ప్రైవసీకి కొత్త ‘సిగ్నల్‌’!

ABN , First Publish Date - 2021-01-17T18:48:01+05:30 IST

మూడో చెవిన పడకుండా మాట్లాడే స్వేచ్ఛ కావాలి... ఫోన్లలోని సమాచారం అంగట్లో సరుకవ్వకుండా భద్రతనిచ్చే భరోసా కావాలి. ఉద్యమాలకు ఊపిరిపోసే రహస్య ప్రసార సాధనం కానే కావాలి... వీటన్నిటికీ హామీ ఇవ్వలేని ఫేస్‌బుక్....

ప్రైవసీకి కొత్త ‘సిగ్నల్‌’!

మూడో చెవిన పడకుండా మాట్లాడే స్వేచ్ఛ కావాలి... ఫోన్లలోని సమాచారం అంగట్లో సరుకవ్వకుండా భద్రతనిచ్చే భరోసా కావాలి. ఉద్యమాలకు ఊపిరిపోసే రహస్య ప్రసార సాధనం కానే కావాలి... వీటన్నిటికీ హామీ ఇవ్వలేని ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో నడిచే వాట్సాప్‌ నుంచి బయటికి వచ్చాడు ‘బ్రియాన్‌ ఆక్టన్‌’. వచ్చీరాగానే ఊరుకోలేదు. ‘మీ ప్రైవసీకి నాదీ హామీ’ అంటూ ప్రపంచానికి కొత్త ‘సిగ్నల్‌’ అందించాడు. వాట్సాప్‌ సమాచారాన్ని వాణిజ్య అవసరాలకు వాడుకుంటామన్న ప్రకటన వెలువడ్డాక ‘సిగ్నల్‌’కు యూజర్లు వెల్లువెత్తారు. దాంతో హీరో అయ్యాడు బ్రియాన్‌...


2009: ఫేస్‌బుక్‌ ప్రధాన కార్యాలయం, కాలిఫోర్నియా..

ఫేస్‌బుక్‌లో ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకున్న బ్రియాన్‌ ఆక్టన్‌ను మార్క్‌ జూకర్‌బర్గ్‌ ఇంటర్వ్యూ చేస్తున్న సన్నివేశం...

జూకర్‌బర్గ్‌: ‘ఏంటి ప్రపంచయాత్ర చేయడం కోసం యాహూలో ఉద్యోగం వదిలేశావా? హామ్‌... ఎక్కడా స్థిరంగా ఉద్యోగం చేసే బాపతు కాదన్నమాట. సరే, నీ బలాలు.. బలహీనతలు ఏంటో చెప్పు?

ఆక్టన్‌: విలువలకు కట్టుబడి సంపాదించడం.. ఏదైనా కష్టపడి సాధించే మొండితనం నా బలాలు.. పారదర్శకత లేకపోవడం, అబద్దాలు చెప్పడం, మోసగించడం, దురుద్దేశం వంటి వాటిని సహించలేకపోవడం నా బలహీనతలు..




చిన్నప్పుడే చురుకైనవాడు..

అమెరికాలోని మిచిగాన్‌లో (1972, ఫిబ్రవరి)ని మధ్యతరగతి కుటుంబంలో పుట్టాడు బ్రియాన్‌ ఆక్టన్‌. ఆయన తండ్రి గోల్ఫ్‌కోర్సు ఉద్యోగి. వేన్నీళ్లకు చన్నీళ్లు తోడవుతాయని తల్లి ఓ చిన్న సరుకు రవాణా సంస్థను నడిపేది. ఫ్లోరిడాలోని లేక్‌ హోవెల్‌ హైస్కూల్‌లో చదువు పూర్తయింది. అతని మేధస్సు చూసి పెన్సిల్వేనియా విశ్వవిద్యాలయం పూర్తి ఉపకార వేతనం ఇస్తూ... ఇంజనీరింగ్‌లో ప్రవేశం కల్పించింది. ఏడాది పోయాక ప్రపంచ ప్రఖ్యాత స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం పిలిచి మరీ సీటిచ్చింది. 1994లో అక్కడ కంప్యూటర్‌ సైన్సును పూర్తిచేశాడు. రాక్‌వెల్‌ ఇంటర్నేషనల్‌లో కంప్యూటర్‌ ఇంజినీర్‌గా ఉద్యోగం వచ్చింది. ఆ తరువాత టెస్టింగ్‌ ఇంజనీర్‌గా ఆపిల్‌లో చేరాడు. రెండేళ్లు గడిచాక ఆ ఉద్యోగం మానేసి.. అడోబ్‌లో క్వాలిటీ ఇంజనీర్‌గా మారాడు. సంపాదించిన డబ్బులన్నిటినీ తీసుకెళ్లి వెబ్‌సైట్ల వ్యాపారంలో పెట్టాడు. 2000 సంవత్సరంలో వచ్చిన డాట్‌కామ్‌ సంక్షోభంతో పెట్టుబడి మొత్తం తుడిచిపెట్టుకుపోయింది.


ఉద్యోగం వదిలేసి తిరిగాడు..

మళ్లీ ఉద్యోగమే దిక్కయింది. ఈసారి యాహూ సెర్చ్‌ ఇంజన్‌ సంస్థలో చేరి... నిలకడగా పదేళ్లపాటు ఉన్నాడు బ్రియాన్‌ ఆక్టన్‌. ఆ సంస్థలో ప్రకటనల విభాగానికి వైస్‌ ప్రెసిడెంట్‌గా ఎదిగాడు. యాహూలో పనిచేస్తున్నప్పుడే జాన్‌ కౌమ్‌తో పరిచయమైంది. ‘ఉద్యోగమే ప్రపంచం కాదు. అసలైన లోకం బయట ఉంది. భూగోళమంతా గిర్రున తిరిగేయాలి మిత్రమా? అప్పుడే జీవితంలోని మజా తెలిసేది’ అనుకున్నారిద్దరూ. ఉద్యోగాలకు రాజీనామా చేసి ప్రపంచయాత్రకు సిద్ధమయ్యారు. సుమారు సంవత్సరం పాటు దక్షిణ అమెరికా మొత్తం తిరిగారు. సుదీర్ఘ పర్యటనతో మనసు తేలికైంది కానీ, జేబులు మాత్రం ఖాళీ అయ్యాయి. అప్పుడే పుట్టుకొచ్చిన ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌ల గురించి ప్రపంచమంతా మాట్లాడుకుంటున్నారు. తిరిగి ఉద్యోగవేట ప్రారంభించిన మిత్రులు ఆ రెండు సంస్థలకు దరఖాస్తు చేశారు. కచ్చితంగా పిలుపు వస్తుందన్న నమ్మకంతో ఎదురుచూశారు. కానీ, ‘క్షమించండి, మీరు సెలెక్ట్‌ కాలేదు’ అంటూ చావు కబురు చల్లగా వచ్చింది.


ఐ ఫోన్‌తో ఆలోచన..

ఆ రెండు సంస్థల్లో ఏదో ఒక ఉద్యోగం వస్తుందన్న ఆనందంలో అప్పుడే వచ్చిన ఆపిల్‌ ఐఫోన్‌ 3 కొనుక్కున్నాడు బ్రియాన్‌ ఆక్టన్‌. ఆ కొత్త ఫోన్‌లోని యాప్‌ స్టోర్‌లో బోలెడు యాప్స్‌ ఆకట్టుకున్నాయి. బ్లాక్‌బెర్రీ ఫోన్ల కోసం బిబిఎం చాటింగ్‌ ఉంది, ఆండ్రాయిడ్‌ ఫోన్ల కోసం జి టాక్‌, వీడియో చాటింగ్‌ కోసం స్కైప్‌ ఉన్నాయి. కానీ, ఐ ఫోన్‌ యూజర్ల కోసం సరైన చాటింగ్‌ యాప్‌ లేకపోవడం వెలితిగా అనిపించింది. అన్ని స్మార్ట్‌ఫోన్లలో ఉపయోగించగలిగే కమ్యూనికేషన్‌ కోసం మెసెంజర్‌ యాప్‌ను రూపొందిస్తే? అనే ఆలోచన వచ్చింది ఆ ఇద్దరు మిత్రులకు. వెంటనే ఓ సరికొత్త యాప్‌ను తయారుచేశారు. అదే వాట్సాప్‌ మెసెంజర్‌ యాప్‌. వాట్సాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చి నెలలు గడిచినా... ఎవరూ పెద్దగా డౌన్‌లోడ్‌లు చేసుకోలేదు. చేసుకున్న కొందరేమో- యాప్‌ వల్ల ఫోన్లు మాటిమాటికీ హ్యాంగ్‌ అవుతున్నాయంటూ.. అన్‌ఇన్‌స్టాల్‌ చేసేవారు.


యాప్‌లోని లోటుపాట్లను సరిదిద్ది, మెరుగుపరిచేందుకు చేతిలో డబ్బులు కూడా లేవు. దాంతో విసుగెత్తిన జాన్‌కౌమ్‌ చేతులెత్తేశాడు. ఒక రోజు బ్రియాన్‌ ఆక్టన్‌తో ‘ఇక చాలు మిత్రమా... ఉద్యోగాలు చూసుకుందాం’ అన్నాడతను. ‘లేదు జాన్‌ ... కొన్నాళ్లు ఓపిక పట్టు. నేను మిత్రుల దగ్గర అప్పుగా కొంత మొత్తాన్ని తీసుకొస్తాను. దాంతో కంపెనీలో పెట్టుబడిపెట్టి వాట్సాప్‌ను మరింత మెరుగ్గా మారుద్దాం..’ అన్నాడు. యాహూలో పనిచేసే కొందరు సహోద్యోగులను అడిగి రెండున్నర లక్షల డాలర్లను పెట్టుబడిగా తీసుకొచ్చాడతను. ఆ డబ్బుతో వాట్సాప్‌లోని సాంకేతిక లోపాలను సరిదిద్ది వాట్సాప్‌ 2.0 వెర్షన్‌ను తీసుకొచ్చాడు.


వాట్సాప్‌ను హిట్‌ చేసి..

2014 వచ్చేసరికి వాట్సాప్‌ పెద్ద హిట్‌ అయ్యింది. యూజర్ల సంఖ్య కోట్లకు చేరుకుంది. వాట్సాప్‌ లేని ఫోనే లేదు. పొద్దున్నే నిద్రలేవగానే వాట్సాప్‌ను చెక్‌ చేసుకోవడం... రాత్రి పొద్దుపోయే వరకు అందులో చాటింగ్‌ చేస్తుండటం... ఇదే అందరికీ వ్యసనంగా మారింది. ప్రపంచవ్యాప్తంగా ఆ యాప్‌ విస్తరించడంతో... ఫేస్‌బుక్‌ అధినేత మార్క్‌ జూకర్‌బర్గ్‌ అప్రమత్తమయ్యాడు. అదే సంవత్సరం లక్షన్నర కోట్లు వెచ్చించి వాట్సాప్‌ను కొనుగోలు చేశాడు. ఒకప్పుడు తమకు ఉద్యోగం ఇవ్వడానికి నిరాకరించిన ఆ అధినేతే ఇప్పుడు తమ వాట్సాప్‌ను కొనుగోలు చేయాల్సి వచ్చింది.. అని మనసులో అనుకున్నారు బ్రియాన్‌ ఆక్టన్‌, జాన్‌ కౌమ్‌. ఆ డీల్‌తో కోటీశ్వరులయ్యారు.  అమెరికా, యూకే పత్రికలన్నీ ఇద్దరు మిత్రుల విజయాన్ని ఆకాశానికి ఎత్తేశాయి. ఒప్పందం ప్రకారం - కనీసం మూడేళ్ల వరకు ఫేస్‌బుక్‌ ఆధ్వర్యంలో వాట్సాప్‌ నిర్వహణ బాధ్యత చేపట్టాలి. పోటీగా మరో యాప్‌ను సృష్టించకూడదు. అప్పుడే డబ్బు పూర్తిగా ముడుతుంది.. అన్నది ఫేస్‌బుక్‌ యాజమాన్య షరతు.


ఫేస్‌బుక్‌తో విభేదించి..

2016 వచ్చేసరికి ఫేస్‌బుక్‌ ఆలోచన మారింది. వాట్సాప్‌ యూజర్ల వివరాలను ఫేస్‌బుక్‌ కోసం వాడుకునేందుకు, అందులో ప్రకటనలు చొప్పించి డబ్బులు సంపాదించేందుకు ఎత్తుగడ వేసింది ఆ సంస్థ. ఇద్దరు మిత్రుల ముందు ఆ ప్రతిపాదన పెట్టాడు జూకర్‌బర్గ్‌. ఎంతో అపురూపంగా తయారుచేసిన వాట్సాప్‌ను అక్రమమార్గంలో ఉపయోగించుకోవాలను కోవడం, యూజర్ల గోప్యతకు భంగం కలిగించేందుకు ప్రయత్నించడం... ఆక్టన్‌కు నచ్చలేదు. జూకర్‌బర్గ్‌ ప్రతిపాదనకు అస్సలు ఒప్పుకోలేదు. అభిప్రాయబేధం చిలికి చిలికి గాలి వానలా మారింది. వాట్సాప్‌ డేటాను ఒక రకంగా చౌర్యం చేసి, వాళ్ల నమ్మకాన్ని వమ్ము చేయడం కన్నా... ఫేస్‌బుక్‌ నుంచి వైదొలగడమే మేలన్న నిర్ణయానికి వచ్చాడు బ్రియాన్‌ ఆక్టన్‌. ఒప్పందం ప్రకారం మరో ఆర్నెళ్లు గడువు ఉండగానే... ఫేస్‌బుక్‌ నుంచి బయటికి రావడం వల్ల... తనకు రావాల్సిన ఏడు వేల కోట్ల రూపాయలను వదులుకోవాల్సి వచ్చింది. రాజీ అయితే బావుంటుందని మధ్యవర్తులు బతిమాలారు. విలువలే ఊపిరిగా బతికే రకం. బ్రియాన్‌ రాజీ పడలేదు. 


లాభాపేక్షలేని సంస్థగా...

వాట్సాప్‌ ప్రపంచానికి ఎందుకంత నచ్చింది? యూజర్ల గోప్యత కోసం ఎండ్‌ టు ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ (మెసేజ్‌ పంపిన వారు... అందుకున్న వారు మాత్రమే చూడగలరు) సాంకేతికతతో తయారుచేయడం వల్ల. యూజర్లకు రక్షణగా నిలిచే ఆ గోప్యతను ఫేస్‌బుక్‌ వాణిజ్యానికి వాడుకోవాలనుకోవడం బ్రియాన్‌కు నచ్చలేదు. అప్పట్లో వాట్సాప్‌ రూపకల్పనకు సహాయపడిన మోక్సీ మార్లిన్‌ స్పైక్‌ 2014లో ‘సిగ్నల్‌’ యాప్‌ను రూపొందించాడు. యూజర్ల డాటాకు రక్షణ (సెక్యూరిటీ), వ్యక్తిగత గోప్యత (ప్రైవసీ)లను సంరక్షించడమే ప్రధాన ధ్యేయంగా పుట్టింది ‘సిగ్నల్‌’. అయితే అప్పటికింకా అంత ప్రాచుర్యం పొందలేదు.


2017లో ఫేస్‌బుక్‌ నుంచి బయటికొచ్చిన బ్రియాన్‌ వెంటనే వెళ్లి మోక్సీని కలుసుకున్నాడు. ‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న యూజర్ల భావ వ్యక్తీకరణ స్వేచ్ఛను కాపాడాలి. వారి ప్రైవసీకి భంగం వాటిల్లకూడదు. ఆ ఫోన్‌నెంబర్లు, సమాచారం వాణిజ్య అవసరాలకు మళ్లించకూడదు. అప్పుడే అన్ని దేశాల యూజర్లకు ఒక నమ్మకమైన, బలమైన కమ్యూనికేషన్‌ దొరుకుతుంది. అదే మన భావజాలం కావాలి. అప్పుడే సిగ్నల్‌కు పేరొస్తొంది’ అని చెప్పాడు బ్రియాన్‌. అలా నడపాలంటే ముందుగా లాభాపేక్ష లేని సంస్థగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించాడు. 


రూ.350 కోట్ల విరాళం...

2018లో బ్రియాన్‌, మోక్సీ కలిసి ‘సిగ్నల్‌ టెక్నాలజీ ఫౌండేషన్‌’ స్థాపించారు. ఇది లాభాపేక్షలేని సంస్థ. ఎటువంటి ప్రతిఫలం ఆశించకుండా బ్రియాన్‌ ఆక్టన్‌ ఆ సంస్థకు ఇచ్చిన విరాళం రూ.350 కోట్లు. ఆయన వితరణను చూశాక... ఫ్రీడమ్‌ ఆఫ్‌ ది ప్రెస్‌ ఫౌండేషన్‌తో పాటు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ కూడా ఆర్థిక సహాయం అందించాడు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అన్ని చాటింగ్‌ యాప్స్‌లోకెల్లా అత్యంత విశ్వసనీయమైన యాప్‌గా ‘సిగ్నల్‌’ ప్రఖ్యాతి పొందింది. ఓపెన్‌సోర్స్‌ అప్లికేషన్‌ సాఫ్ట్‌వేర్‌ ఆధారంగా ‘సిగ్నల్‌’ను రూపొందించారు. యాప్‌ నిర్మాణానికి వాడిన కోడ్‌ను బహిరంగంగా అందుబాటులో ఉంచారు.


ఏ వ్యక్తి, ఏ సంస్థ అయినా ‘సిగ్నల్‌’ యాప్‌ కోడ్‌ను పరికించి చూసి లోటుపాట్లను తెలుసుకోవచ్చు. వాట్సాప్‌ క్లోజ్డ్‌ సోర్స్‌ కావడం వల్ల అవకతవకలు ఎవరికీ తెలిసే అవకాశం లేదు. నేడు సురక్షితంగా వ్యక్తిగత మెసేజ్‌లు పంపుకోవడానికి సిగ్నల్‌ను మించిన యాప్‌ మరొకటి లేదు. ఎందుకంటే ఇది లాభాపేక్ష లేని సంస్థ కాబట్టి!. ‘‘ప్రపంచానికి ఇప్పుడు కావాల్సింది ఒట్టి టెక్నాలజీనే కాదు... వ్యక్తిగత భావ ప్రకటనా స్వేచ్ఛ కూడా. ఆ పనిని ‘సిగ్నల్‌’ చేస్తుంది...’ అంటున్న బ్రియాన్‌ ఆక్టన్‌ ఇప్పుడు ప్రతి స్మార్ట్‌ఫోన్‌ యూజర్‌కు నచ్చిన కొత్త హీరో. 



‘మేము ‘సిగ్నల్‌’యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని వాడుతున్నాం. మరి మీరు...?’

- ఎలన్‌ మస్క్‌, టెస్లా, జాక్‌ డోర్సే, ట్విటర్‌


మనం అనుకున్నది నెరవేరగానే తిరుపతి కొండకు మొక్కు చెల్లించుకుంటాం. కానీ బ్రియాన్‌ ఆక్టన్‌ మానవత్వాన్ని చాటుకున్నాడు. వాట్సాప్‌ను అమ్మగా వచ్చిన మొత్తంలో రెండువేల కోట్ల రూపాయలను సిలికాన్‌ వ్యాలీ కమ్యూనిటీ ఫౌండేషన్‌కు విరాళంగా ఇచ్చాడు. 


అమెరికాలో ఇటీవల జరిగిన నల్లజాతీయుల ఉద్యమానికి ‘సిగ్నల్‌’ యాప్‌ వెన్నుదన్నుగా నిలిచింది. ఇదివరకు ఉద్యమకారులు ఫోన్లలో మాట్లాడుకునే వ్యూహాలు ప్రభుత్వానికి తెలిసిపోయేవి. రాత్రికి రాత్రే అరెస్టులు జరిగేవి. ఉద్యమకారులు వ్యూహం మార్చి... ‘సిగ్నల్‌’లో మాట్లాడుకోవడం, గ్రూప్‌లలో చాటింగ్‌ చేసుకోవడంతో పోలీసులకు తలనొప్పిగా మారింది. ఎందుకంటే ఈ యాప్‌ను ట్రాప్‌ చేయడం ఎవరితరం కాదు. 


ఫోన్‌ ఐడి, యూజర్‌ ఐడి, ఫోన్‌ నెంబరు, ఈ మెయిల్‌, ఫోన్‌ కాంటాక్ట్స్‌, పేమెంట్స్‌....వీటన్నిటినీ వాట్సాప్‌ సేకరిస్తుంది. వాట్సాప్‌తో పోలిస్తే సిగ్నల్‌ యాప్‌ కేవలం యూజర్ల ఫోన్‌ నెంబర్లను మాత్రమే సేకరిస్తుంది. మెటాడేటాను రహస్యంగానే ఉంచు తుంది. బయటికి వెళ్లనీయదు. అమ్మకానికి పెట్టదు.



- సునీల్‌ ధవళ, 97417 47700 సీయీవో,

ద థర్డ్‌ అంపైర్‌ మీడియా అండ్‌ అనలిటిక్స్‌


Updated Date - 2021-01-17T18:48:01+05:30 IST