కారుకు బ్రేకులు!

ABN , First Publish Date - 2022-06-02T07:47:18+05:30 IST

హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైంది. రాష్ట్ర ఏర్పాటు మొక్కు తీరాక.. పాలనా పగ్గాలనూ దక్కించుకుంది. తనదైన వ్యూహాలతో వరుసగా

కారుకు బ్రేకులు!

ఎనిమిదేళ్ల తరువాత టీఆర్‌ఎస్‌కు సిసలైన సవాళ్లు

బలహీనపరిచినా.. తిరిగి పుంజుకుంటున్న కాంగ్రెస్‌..

కమలనాథుల వ్యూహాలతో ఉక్కిరిబిక్కిరి

జాతీయ రాజకీయాలంటూ రాష్ట్రం బయటికి కేసీఆర్‌..

ప్రభుత్వపరంగా అడ్డుకుంటున్న మోదీ సర్కారు


హైదరాబాద్‌, జూన్‌ 1 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా ఏర్పాటైంది. రాష్ట్ర ఏర్పాటు మొక్కు తీరాక.. పాలనా పగ్గాలనూ దక్కించుకుంది. తనదైన  వ్యూహాలతో వరుసగా రెండోసారి కూడా అధికారంలోకి వచ్చింది. కొన్ని సవాళ్లు ఎదురైనా.. ఎనిమిదేళ్లుగా రాజకీయంగా రాష్ట్రంలో ఆధిపత్యం చలాయిస్తూ వచ్చిన టీఆర్‌ఎస్‌.. ఇప్పుడు అసలు సిసలు పరీక్షను ఎదుర్కొంటోంది. తొలుత కాంగ్రెస్‌ మాత్రమే ప్రత్యర్థిగా ఉండగా.. ఇప్పుడు బీజేపీ కూడా బలమైన ప్రత్యర్థిగా తయారై గట్టి సవాల్‌ విసురుతోంది. ఈ కొత్త సవాల్‌ను అధిగమించేందుకు జాతీయ స్థాయి రాజకీయాలంటూ రాష్ట్రం బయట తేల్చుకునేందుకు కేసీఆర్‌ ప్రయత్నిస్తున్నారు. అయితే ఆయన చేస్తున్న ఈ ప్రయత్నం ఫలిస్తుందో, లేక రాష్ట్రంలో మొదటికే మోసం వస్తుందోనన్న ఆందోళన టీఆర్‌ఎ్‌సలోనూ కొందరిలో నెలకొంది. వాస్తవానికి కాంగ్రె్‌సలో వైరుధ్యాలకు, అవకాశవాద ధోరణులకు చోటుండడంతో దానిని ఆసరాగా చేసుకొని తన పార్టీని పటిష్ఠం చేసుకున్నారు సీఎం కేసీఆర్‌. రాజకీయ పునరేకీకరణ పేరుతో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను టీఆర్‌ఎ్‌సలో విలీనం చేసుకొని ఆ పార్టీని బలహీనపరిచారు. కానీ, గత కొంతకాలంగా కాంగ్రెస్‌ తిరిగి పుంజుకోవడంతోపాటు బీజేపీ నుంచి వస్తున్న సవాళ్లతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు.


కేంద్రంలో అధికారంలో ఉండడంతోపాటు బలమైన సిద్ధాంత పునాదులు ఉన్న బీజేపీ.. సహజంగానే తనదైన శైలిలో దూకుడు ప్రదర్శిస్తోంది. తెలంగాణలో అధికారమే లక్ష్యంగా బలపడేందుకు ప్రయత్నిస్తోంది. ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌షా పదే పదే రాష్ట్రానికి వస్తూ.. కేసీఆర్‌ది కుటుంబపాలన అంటూ ఆరోపణలు గుప్పిస్తున్నారు. మరోవైపు రాష్ట్ర స్థాయి బీజేపీ నాయకత్వం దూకుడైన వ్యాఖ్యలతో రాజకీయంగా వేడి పుట్టిస్తోంది. దీంతో బీజేపీని బలంగా ఢీకొట్టక తప్పని పరిస్థితి కేసీఆర్‌కు ఎదురవుతోంది. ఆ స్థాయిలో సంకేతాలు ఇచ్చేందుకు ఆయన జాతీయ స్థాయిలో బీజేపీతో పోరుకు దిగారు. కేంద్రంలోని బీజేపీ సర్కారు.. పాలనలో విఫలమైందని, దేశానికి ప్రత్యామ్నాయ ఎజెండా కావాలంటూ ప్రజల దృష్టిని తెలంగాణ నుంచి ఢిల్లీ దిక్కు మళ్లించేందుకు ప్రయత్నిస్తున్నారు. వాస్తవానికి 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు నిర్ణయం జరిగాక రెండు ఎన్నికల్లో తెలంగాణ సెంటిమెంటు టీఆర్‌ఎ్‌సకు బాగా కలిసివచ్చింది. తొలుత ఉమ్మడి రాష్ట్రంలో జరిగిన ఎన్నికల్లో 63 అసెంబ్లీ స్థానాలు గెలిచిన టీఆర్‌ఎస్‌.. తెలంగాణలో తొలి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. బంగారు తెలంగాణ నిర్మాణం కోసం రాజకీయ పునరేకీకరణ పేరుతో కాంగ్రెస్‌, టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను తనలో విలీనం చేసుకుంది. ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ తిరుగులేని పార్టీగా అవతరించింది. ఆ తరువాత 2018లో సీఎం కేసీఆర్‌ ఎవరూ ఊహించని విధంగా అసెంబ్లీ ముందస్తు ఎన్నికలకు తెరతీసి 88 స్థానాలతో రెండోసారి అధికారంలోకి వచ్చారు. కాంగ్రెస్‌ చేసిన వ్యూహాత్మక తప్పిదాలు ఆయనకు కలిసివచ్చాయి. కానీ, ఆ వెంటనే జరిగిన 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం టీఆర్‌ఎస్‌ అంచనా వేసినట్లు 16 స్థానాల్లో గెలవలేదు.


తొమ్మిది స్థానాలతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లో చతికిలపడ్డ బీజేపీ నాలుగు, కాంగ్రెస్‌ మూడు ఎంపీ స్థానాల్లో గెలిచి అందరినీ నివ్వెరపరిచాయి. ఆ తరువాత వేర్వేరు కారణాల వల్ల వచ్చిన ఉప ఎన్నికల్లో బీజేపీ.. దుబ్బాక, హుజురాబాద్‌ అసెంబ్లీ స్థానాలను గెలుచుకుంది. నాగార్జునసాగర్‌ స్థానాన్ని టీఆర్‌ఎస్‌ నిలబెట్టుకున్నా.. తెలంగాణ సెంటిమెంట్‌ ముగిసిన అధ్యాయంగా మారిపోయింది. ఆ పార్టీ అధినాయకత్వం కూడా ఈ సూక్ష్మాన్ని గ్రహించి రాజకీయంగా పైచేయి సాధించటానికి ప్రత్యామ్నాయ మార్గాల్లో పయనిస్తోంది. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు, పదవుల పందేరం వంటి చర్యలతో కులాలవారీ ఓటు బ్యాంకును పెంచుకోవటానికి ప్రయత్నిస్తోంది.


కాంగ్రెస్‌, బీజేపీ పోటాపోటీ దూకుడు..

రాష్ట్రంలో కాంగ్రెస్‌, బీజేపీ.. పోటాపోటీ దూకుడు ప్రదర్శించడం అధికార టీఆర్‌ఎ్‌సకు ఇబ్బందికరంగా మారింది. గడిచిన కొంతకాలం వరకు ‘మనం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిద్దాం.. విపక్షాల విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు’ అనే ధోరణితో టీఆర్‌ఎస్‌ నాయకత్వం ఉంది. అయితే ప్రజల్లో కాంగ్రెస్‌, బీజేపీకి లభిస్తున్న ఆదరణతో ఆయా పార్టీల విమర్శలకు తక్షణం స్పందించాల్సిన అవసరం ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి టీపీసీసీ అధ్యక్షుడయ్యాక ఆ పార్టీ పనితీరు పూర్తిగా మారిపోయింది. ఏదో ఒక కార్యక్రమంతో నిత్యం ప్రజల్లో ఉండే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల రాహుల్‌గాంధీతో నిర్వహించిన వరంగల్‌ రైతు డిక్లరేషన్‌ సభ విజయవంతం కావడం కాంగ్రె్‌సకు టానిక్‌లా పనిచేస్తోంది.


మరోవైపు బీజేపీ రాష్ట్ర శాఖ పగ్గాలను ఎంపీ బండి సంజయ్‌ చేపట్టాక అటు క్షేత్రంలో, ఇటు మాటల్లో కమలనాథుల వైఖరిలో మార్పు కనిపిస్తోంది. పాదయాత్రలు, ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ దిగ్గజాలు అమిత్‌షా, నడ్డా సహా ఇతర జాతీయ నేతల వరుస పర్యటనలు కమలం పార్టీ శ్రేణులను ఉత్సాహపరుస్తున్నాయి. ఇక బీఎస్పీ తరఫున మాజీ ఐపీఎస్‌ అధికారి ఆర్‌ఎస్‌ ప్రవీణ్‌కుమార్‌, వైఎస్సార్‌టీపీ అధినేత్రి షర్మిల పాదయాత్రలు తమ ఓటు బ్యాంకుకు తూట్లు పొడుస్తాయనే ఆందోళన టీఆర్‌ఎస్‌ ముఖ్యుల్లోనూ వ్యక్తమవుతోంది. దీనికితోడు సొంత పార్టీలో నియోజకవర్గ స్థాయిలో టికెట్‌ ఆశించే నేతలు ఇబ్బడిముబ్బడిగా ఉండటం సమస్యగా మారింది. అన్నింటికి మించి వరుసగా ఎనిమిదేళ్లకు పైగా అధికారంలో ఉన్న ప్రభుత్వంపై వ్యక్తమయ్యే వ్యతిరేకతను అధిగమించటం టీఆర్‌ఎస్‌ అధిష్ఠానానికి కత్తిమీద సాము అవుతుందని అంటున్నారు.


భారీ లక్ష్యంతో ‘జాతీయ’ జెండా..

ఈ పరిణామాలన్నింటి మధ్య టీఆర్‌ఎస్‌ చీఫ్‌, సీఎం కేసీఆర్‌.. కేంద్రంలోని బీజేపీ సర్కారును టార్గెట్‌ చేస్తూ ‘జాతీయ’ జెండాను ఎంచుకోవడం రాజకీయ ఆసక్తిని రేకెత్తిస్తోంది. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోనూ తిరిగి తమదే అధికారం అనే దీమాతో జాతీయ రాజకీయాల వైపు కేసీఆర్‌ మొగ్గు చూపుతుండటంపై టీఆర్‌ఎ్‌సలోనే అంతర్గతంగా భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తమ పార్టీ మళ్లీ గెలవాలంటే తెలంగాణపై సీఎం కేసీఆర్‌ మరింత శ్రద్ధ చూపడం అవసరమని పార్టీలోని ఒక వర్గం అభిప్రాయపడుతోంది. ‘‘కేంద్రం వివక్షను ఎన్నాళ్లని భరించాలి? దేశంలో ఎవరో ఒకరు గొంతెత్తాల్సిందే. ఆ ప్రయత్నం కేసీఆర్‌ చేస్తే తప్పేంటి?’’ అని మరో వర్గం వాదిస్తోంది. అయితే ‘‘కేంద్రంలోని బీజేపీతో అమీతుమీకి సిద్ధపడ్డ మాతో ఆ పార్టీ కూడా అదే స్థాయిలో వైరాన్ని కొనసాగిస్తుంది. రాజకీయంగా చితికినప్పటికీ, ఓటు బ్యాంకు కలిగిన కాంగ్రెస్‌ బలపడే ప్రయత్నాలు చేస్తుంది. జాతీయ రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషించడానికి ముందు ఈ అంశాలను సీఎం కేసీఆర్‌ పరిగణనలోకి తీసుకోవటం తప్పనిసరి’’ అని టీఆర్‌ఎ్‌సకు చెందిన పలువురు సీనియర్లు అభిప్రాయపడుతున్నారు.

Updated Date - 2022-06-02T07:47:18+05:30 IST