కుదిపేస్తున్నాయ్‌..

ABN , First Publish Date - 2021-04-17T06:43:09+05:30 IST

జిల్లాను కొవిడ్‌ కుదిపేస్తోంది. కేసులు క్రమేపీ కట్టుతప్పి వందల్లో పెరిగిపోతున్నాయి. ఏరోజుకారోజు పగ్గాల్లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా పాజిటివ్‌లు ఏరోజు ఎన్ని వస్తాయనే కలవరం వైద్య ఆరోగ్యశాఖను పట్టిపీడిస్తోంది.

కుదిపేస్తున్నాయ్‌..

  • జిల్లాలో కట్టుతప్పుతున్న కొవిడ్‌ కేసులు.. పట్టపగ్గాల్లేకుండా పరుగులు
  • శుక్రవారం ఏకంగా జిల్లావ్యాప్తంగా 750 మందికి వైరస్‌
  • ఈ ఏడాదిలో ఇవే అత్యధికం.. ఈనెల 14న 617 పాజిటివ్‌ల రికార్డు దాటివేత
  • కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం ప్రాంతాల్లోనే అత్యధిక కేసులు
  • అటు వైరస్‌ తీవ్రత భారీగా ఉన్నా కొవిడ్‌ వ్యాక్సిన్‌కు దిక్కులేని దుస్థితి
  • జిల్లాలో నిల్వలన్నీ ఖాళీ.. ఒక్క డోసూ కరువే.. సోమవారం 70 వేల డోసులు రావొచ్చని అంచనా
  • రోజుకు జిల్లాలో కనీసం 25 వేల మందికి అయినా వ్యాక్సిన్‌ అందించే వీలు
  • మరోపక్క ముందస్తు చర్యల కింద ప్రైవేటు ఆసుపత్రులు సిద్ధంచేస్తున్న వైద్య ఆరోగ్యశాఖ
  • నేటి నుంచి పలు ప్రాంతాల్లో ఆసుపత్రుల్లో వసతులు, స్థాయిపై తనిఖీలు

జిల్లాను కొవిడ్‌ కుదిపేస్తోంది. కేసులు క్రమేపీ కట్టుతప్పి వందల్లో పెరిగిపోతున్నాయి. ఏరోజుకారోజు పగ్గాల్లేకుండా పరుగులు తీస్తున్నాయి. ఫలితంగా పాజిటివ్‌లు ఏరోజు ఎన్ని వస్తాయనే కలవరం వైద్య ఆరోగ్యశాఖను పట్టిపీడిస్తోంది. జనం సైతం వందలాదిగా నిర్ధారణ అవుతున్న పాజిటివ్‌లతో బెంబేలెత్తుతున్నారు. బయటకు రావాలంటేనే వణికిపోతున్నారు. ఒకపక్క వ్యాక్సిన్‌ ఉందనే ధీమా సైతం సడలుతోంది. జిల్లాలో ప్రస్తుతం ఇవ్వడానికి ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ కూడా లేదు. మొత్తం నిల్వలన్నీ ఖాళీ అయిపోయాయి. సోమవారం విజయవాడ నుంచి రానున్న నిల్వలపైనే అధికారులు ఆశలు పెట్టుకున్నారు. జిల్లాలో రోజుకు కనీసం పాతిక వేల మందికి అయినా వ్యాక్సిన్‌ ఇచ్చేందుకు వైద్య సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. కానీ డోసులే లేవు. మరోపక్క సింగిల్‌డోస్‌ తీసుకున్న వారికి రెండోడోస్‌కు సమయం దాటిపోయినా వ్యాక్సిన్‌ ఇవ్వలేని పరిస్థితి. కాగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా 750 మందికి కొత్తగా వైరస్‌ నిర్ధారణ అయింది. ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఇవే అత్యధిక కేసులు. 

(కాకినాడ-ఆంధ్రజ్యోతి)

జిల్లాలో కొవిడ్‌ వైరస్‌ కట్టుతప్పిపోయింది. ఎక్కడికక్కడ మహమ్మారి చొచ్చుకుపోతోంది. తెలియకుండానే అందరినీ చుట్టేస్తోంది. స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్‌ ప్రాంతాలు ఇలా అత్యధిక సమూహాలు ఉన్నచోట వైరస్‌ విరుచుకుపడుతోంది. కనికరం లేకుండా చిన్నాపెద్దా అందరికీ వ్యాపించేస్తోంది. ముఖ్యంగా కాకినాడ, కాకినాడ రూరల్‌, రాజమహేంద్రవరం, రాజమహేంద్రవరం రూరల్‌,  అమలాపురం, రామచంద్రపురంలలో అత్యధిక కేసులు నిర్ధారణ అవుతున్నాయి. రోజువారి తేలుతున్న పాజిటివ్‌ల్లో సగానికిపైగా ఈ ప్రాంతాల్లోనే కనిపిస్తున్నాయి. దీంతో ఈ ప్రాంతాల్లో జనం బెంబేలెత్తిపోతున్నారు. మరోపక్క రాష్ట్ర వైద్యఆరోగ్యశాఖ శుక్రవారం ప్రకటించిన కొవిడ్‌ బులిటెన్‌లో జిల్లాలో 750 మందికి కొత్తగా పాజిటివ్‌ వచ్చినట్టు ప్రకటించింది. దీంతో అధికారులు ఆందోళన చెందుతు న్నారు. పదుల సంఖ్యలో కేసులు కాస్తా ఈనెలలో వందల్లోకి ఎగబాకడంపై తలలుపట్టుకుంటున్నారు. ఈనేపథ్యంలో సోమవారం నుంచి కేసుల ట్రేసింగ్‌ విధానాన్ని మరింత పగడ్బందీగా చేపట్టాలని కలెక్టర్‌ ఆదేశించారు. వాస్తవానికి ఈ ఏడాదిలో ఇప్పటివరకు ఈనెల 14న వచ్చిన 716 పాజిటివ్‌లే జిల్లాలో అత్యధికం. కానీ వీటిని మించిపోయి శుక్రవారం పాజిటివ్‌లు తేలి 750 వరకు నమోదయ్యాయంటే వైరస్‌ తీవ్రత ఏమేరకు వ్యాపిస్తోందో కళ్లకుకడుతోంది. మొత్తం పాజిటివ్‌ల్లో సగానికిపైగా కేవలం కాకినాడ, రాజమహేంద్రవరం నగరాలు, అమలాపురం, అమలాపురం రూరల్‌లో మాత్రమే వచ్చినట్టు అధికారులు విశ్లేషిస్తున్నారు. ముఖ్యంగా అమ లాపురం రూరల్‌లోని పేరూరు పీహెచ్‌సీ పరిధిలో 36 మందికి ఇటీవల పరీక్షలు చేస్తే 17 మందికి పాజిటివ్‌గా శుక్రవారం నిర్ధారణ అయింది. ఇలా ఎక్కడికక్కడ గుట్టలుగా కేసులు తేలుతున్నాయి. ఇదే వేగంతో పాజిటివ్‌లు పరుగులు తీస్తే ఏప్రిల్‌ పూర్తయ్యేసరికి పాజిటివ్‌లు ఎన్ని వేలకు చేరుకుంటాయనేది అర్థంకాని పరిస్థితి. ఇప్పటివరకు ఈనెల 16 రోజుల్లో పాజిటివ్‌లు ఏకంగా 2,943కు చేరుకున్నాయంటే వైరస్‌ ఏ స్థాయి వేగంతో ప్రయాణిస్తుందో ఊహించొచ్చు. కాగా తాజా కేసులతో కలిపి మొత్తం పాజిటివ్‌లు 1,28,306కు చేరుకున్నాయి. ఇందులో 3,258 యాక్టివ్‌ కేసులు ఉన్నా యి. వీరంతా వివిధ ప్రభుత్వ ఆసుపత్రులు, హోంఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు. మరోపక్క జిల్లాలో కొవిడ్‌ కేసులు తీవ్రరూపందాల్చిన నేపథ్యంలో అధికారులు అప్రమత్తమయ్యారు. కేసు లు ఇదే వేగంతో పెరిగి జీజీహెచ్‌, రాజమహేంద్రవరం డీహెచ్‌, కిమ్స్‌ ఆసుపత్రుల్లో ఇప్పుడున్న కొవిడ్‌ పడకలు నిండిపోతే తక్షణం అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వీలుగా కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంలలో ప్రైవేటు ఆసుపత్రులను గుర్తిస్తున్నారు. శనివారం నుంచి ఎంపికచేసిన ఆసుపత్రుల్లో తనిఖీలు నిర్వహించి కొవిడ్‌ చికిత్స చేసే సామర్థ్యం వాటికి ఉందా? వసతులు? వైద్యులు? చికిత్స సామగ్రి వంటి సామర్థ్యం సరిపోతుందా? లేదా? గుర్తించి నివేదిక తయారు చేసి సిద్ధంగా ఉంచనున్నారు. అవసరం వచ్చిన వెంటనే వీటికి తక్షణ అనుమతి జారీచేసి కొవిడ్‌ సేవలకు వినియోగించాలని నిర్ణయించారు. 

  • వ్యాక్సిన్‌ సున్నా..

జిల్లాలో కొవిడ్‌ వ్యాక్సిన్‌ శుక్రవారం నాటికి సున్నా. ఒక్కటంటే ఒక్క డోస్‌ వ్యాక్సిన్‌ కూడా అందుబాటులో లేదు. దీంతో ఏం చేయాలో తెలియక వైద్యఆరోగ్యశాఖ తలపట్టుకుంటోంది. ప్రభుత్వా న్ని అడిగితే తమ వద్ద కూడా లేవనే సమాధానం వస్తుండడంతో దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. యుద్ధప్రాతిపదికన వ్యాక్సిన్లు పం పాలని కేంద్రానికి రాష్ట్రం ఇప్పటికే లేఖ రాసింది. తద్వారా సోమవారం నాటికి జిల్లాకు 70 వేల వరకు వ్యాక్సిన్లు రావచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. వాస్తవానికి ఈ నిల్వలు జిల్లా అవసరాలకు అసలేమాత్రం చాలవు. జిల్లావ్యాప్తంగా రోజుకు 25 వేల మందికి వ్యాక్సిన్‌ అందించేందుకు వైద్యఆరోగ్యశాఖ సిబ్బంది సంసిద్ధంగా ఉన్నారు. కానీ వ్యాక్సిన్‌ లేక వీరంతా ఖాళీగా ఉన్నారు. ఇటీ వల టీకా ఉత్సవ్‌ సందర్భంగా ఒక్కరోజులో జిల్లావ్యాప్తంగా 70వేల మందికి వ్యాక్సిన్‌ అందించారు. ఇప్పటివరకు జిల్లావ్యాప్తంగా కేవలం 3.94 లక్షల మందికే టీకా పూర్తయింది. 58 లక్షల జిల్లా జనాభాతో పోల్చితే ఇప్పటివరకు వేసిన టీకాలు అతి స్వల్పమనే చెప్పాలి. మరోపక్క కొవిడ్‌ వ్యాక్సిన్లు లేక ఇప్పటికే మొదటి డోసు వేసుకుని రెండో డోసుకు సమయం ఆసన్నమైన వారికి సైతం ఇవ్వలేని పరిస్థితి. వారంతా తదుపరి డోసుకు ఎదురుచూపులు చూస్తున్నారు.

  • జిల్లాలో రోజుకు 4 వేల వరకు కొవిడ్‌ టెస్టులు: కలెక్టర్‌

డెయిరీఫారమ్‌ సెంటర్‌(కాకినాడ), ఏప్రిల్‌16 : జిల్లాలో కొవిడ్‌ కేసుల సత్వర పరిష్కారానికి కలక్టరేట్‌లో కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామని కలెక్టర్‌ డి మురళీధర్‌రెడ్డి తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ హాల్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కొవిడ్‌ నియంత్రణ, వ్యాక్సినేషన్‌, సాగునీరు, తాగునీరు అంశాలపై కలెక్టర్‌ వివరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 3258 కొవిడ్‌ యాక్టివ్‌ కేసులున్నాయన్నారు. ఇందులో 267 మంది కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురంల్లో ఏర్పాటు చేసిన కొవిడ్‌ ఆసుపత్రులలో చికిత్స పొందుతుండగా, 2991 మంది హోమ్‌ ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. కొవిడ్‌ కేసుల గుర్తింపు కోసం రోజుకు 4 నుంచి 5 వేల వరకు ఆర్‌టీపీసీఆర్‌ టెస్ట్‌లు నిర్వహిస్తున్నామని తెలిపారు. కాకినాడ జీజీహెచ్‌, రాజమహేంద్రవరం జిల్లా ఆసుపత్రి, అమలాపురం కిమ్స్‌ ఆసుపత్రులను కొవిడ్‌ ఆసుపత్రులుగా ఏర్పాటు చేశామన్నారు. వీటిలో ప్రస్తుతం 100 బెడ్ల సామర్థ్యం అందుబాటులో ఉంచామన్నారు. కొవిడ్‌ నియంత్రణలో 0884-2356196, 18004253077 నంబర్లతో కలెక్టరేట్‌లో ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేశామన్నారు. సోమవారం నుంచి ఈ కంట్రోల్‌ రూమ్‌ పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుందన్నారు. కంట్రోల్‌ రూమ్‌లో టెస్టింగ్‌, పాజిటివ్‌ కేసుల షిఫ్టింగ్‌, ఆసుపత్రి అడ్మిష న్లు, హోమ్‌ ఐసోలేషన్‌ విభాగాలు ఉంటాయన్నారు. హోమ్‌ ఐసోలేషన్‌ కోసం 30 వేల కిట్లు ఉండగా, ఇప్పటివరకు 10 వేల కిట్లు పంపిణీ చేశామన్నారు. కాకినాడ జీజీహెచ్‌ను సోమవారం నుంచి కొవిడ్‌ ఆసుపత్రిగా కన్వర్ట్‌ చేస్తున్నామన్నారు. కొవిడ్‌ సేవలతోపాటు ఓపీ, గైనిక్‌, పిల్లల విభాగాల సేవలు ఆసుపత్రిలో కొనసాగుతాయని చెప్పారు.

  • సీఎం వీడియో కాన్ఫరెన్సు

ఇదిలా ఉండగా ముఖ్యమంత్రి జగన్మోహనరెడ్డి శుక్రవారం కలెక్టర్లు, ఎస్పీలతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్షిం చారు. అందుబాటులో ఉన్న అన్ని వసతులు, వనరులు, సిబ్బందిని సమర్థవంతంగా వినియోగించుకుని మహమ్మారిని అదుపుచేయాలని సీఎం ఆదేశించారు. కలెక్టరేట్‌లోని వివేకానంద హాల్‌ నుంచి ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ, జాయింట్‌ కలెక్టర్లు జి లక్ష్మీశ, చేకూరి కీర్తిలతో కలిసి కలెక్టర్‌ మురళీధర్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫోకస్ట్‌ టెస్టింగ్‌ విధానంలో పాజిటివ్‌గా గుర్తించిన వ్యక్తుల ప్రైమరీ కాంటాక్ట్‌లందరికీ ఆర్టీపీసీఆర్‌ టెస్ట్‌లు చేయించనున్నామన్నారు. కాకినాడ కార్పొరేషన్‌ కమిషనర్‌ స్వప్నిల్‌ దిన్‌కర్‌పుండ్కర్‌ , రాజమహేంద్రవరం కార్పొ రేషన్‌ కమిషనర్‌ అభిషిక్త కిషోర్‌, డీఆర్‌వో సత్తిబాబు పాల్గొన్నారు.  

  • కరోనాతో టీడీపీ నాయకుడు జాలా మదన్‌ మృతి

రాజమహేంద్రవరం సిటీ, ఏప్రిల్‌ 16: నగర టీడీపీ నాయకుడు జాలా మదన్‌ (40) కరోనాతో మృతి చెం దారు. సుదీర్ఘకాలంపాటు పార్టీకి సేవలందించిన మదన్‌ టీడీపీ క్రియాశీలక కార్యకర్తగాను, పార్టీ ఎస్సీ సెల్‌ నాయకుడిగాను ఉన్నారు. స్థానిక ఉమా మార్కెండేశ్వరస్వామి ఆలయ కమిటీ డైరెక్టర్‌గా పనిచేశారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. కొద్దిరోజుల కిందట కరోనా బారినపడిన ఆయన ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందు తూ శుక్రవారం పరిస్థితి విషమించి మృతి చెందారు. టీడీపీ రాష్ట్ర కార్యదర్శి కాశి నవీన్‌కుమార్‌కు ముఖ్య అను చరుడిగా ఉన్న మదన్‌ మృతిపట్ల నవీన్‌కుమార్‌ తీవ్ర దిగ్భాంతిని వ్యక్తంచేశారు. పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొనే తన మిత్రుడు మదన్‌ మృతిని జీర్ణించుకోలేక పోతున్నానని కాశి నవీన్‌ కంటపడి పెట్టారు. అలాగే తమ పార్టీ నాయకుడు మదన్‌ మృతి పట్ల టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గన్ని కృష్ణ తీవ్ర సంతాపం వ్యక్తంచేసి అతని కుటుంబ సభ్యులకు సానుభూతిని తెలియజేశారు.

Updated Date - 2021-04-17T06:43:09+05:30 IST