Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రాణాయామం శ్వాసే సమస్తం!

ఆంధ్రజ్యోతి(25-08-2020)

‘ఆగి, కొద్దిసేపు ఊపిరి పీల్చుకో! స్థిమితపడు!’ అని ఆందోళనపడేవారికి సలహా ఇస్తాం! ‘ఊపిరి సలపనంత పని!’ అంటూ కొన్నిసార్లు  హైరానా పడిపోతూ ఉంటాం! నిజం చెప్పాలంటే... ‘ఊపిరి’ అనే మాట మన మాటలకే పరిమితం అయిపోయింది. నిరంతరం మన ప్రమేయం లేకుండా జరిగిపోయే పని కాబట్టి ఊపిరి అందనప్పుడు తప్ప, ఊపిరి మీద మనకు ధ్యాస ఉండదు! కానీ కరోనా విస్తరించిన ప్రస్తుత సమయంలో అందరి చర్చా ఇప్పుడు ఊపిరి చుట్టే తిరుగుతోంది! ఊపిరి అందకపోవడం కరోనా వైరస్‌ బాధితుల తీవ్ర లక్షణం అనే విషయం అందరికీ తెలిసిందే!


అయితే ‘అంతటి తీవ్ర స్థితికి చేరుకోకుండా ఉండాలన్నా... కరోనా ప్రభావం నుంచి ఆరోగ్యాన్ని రక్షించుకోవాలన్నా... మరీ ముఖ్యంగా  ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుకోవాలన్నా... ప్రాణాయామం సాధన చేయాలి!’ అంటున్నారు పల్మనాలజిస్టు డాక్టర్‌ బోది సాయిచరణ్‌! శ్వాస ప్రక్రియ సాధనలు, వాటి ఆరోగ్య ప్రయోజనాల గురించి  ఆయన ఏమంటున్నారంటే...


ప్రాణాయామం చేకూర్చే ఆరోగ్య ప్రయోజనాల గురించిన అధ్యయనాలు, పరిశోధనలు ప్రపంచవ్యాప్తంగా జరుగుతూనే ఉన్నాయి. సుదర్శన క్రియ సాధన చేసిన మూడు నెలల్లో వ్యాధికారక క్రిములతో పోరాడే నేచురల్‌ కిల్లర్‌ సెల్స్‌ స్పష్టంగా పెరిగినట్టు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) చేపట్టిన పలు ప్రయోగాల్లో తేలింది.


వ్యాధిసోకడంతో వృద్ధి చెందే ఉమ్మిలోని ఇన్‌ఫ్లమేటరీ రసాయనాలు ప్రాణాయామం సాధనతో తగ్గినట్టు ఆల్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మెడికల్‌ సైన్సెస్‌ (ఎయిమ్స్‌) అమెరికాలో చేపట్టిన ఓ పరిశోధనలో తేలింది. ఇంతటి ప్రభావం కలిగిన ప్రాణాయామాన్ని కరోనా నుంచి రక్షణ కోసం సాధన చేయడం ఎంతో అవసరం.


మనం పీల్చే తీరిది..

సాధారణంగా మనం గాలి తీసుకుని వదిలే పరిమాణాన్ని టైడల్‌ వాల్యూమ్‌ అంటారు. గట్టిగా గాలి తీసుకొని వదిలే పరిమాణాన్ని ఫోర్స్‌డ్‌ వైటల్‌ కెపాసిటీ (ఎఫ్‌వీసీ) అంటారు. ఒక సెకనులో ఎంత బలంగా గాలిని వదులుతామో దానిని ఎఫ్‌ఈవీ1 అంటారు.


కోవిడ్‌ సోకినప్పుడు- టైడల్‌ వాల్యూమ్‌లో ఎటువంటి తేడా ఉండదు. కానీ ఎఫ్‌వీసీ, ఎఫ్‌ఈవీ1లలో తేడా వస్తుంది. ఈ తేడా ప్రభావం మన ఊపిరితిత్తులపై పడుతుంది. ఊపిరితిత్తులకు ప్రమాదం ఏర్పడుతుంది. ప్రాణాయామం వల్ల మన శరీరంలోకి ప్రవేశించే ఆక్సిజన్‌ శాతంలో ఎటువంటి తేడాలుండవు.


శ్వాస ఇలా...

శ్వాస తీసుకున్నప్పుడు పొట్ట వ్యాకోచించాలి. ఊపిరితో ఊపిరితిత్తులు నిండి విప్పారడం మూలంగా, వాటి అడుగున ఉంటే డయాఫ్రం నొక్కుకొని పొట్ట పైకి లేస్తుంది. ఇది సరైన శ్వాస పద్ధతి. దీన్నే వైద్య పరిభాషలో ‘డయాఫ్రమాటిక్‌ బ్రీతింగ్‌’ అంటారు. ప్రస్తుత ఒత్తిడితో కూడిన పరిస్తితుల్లో శ్వాస క్రమం తప్పుతోంది.


పరిగెత్తేటప్పుడో, ఊపిరి అందనప్పుడో తప్ప శ్వాస గురించి ఆలోచించం. అయితే ప్రాణాయామంలోలా అనుక్షణం దీర్ఘ శ్వాస తీసుకోవడం ఎవరికీ సాధ్యం కాదు. కానీ రోజులో వీలున్నప్పుడంతా దీర్ఘంగా శ్వాస తీసుకుని వదలడం సాధన చేయడం ఆరోగ్యకరం.


ప్రాణాయామంతో కరోనా కట్టడి!

ఊపిరితిత్తులను ప్రాణాయామంతో బలపరుచుకోవడం వల్ల కరోనా వైరస్‌ సోకినా, అది ఊపిరితిత్తుల్లోకి చేరుకునే అవకాశాలు తక్కువే! ఒకవేళ చేరినా ఆ అవయవం మీద వైరస్‌ ప్రభావం కూడా తక్కువగా, కోలుకునే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.


ప్రాణాయామం చేస్తున్నప్పటికీ కొవిడ్‌ బారిన పడితే, సాఽధన ఆపవలసిన అవసరం లేదు. శక్తి మేరకు ప్రాణాయామాన్ని నిరంతరం సాధన చేస్తే వ్యాధి నుంచి త్వరగా కోలుకోగలుగుతారు. అలాగే వ్యాధి నుంచి బయటపడిన వాళ్లు ఎవరైనా ప్రాణాయామాన్ని సాధన చేయడం మొదలుపెడితే ఊపిరితిత్తులు తిరిగి బలం పుంజకుంటాయి.


అదనంగా ప్రాణాయామం ఎందుకు?

ప్రతి ఒక్కరం ఊపిరి పీల్చుకుంటున్నాం. ఇది సహజసిద్ధ చర్య. అలాంటప్పుడు సాధారణ ఊపిరి పీల్చుకోవడానికి అదనంగా ప్రాణాయామం సాధన చేయవలసిన అవసరం ఏంటి? ప్రాణాయామం సాధన చేయకపోతే ఊపిరితిత్తులు బలహీనపడిపోయే ప్రమాదం ఉందా? అని అనుమానం రావచ్చు. అయితే ఇందుకు సమాధానంగా కొన్ని ఉదాహరణల గురించి చెప్పుకోవచ్చు.


నడిచేవాళ్లం, పరిగెత్తితే ఊపిరి కోసం వగరుస్తాం! గబగబా మెట్లు ఎక్కవలసివస్తే, అలసటతో ఉక్కిరిబిక్కిరి అవుతాం. దాంతో వేగంగా గాలి పీల్చుకుంటాం! బరువైన పనులు చేయవలసివచ్చినా ఇదే అనుభవానికి లోనవుతాం. ఇలా ఊపిరి కోసం వగర్చే ఇబ్బంది తలెత్తకుండా ఉండాలంటే ఊపిరితిత్తుల సామర్ధ్యాన్ని పెంచుకోవాలి.


గాలిలో కలిసి ఉండే కాలుష్యం ప్రభావం నుంచి తప్పించుకుని, ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండడానికి ఊపిరితిత్తులకు సరిపడా వ్యాయామం అందించాలి. అదే ప్రాణాయామం. దీన్ని సాధన చేస్తే, అలసటకు గురికాకుండా పనులు చేసుకోగలుగుతాం. వాతావరణంలో కలిసిన కాలుష్య ప్రభావం నుంచి రక్షణ పొందగలుగుతాం.


ప్రధాన అవయవాలన్నీ...

మనం ఆక్సిజన్‌ను పీల్చుకుని, కార్బన్‌డయాక్సైడ్‌ను వదులుతాం! శ్వాస గురించి మనకు తెలిసింది ఇంతవరకే! కానీ మన పూర్తి శరీరం, ఆరోగ్యాలపై ఊపిరి ప్రభావం ఉంటుంది. ఊపిరితో ప్రత్యక్ష సంబంధం కలిగి ఉండే ఊపిరితిత్తులతో పాటు మెదడు, గుండె, జీర్ణాశయం, మూత్రపిండాలు... ఇలా శరీరంలోని ప్రతి ప్రధాన అవయవం ఊపిరితో పరోక్ష సంబంధం కలిగి ఉంటాయి.


శ్వాసతో శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ చేరి, శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి. మన ఆలోచనలు, ఒత్తిళ్ళు, ఆందోళనలకు కేంద్రస్థానమైన మెదడును శ్వాసతో మెరుగ్గా పనిచేయించడం ద్వారా ఆరోగ్యం మీద పూర్తి పట్టు సాధించవచ్చు. శ్వాసతో శరీరంలోని ప్రతి కణానికి ఆక్సిజన్‌ చేరి, శరీర జీవక్రియలు సక్రమంగా జరుగుతూ ఉంటాయి.

నిమిషానికి ఆరుసార్లు...

అసంకల్పితంగా జరిగేపోతూ ఉండే చర్య కాబట్టి శ్వాస ఎలా తీసుకుంటున్నాం? ఎంత త్వరగా తీసుకుంటున్నాం? అనే విషయాల పట్ల మనకు ధ్యాస ఉండదు. సాధారణంగా మనందరం నిమిషానికి 15 నుంచి 18 సార్లు శ్వాస తీసుకుని వదులుతూ ఉంటాం. కానీ శ్వాస వేగాన్ని తగ్గించి, ఆరు నుంచి ఎనిమిది సార్లు ఊపిరి పీల్చుకుని వదలడం సాధన చేయాలి. అంటే శ్వాస లోపలికి పీల్చుకోవడానికి నాలుగైదు సెకండ్లు, వదలడానికి నాలుగైదు సెకండ్లు కేటాయించాలి.


ఇలా దీర్ఘ శ్వాసను సాధన చేస్తే, ఆ ప్రభావం మెదడు మీద, తద్వారా గుండె మీద పడుతుంది. ఇలా దీర్ఘ శ్వాస తీసుకున్నప్పుడు ఊపిరితిత్తులు పూర్తిగా విప్పారతాయి. దాంతో ఛాతీలోని కండరాలు కూడా సాగుతాయి. ఫలితంగా కొన్ని నాడులు ఉత్తేజితమై, కొన్ని సంకేతాలు మెదడుకు చేరతాయి. ఆ సంకేతాల వల్ల మెదడులోని సాంత్వన కేంద్రాలు ప్రేరేపితమై మనసు ఆహ్లాదంగా మారుతుంది. గుండె వేగం, రక్తపోటు తగ్గుతాయి. ఫలితంగా ఆందోళన, ఒత్తిడి తొలగిపోతాయి.


రోగనిరోధకశక్తి కోసం...

శరీరం ఆరోగ్యంగా ఉంటే, రోగనిరోధక శక్తి దానంతట అది సమర్థంగా పనిచేస్తూ ఉంటుంది. అయితే భయం, ఆందోళన, ఒత్తిడి, కుంగుబాటులకు లోనైతే రోగనిరోధకశక్తి సన్నగిల్లి తేలికగా వ్యాధులబారిన పడతాం. కరోనా విస్తరించిన ప్రస్తుత సమయంలో మనకు సోకుతుందేమో? సోకితే ఎలా? అనే భయాలు ఏర్పరుచుకుంటే రాత్రుళ్ళు నిద్రపట్టకపోవడం, రక్తపోటు పెరగడం, గుండె వేగంగా కొట్టుకోవడం లాంటివి జరుగుతాయి.


శరీరంలో చోటుచేసుకునే ఈ మార్పులన్నీ వ్యాధినిరోధక శక్తిని కుంటుపరిచేవే! కాబట్టి భయం వదిలి ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలి. ఈ భయం, ఆందోళనలు నెమ్మదించడం కోసం ప్రాణాయామం సాధన ఎంచుకోవాలి.


శ్వాసకు గుండెకు లంకె!

ప్రాణాయామం వల్ల గుండెలోని రక్తనాళాల లోపలి గోడలు పలుచన అవుతాయి. అడ్డంకులు ఏర్పడకుండా రక్తసరఫరా సజావుగా సాగుతుంది. గుండెపోటు సమస్యలు తలెత్తవు. శ్వాస తీసుకునే వేగాన్నిబట్టి మెదడులోని వేర్వేరు ప్రాంతాల్లో వేర్వేరు మార్పులు జరుగుతాయి.


మెదడులోని ప్రదేశాలన్నీ గుండెతో లింక్‌ అయి ఉంటాయి. కాబట్టే ప్రాణాయామంలో పలు రకాల శ్వాసక్రియలను సాధన చేయడం వల్ల ఊపిరితిత్తులతో పాటు మెదడు, జీర్ణవ్యవస్థ, గుండె కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఒత్తిడితో మెదడులో విడుదలయ్యే కార్టిసాల్‌, అడ్రినలిన్‌ హార్మోన్ల విడుదల నియంత్రణలోకి వస్తుంది.    


ప్రాణాయామం సూత్రం!

శ్వాస తీసుకోవడానికి ఎంత సమయం తీసుకోవాలి? వదలడానికి ఎంత సమయం తీసుకోవాలి? శ్వాసను ఎంతసేపు నిలిపి ఉంచాలి? ఈ మూడు అంశాల ఆధారంగా ప్రాణాయామంలో పలురకాల సాధనలు ఉన్నాయి. అవేంటంటే...


 భస్త్రిక  ఉజ్జయి

 నాడీశోధ  సుదర్శనక్రియ

- డాక్టర్‌ సాయిచరణ్‌ బోది, పల్మనాలజిస్ట్‌, యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌

Advertisement
Advertisement