Skywalk కు రక్షణ శాఖ బ్రేక్‌.. పనులు పూర్తయ్యే దశలో ఎందుకిలా..!?

ABN , First Publish Date - 2022-02-11T12:44:22+05:30 IST

మెహిదీపట్నంలో పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న స్కైవాక్‌ పనులకు బ్రేకులు..

Skywalk కు రక్షణ శాఖ బ్రేక్‌.. పనులు పూర్తయ్యే దశలో ఎందుకిలా..!?

  • మెహిదీపట్నంలో పనులు నిలిపివేత
  • డిఫెన్స్‌ అనుమతి తీసుకోవాలని హుకుం


హైదరాబాద్‌ సిటీ : మెహిదీపట్నంలో పాదచారుల కోసం ఏర్పాటు చేస్తున్న స్కైవాక్‌ పనులకు బ్రేకులు పడ్డాయి. త్వరగా స్కైవాక్‌ను అందుబాటులోకి తీసుకు రావాలని హెచ్‌ఎండీఏ పనులు చేపడుతుండగా, రక్షణ శాఖ అధికారులు అడ్డుకున్నారు. ప్రతిపాదిత ప్రధాన రోడ్డు తమ పరిధిలో ఉందని పేర్కొంటూ, పనులు చేస్తున్న కార్మికులను అడ్డుకున్నారు. సామగ్రిని కూడా తీసేసుకున్నారు. ఢిల్లీలోని రక్షణ శాఖ నుంచి అనుమతి పత్రం తీసుకొస్తేనే పనులు సాగనిస్తామని ఢిఫెన్స్‌ అధికారులు తేల్చి చెప్పినట్లు తెలిసింది. 


అత్యంత ట్రాఫిక్‌ రద్దీ గల ప్రాంతం మెహిదీపట్నం జంక్షన్‌.  ఈ జంక్షన్‌ నుంచే పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ ఉన్నప్పటికీ, రోడ్డు మార్గంలో వాహనాల రద్దీ అధికంగా ఉంటుంది. పాదచారులు రోడ్డు దాటలేని పరిస్థితి. దీంతో హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో స్కైవాక్‌ ప్రాజెక్టును ప్రతిపాదించారు. రూ.34.28 కోట్ల వ్యయంతో 380 మీటర్ల మేర స్టీల్‌ స్కైవాక్‌, 50 మీటర్ల వెడల్పుతో తీగల వంతెన, స్కైవాక్‌ను అనుసంధానంగా రెండు బస్‌బేలతో కమర్షియల్‌ కాంప్లెక్స్‌, పాదచారులకు లిఫ్టులు కూడా ఏర్పాటు చేసేందుకు నిర్ణయించారు. 



పనులు పూర్తయ్యే దశలో..

స్కైవాక్‌ పనులు గతేడాది హెచ్‌ఎండీఏ ప్రారంభించగా, వచ్చే నెలలో అందుబాటులోకి తీసుకొచ్చే విధంగా పనులు సాగుతున్నాయి. ఇప్పటికే ఆసి్‌ఫనగర్‌ రోడ్డు నుంచి, గుడిమల్కాపూర్‌ రోడ్డు నుంచి పిల్లర్ల ఏర్పాట్లు చేశారు. స్తంభాలను అమర్చేందుకు పనులు చేస్తున్నారు. రైతుబజార్‌తో పాటు ఎదురుగా రోడ్డుకు అవతల మిలటరీ ప్రహరీ వైపు గల బస్టా్‌పలోనే పిల్లర్ల కోసం గుంతలు తవ్వాల్సి ఉంది. ఈ పనులు చేస్తుండగా డిఫెన్స్‌ అధికారులు రెండు వాహనాల్లో వచ్చి అడ్డుకున్నారు. దీంతో చేసేదేమీ లేక హెచ్‌ఎండీఏ అధికారులు పనులు నిలిపేశారు. సుమారు 14 వరకు పిల్లర్లను ఏర్పాటు చేయాల్సి ఉన్నాయి. పనులు నిలిపివేయడంతో స్థానిక ఢిఫెన్స్‌ అధికారులతో చర్చించేందుకు హెచ్‌ఎండీఏ, స్థానిక పోలీసులు యత్నించినా అపాయింట్‌మెంట్‌ దొరకలేదని, ఢిల్లీ నుంచి అనుమతి పత్రంతో రావాలని సూచిస్తున్నట్లు తెలిసింది.


స్కైవాక్‌ ఇలా..

పీవీఎన్‌ఆర్‌ ఎక్స్‌ప్రెస్‌ వే పై నుంచి, కింద రోడ్డుపైన వాహనాలు పరుగులు తీస్తుంటే, మధ్యలో స్కైవాక్‌పై ఉన్న పాదచారులకు అద్భుత అనుభూతి కలిగేలా ప్రణాళికలు రూపొందించారు.  నడకమార్గంలో 12 ఎంఎం మందం కలిగిన పటిష్టమైన గ్లాస్‌ను,  స్కై వాక్‌కు ఇరువైపులా 2.5 మీటర్ల ఎత్తుతో స్టీల్‌ గ్రిల్‌ను ప్రతిపాదించారు. స్కైవాక్‌ ఎక్కి, దిగడానికి వివిధ ప్రాంతాల్లో ఆరు చోట్ల ప్రవేశ, నిష్క్రమణ మార్గాలుంటాయి. అన్నివైపులా జీఆర్‌సీ జాలీని ఏర్పాటు చేస్తారు. 16 లిఫ్టులను కూడా నిర్ణయించారు. దీంతో  పాదచారుల ఇబ్బందులు తొలగడంతో పాటు, ఆ జంక్షన్‌లో స్కైవాక్‌ ప్రత్యేక ఆకర్షణగా నిలవనుంది.

Updated Date - 2022-02-11T12:44:22+05:30 IST