భూసార పరీక్షలకు బ్రేక్‌

ABN , First Publish Date - 2022-05-17T06:28:17+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లుగా భూసార పరీక్షలను నిలిపివేశాయి. గతంలో ప్రతీ వానాకాలం సీజన్‌కు ముందు భూసార పరీక్షలు నిర్వహించారు. అందుకు వేసవిలో రైతు చైతన్య యాత్రలు నిర్వహించి, పంట భూముల నుంచి మట్టి నమూనాలు సేకరించేవారు.

భూసార పరీక్షలకు బ్రేక్‌

మార్గదర్శకాలు విడుదల చేయని ప్రభుత్వం

రెండేళ్లుగా ఇదే పరిస్థితి


నల్లగొండ, మే 16 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రెండేళ్లుగా భూసార పరీక్షలను నిలిపివేశాయి. గతంలో ప్రతీ వానాకాలం సీజన్‌కు ముందు భూసార పరీక్షలు నిర్వహించారు. అందుకు వేసవిలో రైతు చైతన్య యాత్రలు నిర్వహించి, పంట భూముల నుంచి మట్టి నమూనాలు సేకరించేవారు. అదేవిధంగా పంట మార్పిడి చేయాలనుకునే రైతులు వారికి చెందిన భూముల్లో గజంలోతు వరకు గుంతలు తీసి నాలుగు వైపులా మట్టి సేకరించి సంబంధిత శాఖకు అప్పగించేవారు. ఈ మట్టి నమూనాలను పరీక్షించిన అనంతరం రైతులకు నివేదిక అందించేవారు. అయితే రెండేళ్లుగా ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా భూసార పరీక్షలు నిర్వహించడం లేదు.


విడుదలకాని మార్గదర్శకాలు

ప్రస్తుతం వానాకాలం సీజన్‌ దగ్గరపడుతుండగా, ఇప్పటి వరకు భూసార పరీక్షల ఊసే లేదు. అం తేగాక దీనికి సంబంధించిన మార్గదర్శకాలు ప్రభుత్వం నుంచి నేటికీ వెలువడలేదు. అయితే గత ఏడాది 2,500 మట్టి నమూనాలను ప్రదర్శన కోసం తీసుకున్నారు తప్ప వాటిని పరీక్షించలేదు. ఇదిలా ఉండగా, ఉమ్మడి జిల్లాలో భూసార పరీక్షలు నిర్వహించేందుకు కేవలం నల్లగొండ, మిర్యాలగూడలో మాత్రమే కేంద్రాలు ఉన్నాయి. వీటికి కూడా నిధుల కొరత ఉంది. సూర్యాపేటలో గతంలో భూసార పరీక్ష కేంద్రం ఉన్నా అది ప్రస్తుతం ఉనికిలో లేదు. నమూనాలను గతంలో మిర్యాలగూడ ల్యాబ్‌కు పంపి రిపోర్టులు తీసుకునేవారు. కాగా, ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.


రెండేళ్లుగా నిలిచిన పరీక్షలు

కేంద్ర ప్రభుత్వం 2016లో నేషనల్‌ మిషన్‌ ఫర్‌ సస్టేయినబుల్‌ అగ్రికల్చర్‌ (ఎన్‌ఎంఎ్‌సఏ) పథకం ప్రవేశపెట్టగా, ఈ పథకం కింద మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు నిర్వహించి రైతులకు సాయిల్‌ హెల్త్‌ కార్డులు అందజేశారు. ఏటా రెండు గ్రామాల చొప్పున దేశమంతా ఈ పథకాన్ని వర్తింపజేయాల్సి ఉంది. 2019 వరకు ఈ పథకం కొనసాగగా, ఆ తరువాత మట్టి నమూనాల సేకరణ నిలిచింది. రాష్ట్ర ప్రభుత్వం 2018లో అన్ని జిల్లాలకు భూసార పరీక్షల కిట్లను ఏఈవోలకు అందజేసింది. ఏఈవోలకు క్షేత్రస్థాయి పనుల కంటే ఆన్‌లైన్‌, ఇతర పనులే అధికమవడంతో భూసార పరీక్షల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. రైతువేదికల ద్వారా రైతులకు సాగులో సలహాలు, శిక్షణ ఇవ్వడంతోపాటు సాంకేతిక సమస్యల గురించి వివరించాలి. అంతేగాక భూసార పరీక్షలకు సంబంధించి మట్టి నమూనాలు సేకరించాలి. అయితే ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. దీంతో ఏఈవోలకు ఇచ్చిన భూసార పరీక్షల కిట్లు నిరుపయోగంగా ఉంటున్నాయి. నేటికీ పరీక్షలకు సంబంధించిన రసాయనాలను సైతం అందించలేదు. ఒక్కో భూసార పరీక్షల కిట్‌కు ప్రభుత్వం రూ.1.3లక్షలు వెచ్చించగా, ప్రస్తుతం వీటితో పనిలేకపోవడంతో మూలనపడేశారు. గతంలో ఉన్న ఏఈవోలకు కిట్లు ఇవ్వగా, ఇవి నిరుపయోగంగా ఉండటంతో కొత్త ఏఈవోలకు వీటి పంపిణీని నిలిపివేశారు.


ప్రభుత్వం నుంచి అనుమతి రావాలి : సుచరిత, నల్లగొండ జేడీఏ

భూసార పరీక్షలకు సంబంధించి మట్టి నమూనా సేకరణ, పరీక్షలు, వాటి ఫలితాల గురించి రైతులకు తెలియజేసేందుకు ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు రాలేదు. ప్రభుత్వ మార్గదర్శకాలు వస్తే మట్టి నమూనాలు సేకరిస్తాం. గత ఏడా ది ప్రదర్శన కోసం 2,500 నమూనాలు సేకరిం చాం. ప్రభుత్వం అనుమతిస్తే ఈ ఏడాది మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి ఫలితా న్ని వెల్లడిస్తాం. 

Updated Date - 2022-05-17T06:28:17+05:30 IST