Shinde faction Mla: కాళ్లు విరగ్గొట్టండి..బెయిల్ ఇవ్వడానికి నేను వస్తా ..

ABN , First Publish Date - 2022-08-16T21:17:15+05:30 IST

మహారాష్ట్రలోని శివసేన వర్గాల మధ్య రెచ్చగొట్టే మాటలు..

Shinde faction Mla: కాళ్లు విరగ్గొట్టండి..బెయిల్ ఇవ్వడానికి నేను వస్తా ..

కోల్‌కతా: మహారాష్ట్రలోని శివసేన వర్గాల మధ్య రెచ్చగొట్టే మాటలు చోటుచేసుకుంటున్నాయి. తాజాగా మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే (Eknath Shinde) మద్దతుదారు, మగథానే ఎమ్మెల్యే ప్రకాష్ సుర్వే (Prakash Surve) రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ ముఖ్యమంత్రి, శివసేన చీఫ్ ఉద్ధవ్ థాకరే వర్గం కన్నెర్ర చేసింది. మగథానేలోని కొంకణి పాద బుద్ధ విహార్‌లో జరిగిన బహిరంగ సభలో ప్రకాష్ సుర్వే కార్యకర్తలను రెచ్చగొడుతూ...''వాళ్ల చేతులను మీరు విరగ్గొట్ట లేకపోతే కాళ్లు విరగ్గొట్టండి. ఆ మరుసటి రోజే మిమ్మల్ని బెయిల్‌పై బయటకు తీసుకువచ్చేందుకు నేను వస్తా'' అని వ్యాఖ్యానించారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలపై థాకరే గ్రూప్ తాజాగా దహిసర్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.


సుర్వే తన వ్యాఖ్యలను కొనసాగిస్తూ...''మిమ్మల్ని ఎవరైనా వేధిస్తే మీరు ఎందుకు సహించి ఉండాలి? దాదాగిరిని సహించవద్దు. వాళ్లను బయటకు నెట్టండి. ప్రకాష్ సర్వే ఇక్కడ కూర్చుని ఉన్నాడు. అవతల వాళ్ల చేతులు విరగ్గొట్ట లేకపోతే కాళ్లు విరగ్గొట్టండి. మరుసటి రోజే బెయిల్‌పై మిమ్మల్ని బయటకు తీసుకువస్తాను. భయపడాల్సిన పని లేదు'' అన్నారు. సుర్వే మాట్లాడిన వీడియో సోషల్ మీడియాలో రావడంతో అది ఒక్కసారిగా వైరల్ అయింది. దీంతో థాకరే వర్గం శివసైనికులు భగ్గుమన్నారు. తమ నిరసనలు తెలుపుతూ పోలీస్ స్టేషన్‌లో ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేశారు.


ఇంత ధైర్యం మీకెక్కడిది?

ప్రకాష్ సుర్వే రెచ్చగొట్టే వ్యాఖ్యలపై శివసేన నేత, ముంబై మేయర్ కిషోరి పడ్నేకర్ మండిపడ్డారు. మీకింత ధైర్యం ఎలా వచ్చిందని సుర్వేను ప్రశ్నించారు. ''ప్రజాప్రతినిధులు బాధ్యత లేకుండా ప్రకటనలు చేయడం దురదృష్టకరం. వాళ్లు చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటున్నారు. స్వార్ధ ప్రయోజనాల కోసమే ఇదంతా చేస్తున్నారు. ఇలాంటి వ్యాఖ్యలతో యువతను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారు. వీళ్లకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? యూపీ, బీహార్‌లో పరిస్థితుల దిశగా మహారాష్ట్రను తీసుకువెళ్తున్నారు'' అని ఆయన అన్నారు.

Updated Date - 2022-08-16T21:17:15+05:30 IST