కరోనా నుంచి కోలుకున్న వారికి.. కొత్త సమస్యలు!

ABN , First Publish Date - 2021-08-24T06:09:23+05:30 IST

కరోనా నుంచి కోలుకున్న..

కరోనా నుంచి కోలుకున్న వారికి.. కొత్త సమస్యలు!

ఆయాసం, నీరసం...

కరోనా నుంచి కోలుకున్న వారిని వెంటాడుతున్న అనారోగ్య సమస్యలు

ఇంకా కండరాల బలహీనత, నిద్రలేమి, ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌, పేగు వాపు

రోజుల తరబడి జ్వరం

కొంతమందికి హై షుగర్‌ కనిపిస్తోందంటున్న వైద్యులు

ఇన్సులిన్‌ వినియోగిస్తే కానీ అదుపులోకి రాని పరిస్థితి

ఎటువంటి సమస్య వచ్చినా అశ్రద్ధ చేయవద్దంటున్న నిపుణులు


(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): కరోనా నుంచి కోలుకున్న ఎంతోమందిని ఇప్పుడు ఇతర అనారోగ్య సమస్యలు వేధిస్తున్నాయి. కొవిడ్‌ నుంచి కోలుకున్నామన్నా సంతోషం లేకుండా పోయిందని, నెలల తరబడి ఆస్పత్రుల చుట్టూ తిరగాల్సి వస్తోందని పలువురు వాపోతున్నారు. కరోనా నుంచి కోలుకున్న వారిలో ఎక్కువగా ఆయాసం, కండరాల బలహీనత, తీవ్రమైన నీరసం, నిద్ర పట్టకపోవడం వంటి సమస్యలు కనిపిస్తున్నాయి. అలాగే, కొందరిలో గ్యాస్ర్టిక్‌ సంబంధిత సమస్యలు, షుగర్‌ కంట్రోల్‌ కాకపోవడం, ఎక్కువ రోజులపాటు జ్వరం వంటివి ఉంటున్నాయి. 


కొవిడ్‌ సమయంలో వినియోగించిన మందుల వల్ల ఎక్కువ మందిలో గ్యాస్ర్టిక్‌ సమస్యలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. అదేవిధంగా కరోనా నుంచి కోలుకున్న కొంతమందిలో షుగర్‌ బయటపడుతోందంటున్నారు. కొందరికి మాత్రలతో అదుపులోకి వస్తోందని, ఎక్కువ మందికి ఇన్సులిన్‌ ఇవ్వాల్సి వస్తోందంటున్నారు. ఇకపోతే, ఎక్కువ మందిని ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ (బ్లాక్‌ ఫంగస్‌ కాదు..ఇతర ఫంగస్‌) వేధిస్తోంది. ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌తో రోజుల తరబడి తీవ్రమైన జ్వరం ఉంటోంది. కొందరికి సీటీ స్కాన్‌ చేసి, మరికొందరికి బ్రాంకోస్కోపీ ద్వారా కఫం పరీక్ష నిర్వహించి ఈ ఫంగల్‌ ఇన్‌ఫెక్షన్‌ను నిర్ధారిస్తున్నారు. 


ఎక్కువ మందిలో ఆయాసం

కొవిడ్‌ అనంతరం ఎక్కువశాతం మందిలో కనిపిస్తున్న ప్రధానమైన సమస్య తీవ్రమైన ఆయాసం. మెట్లు ఎక్కినా, కొంతదూరం నడిచినా తీవ్రమైన ఆయాసం వస్తోంది. దీనికి ప్రధాన కారణం పల్మనరీ ఎంబోలిజమ్‌, డీప్‌ వియిన్‌ త్రాంబోసిస్‌గా వైద్యులు పేర్కొంటున్నారు. ఊపిరితిత్తుల్లో రక్తం గడ్డ కడితే పల్మనరీ ఎంబోలిజమ్‌, కాళ్లు, చేతులకు సంబంధించిన రక్తనాళాల్లో రక్తం గడ్డ కడితే డీప్‌ వియిన్‌ త్రాంబోసిస్‌గా నిపుణులు పేర్కొంటున్నారు. కొవిడ్‌తో చికిత్స పొందుతున్న సమయంలో రక్తం పలచబడడానికి వినియోగించిన మందులను ఆ తరువాత నిలిపివేయడం వల్ల ఈ సమస్య ఉత్పన్నమవుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు.


కాళ్లు, చేతుల నరాలు, భుజం దగ్గర బ్లడ్‌ క్లాట్‌ అయి ఆ ప్రాంతమంతా చచ్చుబడి పోవడం వంటి లక్షణాలు కనిపిస్తుంటాయి. ఆయాసంతో బాధపడుతున్న వారికి డీ డైమర్‌ పరీక్ష నిర్వహించగా హార్టు రేట్‌ అబ్‌నార్మల్‌గా వుంటున్నట్టు వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కరోనాతో సమయంలో వినియోగించిన స్టెరాయిడ్స్‌, ఇమ్యునోసప్రెషన్‌ మందుల వల్ల కొందరిలో పేగు వాపు కనిపిస్తున్నట్టు వైద్యులు చెబుతున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలతో వస్తున్న వారికి వైద్య నిపుణులు పెరిటిన్‌, సీఆర్‌పీ, డీ డైమర్‌, ఎల్‌డీహెచ్‌, షుగర్‌, ఈసీజీ, థైరాయిడ్‌ వంటి పరీక్షలను చేయిస్తున్నారు. 


ఆరు వారాలు దాటుతున్నా.. 

సాధారణంగా కొవిడ్‌ నుంచి కోలుకున్న వారిలో ఈ తరహా సమస్యలు రెండు నుంచి ఆరు వారాల్లో తగ్గుముఖం పడుతుంటాయి. అయితే రెండు, మూడు నెలలు గడుస్తున్నా ఎక్కువ మందిని ఈ సమస్యలు వెంటాడుతున్నట్టు వైద్యులు పేర్కొంటున్నారు. నెలలు గడుస్తున్నా తగ్గుముఖం పట్టకపోవడానికి గల కారణాలు తెలియడం లేదని, పోస్ట్‌ కొవిడ్‌ సమస్యలపై విస్తృత పరిశోధనలు జరగాల్సిన అవసరముందని వైద్య నిపుణులు పేర్కొంటున్నారు. 


ప్రతిరోజూ పదుల సంఖ్యలో బాధితులు: డాక్టర్‌ కొత్తకోట రాజు, పల్మనాలజిస్ట్‌, మెడికవర్‌ హాస్పిటల్స్‌

పోస్ట్‌ కొవిడ్‌ ఇష్యూస్‌ ఎక్కువగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆయాసం, తీవ్రమైన జ్వరం, యాంగ్జైటీ వంటి సమస్యలతో ఎక్కువమంది వస్తున్నారు. ఆయా సమస్యలను బట్టి మందులు అందించడంతోపాటు కొంతమందికి కౌన్సెలింగ్‌ ఇస్తున్నాం. వారి సమస్యలను తెలుసుకుని అవసరమైన కొన్ని పరీక్షలు చేసిన తరువాత గానీ...సమస్యను నిర్ధారించలేకపోతున్నాం. గతంలో మాదిరిగా ఉత్సాహంగా ఉండలేకపోవడం, పని పట్ల శ్రద్ధ వహించలేకపోవడం వంటి ఇబ్బందులను ఎక్కువమంది ఎదుర్కొంటున్నారు. పోస్ట్‌ కొవిడ్‌ సమస్యల పట్ల అప్రమత్తంగా వుండడంతోపాటు సకాలంలో వైద్య నిపుణులను సంప్రతించడం వల్ల మెరుగైన ఫలితాలు సాధించేందుకు అవకాశముంటుంది.

Updated Date - 2021-08-24T06:09:23+05:30 IST