ఇంకెంత కాలం..!?

ABN , First Publish Date - 2020-05-28T11:02:01+05:30 IST

బ్రాందీ షాపుల తలుపులు ఎప్పుడో తెరుచుకున్నాయి. అన్ని రకాల వాణిజ్య సముదాయాలు

ఇంకెంత కాలం..!?

  • 2 నెలలుగా జీజీహెచ్‌ సేవలకు బ్రేక్‌
  • రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రి పేరుతో పేదలకు అన్యాయం
  • ఖాళీగా ఆసుపత్రి భవనం.. వైద్య సిబ్బంది పరిస్థితీ అంతే!
  • చిన్న రోగానికైనా ప్రైవేటే దిక్కు!
  • సందిట్లో సడేమియాలా దోచుకుంటున్న వైనం

నెల్లూరు, మే 27 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): బ్రాందీ షాపుల తలుపులు ఎప్పుడో తెరుచుకున్నాయి. అన్ని రకాల వాణిజ్య సముదాయాలు తెరుచుకుంటున్నాయి. కానీ కరోనా పేరు చెప్పి ఇంకెంత కాలం పెద్దాసుపత్రిని (జీజీహెచ్‌) మూసుకొని కూర్చుంటారు.. జిల్లావాసుల నుంచి ఎదురవుతున్న ప్రశ్న ఇది. వైద్యం కోసం జిల్లా నలుమూలల నుంచి నెల్లూరుకు  చేరుకుని ఉచిత వైద్యం అందక, కార్పొరేట్‌ ఆసుపత్రుల బాదుడును భరించలేక  అల్లాడిపోతున్న పేదల ఆక్రందన ఇది. 


మార్చి 31వ తేదీకి కరోనా కేసుల సంఖ్య పెరగడంతో జీజీహెచ్‌లో కరోనా, ప్రసూతి, చిన్నపిల్లల విభాగాలు మినహా మిగిలిన అన్ని విభాగాల్లో వైద్య సేవలు బంద్‌ చేశారు. ఇప్పటికి రెండు నెలలు గడుస్తున్నా పరిస్థితిలో మార్పు లేదు. తొలి రోజుల్లో జీజీహెచ్‌ను రాష్ట్ర కోవిడ్‌ ఆసుపత్రిగా ప్రకటించినా ప్రజల నుంచి పెద్దగా అభ్యంతరం వ్యక్తం కాలేదు. ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కోవిడ్‌-19 వైరస్‌ జిల్లాలో ఎంత మందిని కబళిస్తుందో తెలియని పరిస్థితి. ఆ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వుల మేరకు అన్ని ప్రైవేటు సహా అన్ని ఆసుపత్రులను ప్రభుత్వం తన ఆధీనంలోకి తెచ్చుకుంది. అన్నిటినీ కరోనా రోగుల కోసమే రిజర్వు చేసింది. అయినా ప్రజల నుంచి అభ్యంతరం రాలేదు. అయితే ఇప్పుడు పరిస్థితి వేరు. వ్యాధి పట్ల అవగాహన వచ్చింది. ప్రభుత్వం లాక్‌డౌన్‌ నిబంధనలను కేవలం కొన్ని ప్రాంతాలకే పరిమితం చేసింది. బ్రాందీ షాపుల నుంచి బట్టల దుకాణాల వరకు అన్నీ తెరుచుకున్నాయి. జనజీవనం సాధారణ స్థితికి చేరుకుంది. అయినా పేద, మధ్యతరగతి ప్రజలకు అత్యవసరమైన ఉచిత వైద్యం విషయంలో మాత్రం కట్టుబాట్లు సడలలేదు. జీజీహెచ్‌ ఆసుపత్రిని కరోనా పేరు చెప్పి మూసుకొని కూర్చున్నారు. అయితే, జీజీహెచ్‌లో వైద్య సేవలు అందుబాటులో లేకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రుల్లో ఫీజుల రేట్లు మూడింతలు పెంచేశాయి. కరోనాకు ముందు రూ.250 ఉన్న ఓపీ 500లకు పెంచాయి. అత్యవసర ఓపీ పేరుతో రూ.750 దండుకున్నాయి. డబ్బులు లేనిదే ఆసుపత్రుల్లో అడ్మిషన్లు ఇవ్వలేదు. ఉచిత వైద్యం అంటే పడకలు లేవనే సమాధానాలే వినిపిస్తున్నాయి. సూది మందు కోసం చిన్న ఆసుపత్రులకు వెళదామంటే అవి మూతపడ్డాయి. ఈ పరిస్థితుల్లో రెండు నెలలుగా రోగులు నరకం అనుభవించారు. 


అందరూ ఖాళీనే!

జీజీహెచ్‌లో ప్రస్తుతం ఉన్న కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 53. గతంలో వంద వరకు ఉన్నాయి. ఇప్పుడు 50 శాతం కన్నా ఎక్కువ కేసులను నారాయణ ఆసుపత్రికి తరలిస్తున్నారు. ఈ మాత్రం వ్యాధిగ్రస్థుల కోసం 750 పడకల సామర్థ్యం కలిగిన ఆసుపత్రిని ఖాళీగా పెట్టేశారు. ఈ ఆసుపత్రిలో పనిచేసే మొత్తం డాక్టర్ల సంఖ్య 138 మంది. వీరిలో కరోనా వ్యాధిగ్రస్తులకు సేవలందిస్తున్న డాక్టర్లు 15 నుంచి 20 మంది. మిగిలిన వారంతా ఖాళీగా ఉన్నారు. వందల సంఖ్యలో ఉన్న వైద్య సిబ్బంది పరిస్థితీ అంతే.


మనసుంటే మార్గం...

అధికారులు మనసు పెడితే జీజీహెచ్‌లో కరోనాకు చికిత్స అందిస్తూనే ఇతర వ్యాధులకు వైద్యం చేయవచ్చు. ప్రస్తుతం జీజీహెచ్‌ కరోనా ఐసొలేషన్‌ వార్డు కెపాసిటీ 100పడకలు. ఇవి చాలవనుకుంటే సెంట్రల్‌ డయాగ్నస్టిక్‌ ల్యాబ్‌ను ఉపయోగించుకుంటే మరో 200 నుంచి 300 పడకలు ఏర్పాటు చేయవచ్చు. అంటే ఈ రెండు వార్డుల్లోనే 400 మంది కరోనా వ్యాధిగ్రస్థులకు చికిత్స అందించే అవకాశం ఉంది. ఇలా కొంత మనసు పెట్టి ఆలోచిస్తే వందల సంఖ్యలో కరోనా కేసులు వచ్చినా, వారికి చికిత్స అందిస్తూనే ఆర్థో, జనరల్‌ మెడిసిన్‌ వంటి ఇతర విభాగాలను రన్‌ చేయవచ్చు. కరోనా కేసులు ఉన్న చోట ఇతర వైద్య సేవలు అందించకూడదనే అభిప్రాయాన్ని అధికారులు మార్చుకోవాలి. ఇప్పటికే జీజీహెచ్‌లో ప్రసూతి, చిన్న పిల్లల ఆసుపత్రులు నడుస్తున్నాయి. అంటువ్యాధులు సులభంగా సోకే అవకాశం బాలింతలు, చిన్నపిల్లలకు ఎక్కువ. ఇలాంటి సున్నితమైన వార్డులే ఎలాంటి ఇబ్బంది లేకుండా నడుస్తుండగా మిగిలిన విభాగాలు నడపడానికి కష్టం ఏముందో ఆలోచించాలి. పైగా కరోనాతో కలిసి ప్రయాణించాలని అన్ని కార్యకలాపాలకు అనుమతించినప్పుడు ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిని ఆంక్షల్లో పెట్టడం ఎంత వరకు సమంజసమో యోచించాలి. 


ఇప్పటికైనా మార్పు రావాలి

జీజీహెచ్‌లో ఇతర వ్యాధులకు వైద్యసేవలు అందించే విషయంలో ఉన్నతాధికారులు ఇకనైనా చొరవ తీసుకోవాలి. కరోనా కన్నా ప్రమాదకరమైన ఎన్నో వ్యాధులతో ప్రజలు అల్లాడుతున్నారు. జనజీవనం రోడ్డెక్కిన నేపథ్యంలో రోడ్డు ప్రమాదాల కేసులు ఎక్కువగా వస్తాయి. జూన్‌లో వర్షాలు మొదలైతే సీజనల్‌ వ్యాధులూ ఎక్కువవుతాయి. సూది మందుకో, మందు బిళ్లకో తగ్గిపోయే జబ్బులకు కార్పోరేట్‌ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి పేదలకు ఎదురవుతుంది. వారి గురించి కూడా ఆలోచించాలి.  సర్వజన ఆసుపత్రి సేవలు సగటు మనిషికి అందేలా చర్యలు తీసుకోవాలి.   

Updated Date - 2020-05-28T11:02:01+05:30 IST