Advertisement
Advertisement
Abn logo
Advertisement

బరువు పెరగకుండా బ్రేక్‌ఫాస్ట్‌!

ఆంధ్రజ్యోతి(25-07-2020)

ప్రశ్న: ఉదయం అల్పాహారంలో ఇడ్లీ, దోశ, గారెలు, వడ, ఉప్మా, పెసరట్టు తినొచ్చా? వీటివల్ల బరువు పెరుగుతామేమోనని ఓట్స్‌ తినడం మొదలెట్టాను. కానీ అవి నాకు అంతగా ఇష్టం ఉండవు. మన సౌతిండియా బ్రేక్‌ఫాస్ట్‌ తినే మార్గం చెప్పండి.


-ఈశ్వరి, రాజమండ్రి


డాక్టర్ సమాధానం: బరువు తగ్గాలనుకున్నప్పుడు మొదట చెయ్యాల్సింది ఏమిటంటే ఆహారాన్ని కంట్రోల్‌ చేయడం. అంటే రెండు ముద్దలు తగ్గించి తినడం. రెండోది మొత్తానికి ఆహారం మానేయకుండా ఉండటం. మూడోది ఆహారంలో పండ్లు, కూరగాయలు చేర్చడం. అన్నింటికన్నా ముఖ్యం ప్రతీ ఆహారాన్ని బరువు పెంచే భూతంలాగా చూడకుండా ఉండటం. ఆహారం ఎప్పుడూ ఆరోగ్యాన్నే ఇస్తుంది. ఎటుతిరిగి ఇష్టం వచ్చినట్టుగా తినడం, తిన్న తిండికి సరైన వ్యాయామం లేకపోవడం ప్రమాదకరం. 


బ్రేక్‌ఫాస్ట్‌ అనేది చాలా ముఖ్యమైన ఆహారం. ఇది జీవనక్రియను ఉదయాన్నే ప్రారంభిస్తుంది. అన్ని పోషకాలు సమృద్ధిగా ఉండే ఆహారం తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌లో తినడం ముఖ్యం. ఇడ్లీ, దోశ లాంటివి పులిసిన ఆహారం కాబట్టి వీటిలో ఆరోగ్యాన్ని పెంచే గుడ్‌ బ్యాక్టీరియా ఉంటుంది. రైస్‌, మినప్పప్పు ఉపయోగిస్తారు కాబట్టి ఇందులో ఎనర్జీ, ప్రొటీన్‌లాంటివి కావాల్సినన్ని ఉంటాయి. వీటిని సాంబారుతో తింటే కొంత ప్రొటీన్‌ పెరుగుతుంది. అలాగే కూరగాయలు విటిమిన్‌-బి, పైబర్‌ను అందిస్తాయి. నువ్వులు, పల్లీ, కొబ్బరి, పుట్నాల చట్నీలతో తీసుకుంటే కూడా ప్రొటీన్‌ ఎనర్జీ, విటమిన్స్‌, ఫైబర్‌ పెరుగుతాయి. ఇక్కడ మీరు చేయాల్సింది ఏమిటంటే నాలుగు ఇడ్లీలకు బదులుగా రెండు తినడం. రెండు దోశలకు బదులుగా ఒక దోశ తినడం చేయాలి. గారెల విషయానికొస్తే కేవలం మినప్పప్పు ఒక్కటే ఉపయోగిస్తారు కాబట్టి ప్రొటీన్‌, ఎనర్జీ ఎక్కువగా ఉంటుంది. ఇది డీప్‌ ఫ్రై కాబట్టి ఆయిల్‌ ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది. అందుకే ఆరు గారెలకు బదులు మూడు తినాలి. పెసరట్టును కూడా ఇదే విధంగా తినాలి. పెసరట్టును పెసరపప్పు బదులు పెసలుతో చేస్తారు కాబట్టి చాలా శ్రేష్టమైన బ్రేక్‌ఫాస్ట్‌ ఇది. ఉప్మా రవ్వ గోధుమలతో చేస్తారు. ధాన్యం గింజలు కావడంతో పప్పు కన్నా తక్కువ ప్రొటీన్‌ కలిగి ఉంటుంది. మొత్తానికి మీరు ఏ బ్రేక్‌ఫాస్ట్‌ తీసుకున్నా పోర్షన్‌ కంట్రోల్‌ చేసుకోవాలి.  


- డాక్టర్‌ బి.జానకి, న్యూట్రిషనిస్ట్‌

[email protected]  


Advertisement

ఆహారం-ఆరోగ్యంమరిన్ని...

Advertisement

ప్రత్యేకం మరిన్ని...