ20 ప్రపంచక్‌పలో ఓ 20 ఏళ్ల కుర్రాడు వేసిన ఓవర్‌లో స్టార్‌ ఆల్‌రౌండర్‌ యువరాజ్‌ సింగ్‌ వరుసగా ఆరు సిక్సర్లు బాదడం క్రికెట్‌ అభిమానులకు గుర్తుండే ఉంటుంది. నాటి మ్యాచ్‌లో ఒక్కో సిక్సర్‌ గాల్లోకి ఎగురుతున్న కొద్దీ.. ఆ కుర్రాడిని చూసినవారికి అయ్యో పాపం.. అనిపించింది. ఆ రోజు ఒకే ఓవర్‌లో 36 పరుగులిచ్చుకుని చెత్త రికార్డు మూటగట్టుకున్న ఆ బౌలరే స్టువర్ట్‌ బ్రాడ్‌. అతడే ఇప్పుడు ఇంగ్లండ్‌ పేస్‌కు ప్రధాన ఆయుధంగా మారాడు.. టెస్టు క్రికెట్‌లో అత్యంత అరుదుగా కనిపించే 500 వికెట్ల రికార్డుకు అడుగు దూరంలో నిలిచాడు.


‘రెండేళ్లుగా నేను అద్భుత ఫామ్‌లో ఉన్నా జట్టు నుంచి ఎందుకు తప్పించారో అర్థం కావడం లేదు. కరోనాకు ముందు జరిగిన యాషెస్‌, దక్షిణాఫ్రికాతో సిరీ‌స్‌ల్లో విశేషంగా రాణించా. అయినా నన్ను తీసేయడం ఆవేదనతో పాటు తీవ్ర ఆగ్రహానికి గురి చేసింది’.. వెస్టిండీస్‌తో తొలి టెస్టులో చోటు దక్కకపోవడంతో పేసర్‌ స్టువర్ట్‌ బ్రాడ్‌ స్పందన ఇది. ఆ కసి ఇంకా రగులుతుందో ఏమో.. నిర్ణాయక టెస్టులో అతడు ఆల్‌రౌండ్‌ షో చూపుతూ ఒంటిచేత్తో జట్టుకు విజ్డెన్‌ ట్రోఫీని అందించబోతున్నాడు. అంతేకాకుండా రికార్డు స్థాయిలో 500 వికెట్లకు అత్యంత చేరువలో నిలిచి ఔరా అనిపించుకోగలిగాడు. నాలుగో రోజు ఆట సాగి ఉంటే ఈపాటికే ఆ ఫీట్‌ను కూడా అధిగమించేవాడు. ఇంగ్లండ్‌ తరఫున గతంలో ఓపెనర్‌గా ఆడిన క్రిస్‌ బ్రాడ్‌ కుమారుడే స్టువర్ట్‌ బ్రాడ్‌.


పేస్‌ దళపతి..

కొన్నేళ్ల క్రితం వరకు కూడా ఇంగ్లండ్‌ పేస్‌ దళంలో బ్రాడ్‌ ప్రాతినిధ్యంపై అనుమానాలే ఉండేవి. వాటిని పటాపంచలు చేస్తూ ఎప్పటికప్పుడు తనను తాను మెరుగుపర్చుకుంటూ ప్రతిభ చాటాడు. 2016-17 మధ్యలో తానాడిన 25 టెస్టుల్లో 78 వికెట్లు తీశాడు. ఇందులో 45 స్వదేశంలో వచ్చినవే. ఈ కాలంలో అండర్సన్‌ తర్వాత అతనే ఎక్కువ వికెట్లు తీశాడు. ఇంగ్లండ్‌ తరఫున యాషెస్‌ సిరీ్‌సలో బోథమ్‌ (128), బాబ్‌ విల్లీస్‌ (123) తర్వాత బ్రాడ్‌ (118)దే అత్యధిక వికెట్ల రికార్డు. ఈ విషయంలో జేమ్స్‌ అండర్సన్‌ (104) కూడా అతని తర్వాతే ఉండడం గమనార్హం. అలాగే అండర్సన్‌తో కలిసి ప్రపంచ క్రికెట్‌లో అత్యంత విజయవంతమైన పేస్‌ జోడీగా బ్రాడ్‌ పేరు తెచ్చుకున్నాడు. 34 ఏళ్ల వయస్సులోనూ ఇప్పటికీ గంటకు 87-88 మైళ్ల వేగంతో బంతులు విసురుతూ శభాష్‌ అనిపించుకుంటున్నాడు. ప్రస్తుతం విండీస్‌తో జరుగుతున్న సిరీ్‌సలో ఆడిన రెండు మ్యాచ్‌ల్లో ఇప్పటికే 14 వికెట్లు తీశాడు. 


శాసిస్తున్నాడు..

విండీ్‌సతో మూడు టెస్టుల సిరీస్‌ ఆరంభ మ్యాచ్‌లో బ్రాడ్‌ను పక్కనపెట్టడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. అయితే తొలి మ్యాచ్‌ ఓటమితో జట్టు కళ్లు తెరుచుకుంది. అండర్సన్‌కు విశ్రాంతినిస్తూ రొటేషన్‌ పద్దతిన బ్రాడ్‌ను తీసుకుంది. అంతే.. రెండో టెస్టులో బ్రూక్స్‌, బ్లాక్‌వుడ్‌, డౌరిచ్‌ సహా ఆరు కీలక వికెట్లు తీసి జట్టు విజయంలో తనవంతు పాత్ర పోషించాడు. ఇక నిర్ణాయకమైన మూడో టెస్టులో బ్రాడ్‌ అటు బ్యాటింగ్‌.. ఇటు బౌలింగ్‌లో రాణిస్తూ చక్కటి ఆల్‌రౌండర్‌ పాత్ర పోషిస్తున్నాడు. మూడో రోజు ఆటలో విండీస్‌ కోల్పోయిన ఆరు వికెట్లను అతడే పడగొట్టాడు. ఇవన్నీ అతను ఏడు ఓవర్లలోనే తీయడం విశేషం. అంతకుముందు తన బ్యాట్‌ పవర్‌ కూడా చూపిస్తూ ఇంగ్లండ్‌ తరఫున 33 బంతుల్లోనే మూడో ఫాస్టెస్ట్‌ ఫిఫ్టీని పూర్తిచేశాడు. 

Updated Date - 2020-07-28T08:19:31+05:30 IST