ఉచిత బియ్యానికి బ్రేక్‌!

ABN , First Publish Date - 2022-05-04T05:30:00+05:30 IST

కరోనా కారణంగా రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది.

ఉచిత బియ్యానికి బ్రేక్‌!


  • ఉచితానికి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి
  • సెప్టెంబరు వరకు పీఎం-జీకేఏవై గడువు
  • ఈ నెల నుంచి కిలోకు రూపాయి చొప్పున వసూలు
  • మనిషికి ఆరు కిలోలు పంపిణీ

కరోనా కారణంగా రెండేళ్లుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి ఈ నెల నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలుకుతోంది. గతంలోలాగానే కిలోకు రూపాయి చొప్పున వసూలు చేస్తారు. ఈ మేరకు రేషన్‌ డీలర్లకు ప్రభుత్వం స్పష్టం చేసింది. మనిషికి ఆరు కిలోల చొప్పున ఇవ్వాలని పేర్కొంది. అయితే కేంద్రం ఇచ్చే ఉచిత బియ్యం ఇస్తుందా? లేదా? అనేదానిపై స్పష్టత రావాల్సి ఉంది.

వికారాబాద్‌, మే 3(ఆంధ్రజ్యోతి ప్రతినిఽధి): కరోనాతో రెండేళ్లుగా పేదలకు ఇస్తున్న ఉచిత రేషన్‌ బియ్యం పంపిణీకి బ్రేక్‌ పడింది. కేంద్ర ప్రభుత్వం ఉచిత బియ్యం సెప్టెంబరు వరకూ పొడిగించగా, రాష్ట్ర ప్రభుత్వం ఉచిత పంపిణీని నిలిపివేసింది. ఈ నెల నుంచి కిలోకు రూపాయి వంతున కార్డులోని ఒక్కో వ్యక్తికి ఇచ్చే ఆరు కిలోలపై పైసలు వసూలు చేస్తారు. కరోనాతో ఆర్థిక ఇబ్బందులు పడుతున్న పేదలకు కేంద్ర ప్రభుత్వం 2020 మార్చిలో ప్రధానమంత్రి గరీబ్‌ కల్యాణ్‌ అన్న యోజన(పీఎం-జీకేఏవై)కింద ఉచిత బియ్యం పంపిణీ చేపట్టింది. కార్డులో పేరున్న ప్రతి ఒక్కరికీ కేంద్ర ప్రభుత్వం ఐదు కిలోల చొప్పున, అంతే మొత్తంలో రాష్ట్ర ప్రభుత్వం కలిపి మొత్తం పది కిలోల వంతున ఉచితంగా ఇచ్చారు. ఇది మొదట ఒక్కో వ్యక్తికి 12కిలోలు ఇచ్చారు. తరువాత పదికి తగ్గించారు. కేంద్ర ప్రభుత్వ ఉచిత పంపిణీని సెప్టెంబర్‌ వరకు పొడగించింది. ఏప్రిల్‌ వరకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మనిషికి పది కిలోల చొప్పున ఉచితంగా ఇచ్చాయి. అయితే తన వాటా ఐదు కిలోల ఉచిత పంపిణీకి మే నుంచి రాష్ట్ర ప్రభుత్వం స్వస్తి పలికింది. ఇకపై కిలోకు రూపాయి చొప్పున తీసుకొని మనిషికి ఆరు కిలోల బియ్యం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం రేషన్‌ డీలర్లుకు స్పష్టం చేసింది. అయితే కేంద్ర ప్రభుత్వం ఉచితంగా ఇచ్చే ఐదు కిలోలు ఇస్తరా? ఇవ్వరా? అనేది తమకు స్పష్టత లేదని డీలర్లు పేర్కొంటున్నారు. దీనిపై స్పష్టత రావాల్సి ఉంది. బయోమెట్రిక్‌, పోస్‌(పాయింట్‌ ఆఫ్‌ సేల్‌) విధానంలో పీడీఎస్‌ బియ్యం పంపిణీ చేస్తున్నారు.

ఈనెల కోటా ఖరారు

ఆహార భద్రత కార్డులో పేరున్న ప్రతీ వ్యక్తికి ఆరు కిలోల చొప్పున పంపిణీ చేస్తారు. అంత్యోదయ కార్డుదారులకు ఒక్కొక్కరికి కిలోకు రూపాయి వంతున 35కిలోలిస్తారు. అన్నపూర్ణకార్డుదారులకు ఒక్కొక్కరికి పది కిలోల వంతున ఉచితంగా అందజేస్తారు. అంత్యోదయ కార్డుదారులకు కిలో చక్కెర రూ.13.5కు ఇస్తారు. జిల్లా అధికారులు రేషన్‌ దుకాణాల వారీగా బియ్యం కోటాను ఖరారు చేశారు. డీలర్లు డీడీలు కట్టిన తరువాత రిలీజ్‌ ఆర్డర్లు(ఆర్‌వోలు) జారీచేస్తారు. అధికారుల ఆదేశాల అనంతరం రేషన్‌ దుకాణాలకు బియ్యం సరఫరా చేస్తారు. కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా సెప్టెంబర్‌ వరకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా బియ్యం ఉచితంగా ఇవ్వాలన్న డిమాండ్‌ వస్తోంది.

రేషన్‌ షాపులు         588

ఆహార భద్రత కార్డులు 214624

అంత్యోదయ కార్డులు 26933

అన్నపూర్ణ 38

లబ్ధిదారులు         8.70లక్షల మంది

ప్రతీ నెల బియ్యం కోటా 21880.830 టన్నులు

Read more