Hyderabadలో ట్రాఫిక్ చిక్కులకు చెక్.. మెట్రోపై వంతెన

ABN , First Publish Date - 2022-05-02T16:56:42+05:30 IST

హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు ప్రతిపాదించిన..

Hyderabadలో ట్రాఫిక్ చిక్కులకు చెక్.. మెట్రోపై వంతెన

  • ప్రారంభమైన పనులు
  • నారపల్లి కారిడార్‌కు అనుసంధాన నిర్మాణం
  • రామంతాపూర్‌ వైపు..
  • పిల్లర్ల కోసం గుంతల తవ్వకం
  • రూ.151.40 కోట్ల అంచనా వ్యయం
  • ఉప్పల్‌ స్టేడియం రోడ్డు వైపు గ్రేడ్‌ సెపరేటర్‌

హైదరాబాద్‌ సిటీ : హైదరాబాద్‌- వరంగల్‌ జాతీయ రహదారిపై ట్రాఫిక్‌ చిక్కులకు చెక్‌ పెట్టేందుకు ప్రతిపాదించిన ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణంలో ముందడుగు పడింది. ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు నుంచి రామంతాపూర్‌ వైపు మోడ్రన్‌ బేకరీ వరకు తలపెట్టిన వంతెన నిర్మాణ పనులు మొదలయ్యాయి. రూ.151.40 కోట్లతో ఈ పనులను జీహెచ్‌ఎంసీ చేపట్టింది.


నగరం నుంచి వరంగల్‌ వైపు వెళ్లే వారు ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు, బోడుప్పల్‌, మేడిపల్లి, చెంగిచర్ల చౌరస్తాల్లో ట్రాఫిక్‌ రద్దీతో తీవ్ర ఇబ్బందులు పడ్తున్నారు. వీటికి చెక్‌పెట్టేలా రామంతాపూర్‌ మోడ్రన్‌ బేకరీ నుంచి నారపల్లి వరకు వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి కార్యక్రమం (ఎస్‌ఆర్‌డీపీ)లో భాగంగా ఎలివేటెడ్‌ కారిడార్‌ నిర్మాణం ప్రతిపాదించారు. రూ.960 కోట్లతో నిర్మించ తలపెట్టిన ఈ కారిడార్‌ పనులకు మే 2018లో కేంద్ర మంత్రి నితిన్‌ గడ్కరీ శంకుస్థాపన చేశారు. నాలుగు లేన్లుగా 6.4 కి.మీ.ల మేర కారిడార్‌ నిర్మించాలని నిర్ణయించారు. 


ఇలా వెళ్లొచ్చు..

- కారిడార్‌లో కొంత మేర పనులు జీహెచ్‌ఎంసీ చేస్తోంది. నారపల్లి నుంచి ఉప్పల్‌ రింగ్‌ రోడ్డులోని శ్మశాన వాటిక వరకు ఎన్‌హెచ్‌ఏఐలోని ఆర్‌అండ్‌బీ అధికారులు పనులు చేపట్టారు. శ్మశాన వాటిక నుంచి రామంతాపూర్‌ వైపు అనుసంధాన నిర్మాణానికి జీహెచ్‌ఎంసీ శ్రీకారం చుట్టింది. నారపల్లి నుంచి అంబర్‌పేట వైపు వెళ్లాలంటే వాహనాలు మోడ్రన్‌ బేకరీ వద్ద దిగొచ్చు. అంబర్‌పేట నుంచి నారపల్లి వైపు వెళ్లే వాహనాలు మోడ్రన్‌ బేకరీ వద్ద వంతెన ఎక్కాల్సి ఉంటుంది. 


- నారపల్లి నుంచి వచ్చే వాహనదారులు సికింద్రాబాద్‌ వైపునకు వెళ్లాలంటే ఉప్పల్‌ స్టేడియం ముందున్న రోడ్డు మీదుగా వెళ్లవచ్చు. దీనికోసం కారిడార్‌కు అనుసంధానంగా స్టేడియం రోడ్డు వైపు గ్రేడ్‌ సేపరేటర్‌ నిర్మిస్తున్నారు. సికింద్రాబాద్‌ వైపు నుంచి వచ్చే వారు ఉప్పల్‌ రింగ్‌ రోడ్డు వద్ద వంతెన ఎక్కాల్సి ఉంటుంది.


ఎలివేటెడ్‌ కారిడార్‌

ఎలివేటెడ్‌ కారిడార్‌ను మెట్రో పైనుంచి నిర్మించేలా డిజైన్‌ చేసినట్టు ఇంజరింగ్‌ విభాగం వర్గాలు చెబుతున్నాయి. శ్మశాన వాటిక వద్దకు వచ్చే వరకు కారిడార్‌ ఎత్తు పెరిగేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఇందుకోసం అదనపు స్టీల్‌ వినియోగించనున్నారు. ఒకే కారిడార్‌ పనులు నారపల్లి వైపు నుంచి ఎన్‌హెచ్‌ఏఐ, రామంతాపూర్‌ వైపు నుంచి జీహెచ్‌ఎంసీ చేపడుతున్నాయి. వేర్వేరుగా చేపట్టిన కారిడార్‌ శ్మశాన వాటిక వద్ద కలువ నుంది. ఇందుకోసం రెండు విభాగాల అధికారులు నిపుణులతో చర్చించి డిజైన్‌ రూపొందించారు. ఇప్పటికే చౌరస్తాలో స్కై వాక్‌ల నిర్మాణ పనులు జరుగుతున్నాయి. స్కై వాక్‌, మెట్రో కారిడార్‌ పై నుంచి కొత్త వంతెన నిర్మించనున్నారు. ప్రస్తుతం సికింద్రాబాద్‌ ప్యారడైజ్‌ వద్ద నాగోల్‌-మియాపూర్‌ మెట్రో కారిడార్‌పై ఫలక్‌నుమా- జేబీఎస్‌ మెట్రో కారిడార్‌ నిర్మించారు. ఉప్పల్‌లో అందుకు భిన్నంగా మెట్రో కారిడార్‌పై వంతెన రానుంది.


ఎన్‌హెచ్‌ఏఐ పనుల్లో తీవ్ర జాప్యం..

నాలుగేళ్ల క్రితం కారిడార్‌ నిర్మాణ పనులకు శంకుస్థాపన జరుగగా, యేడాది అనంతరం పనులు ప్రారంభమయ్యాయి. మూడేళ్లవుతున్నా ఇప్పటికీ 40 శాతం నిర్మాణం పూర్తవలేదు. ఆస్తుల సేకరణ పూర్తయితే కానీ, పనులు ప్రారంభించేది లేదని గతంలో స్పష్టం చేసిన ఎన్‌హెచ్‌ఏఐ అధికారులు, స్థలం అప్పగించిన అనంతరం వేగంగా పనులు చేయడంలో విఫలమయ్యారన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఉప్పల్‌- నారపల్లి కారిడార్‌ పనులు ప్రస్తుత స్పీడుతో కొనసాగితే మరో రెండేళ్లయినా పూర్తయ్యే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో మేడిపల్లి నుంచి ఉప్పల్‌ రావడానికి ఒక్కోసారి గంట పడుతోంది. కారిడార్‌ పూర్తయితే ట్రాఫిక్‌ ఇబ్బందుల పరిష్కారం ఏమో కానీ,  నిర్మాణం జరుగుతోన్న సమయంలో నరక యాతన అనుభవిస్తున్నామని చంగిచర్ల లో ఉండే మల్లం శంకర్‌ పేర్కొన్నారు.

Updated Date - 2022-05-02T16:56:42+05:30 IST