అప్పటి వరకు ఒక జీవితం గడిపిన వారు.. పెళ్లి తర్వాత కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారు. అలాగే కొత్తగా బరువు బాధ్యతలు, కొత్త బంధుత్వాలు ఏర్పడతాయి. కొత్త జీవితానికి వేదికగా నిలిచే పెళ్లికి సంబంధించిన జ్ఞాపకాలను.. ప్రతి ఒక్కరూ జీవితాంతం గుర్తు చేసుకుంటుంటారు. అలాంటి వివాహ వేడుకలను ఎవరికి వారు.. వారికి ఉన్నంతలో ఘనంగా చేసుకునేందుకు ప్రయత్నిస్తుంటారు. రాజస్థాన్‌లో ఇద్దరు అన్నదమ్ములు కూడా వారి పెళ్లి ఏర్పాట్లను వైభవంగా చేసుకున్నారు. వివాహ మండపానికి పెళ్లి కుమార్తెలను తీసుకొచ్చేందుకు వెళ్లారు. తీరా అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు. వివరాల్లోకి వెళితే..
రాజస్థాన్ రాష్ట్రం చురులో సుమన్, సునీత్ అనే అన్నదమ్ములు నివాసం ఉంటున్నారు. ఇటీవల వీరు పెళ్లి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలో వీరికి సిర్సాలోని జేజే కాలనీకి చెందిన మ్యారేజ్ బ్రోకర్ పరిచయమయ్యాడు. ఇద్దరికీ పెళ్లి సంబంధం కుదిర్చేందుకు రూ.1.50లక్షలకు ఒప్పందం చేసుకున్నాడు. అనంతరం వీరికి సిర్సాకు చెందిన ఇద్దరు యువతులతో పెళ్లి కుదిర్చాడు. ఇరు వైపు కుటుంబాలు మాట్లాడుకుని.. మార్చి 24న పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేసుకున్నారు. దీంతో పెళ్లి ఏర్పాట్లన్నీ చేసుకున్నారు. గురువారం బంధువులంతా గ్రామానికి చేరుకున్నారు.
అన్నదమ్ములు ఇద్దరూ పెళ్లి దుస్తులు వేసుకుని.. బంధువులతో కలిసి పెళ్లి కుమార్తెల గ్రామానికి చేరుకున్నారు. అయితే తీరా పెళ్లికుమార్తెల ఇంటికి వెళ్లగా అక్కడ సీన్ చూసి షాక్ అయ్యారు. ఇంటికి తాళాలు వేసి ఉండడంతో వారికేమీ అర్థం కాలేదు. వెంటనే మ్యారేజ్ బ్రోకర్‌కు ఫోన్ చేయగా.. స్విచ్ఛాప్ వచ్చింది. దీంతో మోసపోయామని తెలుసుకుని.. అటునుంచి అటే పోలీస్ స్టేషన్‌కి చేరుకున్నారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి