వరవ కాలువపై వంతెన ఎవరు నిర్మించారు!?

ABN , First Publish Date - 2022-05-09T04:29:18+05:30 IST

సొంత స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు తీసుకోకపోతేనే అధికారులు హడావుడి చేసి భారీగా పెనాల్టీలు వసూళ్లు చేస్తారు.

వరవ కాలువపై వంతెన ఎవరు నిర్మించారు!?
వరవ కాలువపై అనధికారంగా నిర్మించిన వంతెన

అనుమతి లేకుండా ఎవరి ప్రయోజనం కోసమో?

మౌనం వీడని మున్సిపల్‌ అధికారులు

సమాచారమే లేదంటున్న నీటిపారుదల శాఖ

కావలి, మే 8: సొంత స్థలాల్లో నిర్మాణాలు చేపట్టేందుకు అనుమతులు తీసుకోకపోతేనే అధికారులు హడావుడి చేసి భారీగా పెనాల్టీలు వసూళ్లు చేస్తారు. అలాంటిది ప్రభుత్వ స్థలాల్లో నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు ఏమి చేస్తున్నారు.. ఎందుకు మౌనంగా ఉన్నారు.. దాని వెనుక ఆంతర్యమేమిటని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. కావలి పట్టణ నడిబొడ్డున మేదరబజారులో నీటిపారుదలశాఖ పరిధిలో ఉన్న వరవ కాలువపై ఎలాంటి అనుమతులు లేకుండా ఒక వంతెన నిర్మాణం చేపట్టారు. ఈ విషయాన్ని స్థానికులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా మున్సిపల్‌ అధికారులు పట్టించుకోకపోగా నీటిపారుదలశాఖ అధికారులు పరిశీలించి  వంతెనను చూచి విస్తుపోయారు.  ఈ వంతెన ఎవరు నిర్మించారనేందుకు సమాధానం లేదు. నీటిపారుదలశాఖ అధికారులను అడిగితే తమకు తెలియదు.. మా అనుమతి ఎవరూ తీసుకోలేదని చెబుతున్నారు. ప్రజల అవసరాల కోసం మున్సిపాల్టీ వారు ఎవరైనా నిర్మించారంటే అక్కడ అంత ప్రజల అవసరం లేదు. మున్సిపాల్టీ అధికారులు కూడా తాము నిర్మించలేదని, ఎవరికీ లిఖితపూర్వకంగా అనుమతులు ఇవ్వలేదని అంటున్నారు. అయితే మున్సిపల్‌ కమిషనర్‌ మాత్రం వరవ కాలువ వెంబడి కాలువను ఆక్రమించి  నిర్మాణాలు చేపడితే ఎవరూ అడగరేంటి.. వంతెన కడితే తప్పేమిటి ప్రజలకు ఉపయోగపడుతోంది కదా అంటున్నాడే గాని ఎవరు కట్టారంటే తమకు తెలియదంటున్నారు. దీనిని బట్టి వంతెన ఎవరు నిర్మించారనేది కమిషనర్‌కు తెలుసు. పాపిరెడ్డి చెరువుకు వర్షపు నీరు వెళ్లే ఈ వరవ కాలువపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టాలన్నా నీటిపారుదలశాఖ అనుమతులు ఉండాలి. వారు డిజైన్‌ ఇవ్వాలి. ఎవరు పడితే వారు వారిష్ట ప్రకారం కాలువలపై వంతెనలు కట్టుకుంటుంటే ఇక అధికారులు ఎందుకు భవిష్యత్తులో ఆవంతెన వలన ఇబ్బందులు వస్తే ఎవరు బాధ్యులని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. కావలిలో అధికారుల అనుమతులు లేకుండా వరవ కాలువపై లక్షలు వెచ్చించి వంతెన నిర్మాణం చేట్టారంటే దాని వలన ఎవరికైనా కోట్లలో ఆదాయం ఉంటేనే దానిని నిర్మిస్తారన్నది చర్చనీయాంశమైంది. అనుమతులు లేకుండా వంతెన నిర్మాంచినా అధికారులు పట్టించుకోలేదంటే వారికి మామూళ్లు ముట్టి అయినా ఉండాలి లేక వంతెన నిర్మించిన వ్యక్తులు అధికారులను శాసించే స్థాయి కలిగిన వారైనా అయి ఉండాలని ప్రజలు చర్చించుకుంటున్నారు. ఆ వంతెన నిర్మాణానికి ఎదురుగా పాడు బడిన ఇళ్లు ఉంటే వాటిని పడగొట్టారు. వాటిని ఎవరైనా పలుకుబడి కలిగిన నాయకులు కొనుగోలు చేసుకుని ఆ ఇంటికి రాకపోకల కోసం ఆ వంతెనను నిర్మించి దాని వలన ఆ స్థలం విలువ పెంచుకుని ఉండాలని ప్రజలు చెపుతున్నారు. ఏది ఏమైనా వంతెన నిర్మాణానికి అధికారులు అడ్డు చెప్పలేదు. నిర్మించిన వ్యక్తి ఎవరనేది చెప్పలేదు. దీంతో వంతెన నిర్మించిన వ్యక్తి ఎవరనేది కావలిలో హాట్‌ టాపిక్‌గా చర్చ జరుగుతోంది.

Read more