తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ

ABN , First Publish Date - 2021-06-18T05:52:48+05:30 IST

దుండగులు ఓ ఇంటితాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువా లాకర్లు ధ్వంసం చేసి అందులో వున్న రూ.2.50 లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలతో సహా రూ.10 వేలు నగదు, పది పట్టుచీరలు చోరీ చేశారు.

తాళం పగులగొట్టి ఇంట్లో చోరీ
గదిలో చిందరవందరగా పడివున్న సామగ్రి

రూ.2.50 లక్షల నగలు, నగదు అపహరణ

మదనపల్లె క్రైం, జూన్‌ 17: దుండగులు ఓ ఇంటితాళం పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువా లాకర్లు ధ్వంసం చేసి అందులో వున్న రూ.2.50 లక్షలు విలువ చేసే వెండి, బంగారు ఆభరణాలతో సహా రూ.10 వేలు నగదు, పది పట్టుచీరలు చోరీ చేశారు. ఈ సంఘటన గురువారం మదనపల్లెలో వెలుగు చూసింది. టూటౌన్‌ పోలీసుల కథనం మేరకు..మదనపల్లె పట్టణం రెడ్డెప్పనాయుడుకాలనీకి చెందిన జి.వెంకటయ్య సీజనల్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఈనేపథ్యంలో ఈయన ఇటీవల కుటుంబంతో కలసి కర్ణాటక రాష్ట్రం బెంగళూరులో వున్న తమ బంధువుల ఇంటికెళ్లాడు. గురువారం వారు ఇంటికొచ్చి చూడగా తాళం పగులగొట్టి తలుపు తెరిచి ఉంది. లోపలికెళ్లి చూడగా బీరువా లాకర్లు పగులగొట్టి ఉండి సామగ్రి అంతా చిందరవందరగా పడేసి ఉండడాన్ని గుర్తించారు. దీంతో చోరీ జరిగిందని గుర్తించి వెంటనే టూటౌన్‌ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ నరసింహులు, ఎస్‌ఐ బాబులు రెడ్డెప్పనాయుడుకాలనీకి చేరుకుని చోరీ జరిగిన ఇంటిని పరిశీలించారు. అనంతరం ఘటనపై స్థానికులను, బాధితులను విచారించారు. ఇంట్లో రెండు కేజీల వెండి, 15 గ్రాముల బంగారు నగలు, రూ.10 వేలు నగదు, పది పట్టుచీరలు చోరీకి గురైనట్లు వెంకటయ్య ఆవేదన వ్యక్తం చేశాడు. రూ.2.50 లక్షలు విలువ చేసే నగలు, నగదు, చీరలు చోరీకి గురైనట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు.  కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.






Updated Date - 2021-06-18T05:52:48+05:30 IST