ఉపాధికి బ్రేక్‌

ABN , First Publish Date - 2021-05-06T07:35:58+05:30 IST

గత ఏడాది క్రితం అన్ని వర్గాల్లో కల్లోలం మిగిల్చిన కరోనా మహమ్మారి మళ్లీ అదే రీతిన వెంటాడుతోంది.

ఉపాధికి బ్రేక్‌

ఉపాధిని మింగేస్తున్న కరోనా..!

పని దొరకక కూలీల విలవిల 

స్వయం ఉపాధి పథకాలకూ ఆటంకాలు 

అయోమయంలో బీడీ కార్మికులు 

అవస్థల్లో అడ్డా కూలీలు 

ఆకాశాన్నంటుతున్న నిత్యావసర వస్తువుల ధరలు 

నిర్మల్‌, మే 5 (ఆంధ్రజ్యోతి) : గత ఏడాది క్రితం అన్ని వర్గాల్లో కల్లోలం మిగిల్చిన కరోనా మహమ్మారి మళ్లీ అదే రీతిన వెంటాడుతోంది. ఓ వైపు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న కరోనా మరోవైపు ప్రజల జీవనస్థితి గతులను తలకిందులు చేస్తోంది. ప్రజలంతా కరోనాభారిన ప డుతూ ఆహాకారాలు చేస్తుండగా ఈ రక్కసీ అందరి ఉపా ధిని మింగేస్తోంది. కరోనా తీవ్రత కారణంగా ఎక్కడికక్కడ పనులన్ని స్థంభించిపోతుండడంతో వేలాది మంది ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. ముఖ్యంగా రోజువారీ కూలీ పనులు చేసుకునే వారికి పనిదొరక్క తల్లడిల్లిపోతున్నారు. తమ కుటుంబాలను పోషించుకునేందుకు ప్రతిరోజూ తప్పనిసరిగా కూలీపనులు చేసుకునే వారంతా కరోనా కారణంగా పనులు లభించకపోతుండడంతో బెంబెలేత్తుతున్నారు. దీంతో పాటు స్వయం ఉపాధి పథకాలతో జీవిస్తున్న వారికి కరోనాఎఫెక్ట్‌తో ఆ పథకాలన్ని నీరుగారిపోతున్నాయి. దీంతో మొన్నటి వరకు వందలాది మంది నిరుద్యోగులు స్వయం ఉపాధి పథకాలను నడుపుకుంటూ బతికేవారంతా ప్రస్తుతం ఆ పథకాలు నిలిచిపోవడంతో ఉపాధికోసం పడిగాపులు కాయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. ముఖ్యంగా నిర్మల్‌ జిల్లాలో వేలాది మందికి ఉపాధి కల్పించే బీడీ పరిశ్రమ మరోసారి సంక్షోభానికి గురవుతోంది. మహారాష్ట్రతో పాటు ఇతర రాష్ర్టాల్లో కరోనా తీవ్రరూపం దాల్చిన నేపథ్యంలో అక్కడి రవాణా సౌకర్యాలన్ని నిలిచిపోయాయి. దీని కారణంగా జిల్లాలో తయారయ్యే బీడీ ఎగుమతులు సైతం స్తంభించిపోయాయి. ఎక్కడికక్కడ నిల్వలు పేరుకుపోవడంతో పరిశ్రమలన్నింటిని మూసేస్తున్నారు. ఈ పరిశ్రమపై నిర్మల్‌ జిల్లాలో దాదాపు లక్షకు పైగా కార్మికులు ఆధారపడి జీవిస్తున్నారు. వీరంతా గత సంవత్సరం కూడా కరోనా కారణంగా పెద్ద ఎత్తున ఉపాధి కోల్పోయారు. కొద్దినెలల నుంచి బీడీ పరిశ్రమ కోలుకుంటూ ఉపాధిని కల్పిస్తున్న క్రమంలోనే మళ్లీ కరోనా ఈ పరిశ్రమను కాటేసింది. వేలాది మంది మహిళ బీడీ కార్మికులు ప్రస్తుతం కంపెనీలన్నీ మూతపడడంతో ఉపాధి కోసం విలవిల్లాడుతున్నారు. ఇలా ఉపాధిని మింగిన కరోనా నిత్యావసర ధరలను సైతం ఆకాశానికి చేరుకునేలా చేస్తోంది. వంటనూనెలలతో పాటు బియ్యం, ఇతర సరుకుల ధరలు నాలుగింతలుగా పెరిగిపోయాయి. ముఖ్యంగా వంటనూనె ధర షేర్‌ మార్కెట్‌ మాదిరిగా ప్రతిరోజూ పెరిగిపోతుండడం జనాన్ని ఆందోళనకు గురి చేస్తోందంటున్నారు. 

అవస్థల్లో అడ్డా కూలీలు

ప్రతిరోజూ సాధారణ కూలీ పనులు చేసుకొని తమ కుటుంబాలను పోషించుకునే అడ్డాకూలీల పరిస్థితి ప్రస్తు తం దయనీయంగా మారింది. కరోనా తీవ్రతతో పనులన్నీ నిలిచిపోతున్న కారణంగా ఈ అడ్డాకూలీలకు ఉపాధి దొరకడం లేదు. ఎప్పటి మాదిరిగానే వీరు అడ్డాలపై పని కోసం వేచి చూస్తున్నప్పటికీ వీరిని పిలిచేవారే కరువయ్యారంటున్నారు. ఇలా అడ్డాకూలీల్లో స్థానికులే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి వలస వచ్చిన వారు కూడా వందలాది మంది ఉన్నారు. మొన్నటి వరకు కూలీ పనులతో కుటుంబాలను పోషించుకున్న వీరంతా ప్రస్తుతం పని లేక తమ కుటుంబాలను పోషించుకోవడం ఎలా అన్న ఆందోళనకు గురవుతున్నారు. రోజురోజుకూ కరోనా తీవ్రత పెరిగిపోతున్న కారణంగా చాలా మంది తమకు అవసరమయ్యే నిర్మాణ పనులతో పాటు రవాణా పరమైన పనులను నిలిపివేస్తున్నారు. దీంతో అడ్డాకూలీలకు పనిదొరకని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. తక్కువ కూలీ రేటుకైనా పని చేసేందుకు వీరు సిద్ధమవుతున్నప్పటికీ వారికి నిరాశతప్పడం లేదు. దీంతో వేలాది పేద కుటుం బాలన్ని గుక్కెడు బువ్వ కోసం తల్లడిల్లే పరిస్థితులు ఏర్పడనున్నాయంటున్నారు. 

స్వయం ఉపాధిపైనా ప్రభావం

కరోనా ముప్పు స్వయం ఉపాధి పథకాలను నడిపించుకుంటూ ఉపాధి పొందే వేలాది మందిని అయోమయానికి గురి చేస్తోంది. కరోనా కారణంగా స్వయం ఉపాధి పథకాల ద్వారా జరిగే వ్యాపార లావాదేవీలన్నీ స్తంభించిపోతున్నాయి. ఎగుమతులు, దిగుమతులు ఆగిపోవడం, రవాణా వ్యవస్థ నిలిచిపోవడంతో పాటు మార్కెటింగ్‌ కూడా తగ్గిపోవడంతో స్వయం ఉపాధి పథకాల నిర్వహణ సంక్షోభంలోకి కూరుకుపోయింది. వేలాది మంది బ్యాంకు రుణాలను తీసుకొని ఈ పథకాలను నడుపుకుంటూ తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. గత నెల రోజుల నుంచి కరోనా కారణంగా స్వయం ఉపాధి పథకాలు, పరిశ్రమలన్ని తడబడుతున్న కారణంగా బ్యాంకు రుణాల చెల్లింపులు గందరగోళంగా మారుతున్నాయి. దీంతో పాటు ఆర్థికంగా వీరంతా తీవ్రంగా నష్టాలపాలవుతున్నారు. పెట్టిన పెట్టుబడులు ఓ వైపు, వ్యాపారం నిలిచిపోవడం మరోవైపు వీరందరిని మానసిక ఆందోళనకు గురి చేస్తోంది. 

మళ్లీ బీడీ పరిశ్రమపై దెబ్బ

  జిల్లాలో దాదాపు లక్షల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమను మరోసారి కరోనా దెబ్బతీస్తోంది. కరోనా కారణంగా బీడీ కంపెనీలన్ని తాత్కలికంగా మూతపడుతున్నాయి. ముఖ్యంగా మహారాష్ట్రతో పాటు మరికొన్ని ఇతర రాష్ర్టాల్లో కరోనా కారణంగా లాక్‌డౌన్‌ కొనసాగుతున్నందున ఇక్కడి బీడీ ఎగుమతులకు బ్రేక్‌ పడింది. దీంతో బీడీ కార్మికులు తయారు చేసే బీడీల నిల్వలు స్థానికంగా ఉన్న కంపెనీ గోదాముల్లో పేరుకుపోతున్నాయి. ఇలాంటి పరిణామాల కారణంగా బీడీ యాజమాన్యాలు తమ పరిశ్రమలను మూసి వేస్తుండడంతో కార్మికులకు ఉపాధి నిలిచిపోయింది. జిల్లాలో దాదాపు ప్రతి ఇంటా ఒక్కరైనా బీడీ కార్మికులు ఉంటారంటే అతిశయోక్తి కాదు. వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పిస్తున్న బీడీ పరిశ్రమ మరోసారి కరోనాదెబ్బకు కుప్పకూలిపోవడం, వందలాది మంది ఉపాధిని కొల్లగొట్టేస్తోంది. కరోనా తీవ్రత ఎప్పటిలోగా తగ్గుతుందనే విషయంపై స్పష్టత లేకపోవడంతో మూత పడుతున్న బీడీ కంపెనీలు ఎప్పటి వరకు తెరుచుకుంటాయోనని కార్మికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.  

Updated Date - 2021-05-06T07:35:58+05:30 IST