గొర్రెల పంపిణీకి బ్రేక్‌!

ABN , First Publish Date - 2021-07-27T06:33:38+05:30 IST

మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో గొర్రెల పంపిణీకి

గొర్రెల పంపిణీకి బ్రేక్‌!

  • యూనిట్‌ ధరపెరగడంతో నిలిపివేత
  • ఏ ధర ప్రకారం అందించాలనేది సందిగ్ధం


ఆంధ్రజ్యోతి, మేడ్చల్‌జిల్లా ప్రతినిధి : మేడ్చల్‌-మల్కాజ్‌గిరి జిల్లాలో గొర్రెల పంపిణీకి బ్రేక్‌ పడింది. ప్రస్తుతం ప్రభుత్వం గొర్రెల యూనిట్‌ ధరను పెంచింది. పెంచిన ధరలకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేయాలా.. లేదంటే పాత ధరలకు ఇవ్వాల అనే విషయంపై సందిగ్ధం నెలకొంది. దీంతో మేడ్చల్‌ జిల్లాలో 105 గొర్రెల యూనిట్ల పంపిణీ నిలిచిపోయింది. ప్రభుత్వం గొర్రెల యూనిట్‌ ధర రూ.1.25 లక్షల నుంచి రూ.1.75 లక్షలకు పెంచింది. జిల్లాలో మొదటి, రెండో విడతలో గొర్రెల యూనిట్ల పంపిణీ కోసం 5,600 లబ్ధిదారులు డీడీలు చెల్లించారు. జిల్లాలో నిన్నమొన్నటి వరకు గొర్రెల యూనిట్ల పంపిణీ మంత్రి మల్లారెడ్డి చేతుల మీదుగా జరిగింది. కానీ పశుసంవర్థక శాఖ ఆదేశాల మేరకు గొర్రెల పంపిణీ నిలిపివేశారు. మిగిలి ఉన్న గొర్రెల యూనిట్లను పాత ధరలకు లబ్ధిదారులకు ఇవ్వాలా.. లేదా పెంచిన కొత్త ధరలతో ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకునే వరకు గొర్రెల యూనిట్ల పంపిణీకి బ్రేక్‌ వేశారు. 


గొర్రెల యూనిట్ల పంపిణికి బ్రేక్‌

మేడ్చల్‌ జిల్లాలో 68 గొర్రెల, మేకల పెంపకం సహకార సంఘాలు ఉన్నాయి. అందులో 5,600 మంది సభ్యులు ఉన్నారు. వీరికి గొర్రెల యూనిట్లను అందించడానికి ఏ, బీ గ్రూపులుగా విభజించారు. ‘ఏ’ గ్రూపులో ఉన్న 2,600 మంది లబ్ధిదారులకు గొర్రెల యూనిట్లను పంపిణీ చేశారు. ‘బీ’ గ్రూపులో ఉన్న 2,800 మంది లబ్ధిదారులు గొర్రెల యూనిట్ల కోసం డీడీలు కట్టారు. వీరికి గొర్రెల యూనిట్ల పంపిణీ జరుగుతూ వస్తుంది. ప్రభుత్వం గొర్రెల యూనిట్ల ధరను పెంచడంతో జిల్లాలో 105 యూనిట్ల పంపిణీకి బ్రేక్‌ పడింది. రూ.1.25 లక్షల గొర్రెల యూనిట్‌కు లబ్ధిదారులు రూ. 31,250 డీడీ చెల్లించాల్సి ఉంటుంది. పెంచిన గొర్రెల యూనిట్‌కు లబ్ధిదారులు రూ.43.750 డీడీలుగా చెల్లించాలి. ప్రస్తుతం నిలిపి వేసిన 105 గొర్రెల యూనిట్లకు చెల్లించిన డీడీలకు అదనంగా చెల్లించాల్సిన రూ.12,500లను ప్రభుత్వమే భరించి యూనిట్లను పంపిణీ చేస్తుందా.. లేదా లబ్ధిదారుల నుంచి వసూలు చేస్తుందా అన్న విషయం తేలాల్సి ఉంది.


  • 105మంది లబ్ధిదారులు

కీసర మండలం చీర్యాలలో ఒకరికి, శామీర్‌పేట మండలం అలియాబాద్‌లో నలుగురికి, మూడుచింతలపల్లి మండలం ఉద్దమర్రిలో 30మందికి గొర్రెల యూనిట్లు పంపిణీ చేయాలి. అదేవిధంగా మేడ్చల్‌ మండలంలోని గ్రామాలైన గౌడవల్లిలో 15మందికి, ఎల్లంపేట్‌లో 12 మందికి, సోమారంలో 11 మందికి, పూడూరులో 21 మందికి, రాజాబొల్లారంలో ఐదుగురికి, యాదరాం, రావల్‌కోలెలో ముగ్గురు చొప్పున యూనిట్లను పంపిణీ చేయాల్సి ఉందని పశు వైద్యాధికారి పి. శేఖర్‌ తెలిపారు.

Updated Date - 2021-07-27T06:33:38+05:30 IST