Assam flood: కొట్టుకుపోయిన వంతెన.. వరదలతో అసోం అతలాకుతలం

ABN , First Publish Date - 2022-05-17T21:45:53+05:30 IST

వరదలతో అసోం అతలాకుతలం అవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు

Assam flood: కొట్టుకుపోయిన వంతెన.. వరదలతో అసోం అతలాకుతలం

గువాహటి: వరదలతో అసోం అతలాకుతలం అవుతోంది. ఏకధాటిగా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు ఉప్పొంగుతున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. 20 జిల్లాల్లో దాదాపు 2 లక్షల మంది వరద (floods) ప్రభావానికి గురయ్యారు. రైలు, రోడ్డు వంతెనలు తెగిపోవడంతో రవణా వ్యవస్థంగా పూర్తిగా స్తంభించిపోయింది. మరోవైపు, కొండచరియలు (Landslides) విరిగిపడుతుండడంతో ప్రజలు భయాందోళనల మధ్య గడుపుతున్నారు. హాఫ్‌లోంగ్ రెవెన్యూ సర్కిల్‌లో బురదలో చిక్కుకుని ముగ్గురు, కచర్ జిల్లాలో వరదల కారణంగా ఇద్దరు మరణించారు.


వరదలు, కొండచరియలు విరిగిపడడం కారణంగా దాదాపు 1,97,248 ప్రజలు తీవ్రంగా ప్రభావితమయ్యారు. వరదల కారణంగా కచర్, హోజా జిల్లాలు దారుణంగా దెబ్బతిన్నట్టు విపత్తు నిర్వహణ అధికారులు చెబుతున్నారు. మరోవైపు, మరో మూడు రోజులపాటు అసోంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. వివిధ జిల్లాల్లోని 16 ప్రాంతాల్లో గత 24 గంటల్లో కట్టలు తెగాయి. రోడ్లు, బ్రిడ్జిలు, ఇళ్లు కొన్ని ప్రాంతాల్లో పూర్తిగా, మరికొన్ని ప్రాంతాల్లో పాక్షికంగా నీటమునిగాయి. 


వరద ధాటికి దిమా హసావో జిల్లాలో ఓ వంతెన అమాంతం కొట్టుకుపోతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇతర ప్రాంతాలతో ఈ జిల్లాకు పూర్తిగా సంబంధాలు తెగిపోయినట్టు రాష్ట్ర ప్రభుత్వం ఓ బులెటిన్‌లో పేర్కొంది. సమాచార వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిందని, హాఫ్‌లోంగ్‌కు దారితీసే రోడ్లు, రైలు మార్గాలు మే 15 నుంచి పూర్తిగా మూసుకుపోయాయని తెలిపింది.


 ఎన్‌డీఆర్ఎఫ్, ఎస్‌డీఆర్ఎఫ్, అగ్నిమాపక, అత్యవసర విభాగాలు సహాయక చర్యల్లో పాలుపంచుకుంటున్నాయి. రెండు రైళ్లలో చిక్కుకున్న 2800 మందిని వైమానిక, ఇతర ఏజెన్సీల సాయంతో సురక్షితంగా తరలించారు. పట్టాలపై కొండచరియలు విరిగిపడడం, పట్టాలు నీటిలో మునిగిపోవడం వంటి కారణాల వల్ల రెండు రైళ్లు చిక్కుకుపోయాయి. ఏడు జిల్లాల్లో 55 సహాయ శిబిరాలు ఏర్పాటు చేశారు. 32,959 మంది ఆశ్రయం పొందుతున్నారు.  


Updated Date - 2022-05-17T21:45:53+05:30 IST