నిధులు రావు.. పనులు జరగవు..

ABN , First Publish Date - 2020-09-21T06:47:44+05:30 IST

లోక్‌సభ లేదా రాజ్యసభకు ఎన్నికైన సభ్యుడు తన నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పనుల నిమిత్తం ఏటా ఎంపీ ల్యాడ్‌

నిధులు రావు.. పనులు జరగవు..

నియోజకవర్గ నిధుల కేటాయింపులకు బ్రేక్‌

ఎంపీల్యాడ్‌ నిధులపై కరోనా ఎఫెక్ట్‌

ఎమ్మెల్యేలకు రెండేళ్లుగా రాని సీడీపీ ఫండ్స్‌  

నియోజకవర్గఆల్లో కుంటుపడుతున్న అభివృద్ధి

వచ్చే రెండున్నరేళ్లు నిధులు లేనట్టే..


నియోజకవర్గ నిధులు రాక అభివృద్ధి కుంటుపడుతోంది. అటు కేంద్ర ప్రభుత్వం, ఇటు రాష్ట్ర ప్రభుత్వం సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంతో ఎంపీలు, ఎమ్మెల్యేలు ఏమీ చేయలేకపోతున్నారు. తమ నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు చేయలేక నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ ప్రాంతాలను బాగుచేస్తారని  ఆశిస్తున్న ప్రజలకు చివరికి నిరాశే ఎదురవుతోంది. కేంద్రం ఎంపీ ల్యాడ్స్‌ నిధులను విడుదల చేయడంలో ఎక్కడలేని పిసినారితనాన్ని ప్రదర్శిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వమూ అంతే.. దీంతో అభివృద్ధి పనుల విషయంలో ప్రజలకు ఏం సమాధానం చెప్పాలో తెలియక ప్రజా ప్రతినిధులు తలలు పట్టుకుంటున్నారు. 


హన్మకొండ, సెప్టెంబరు 20 (ఆంధ్రజ్యోతి): లోక్‌సభ లేదా రాజ్యసభకు ఎన్నికైన సభ్యుడు తన నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పనుల నిమిత్తం ఏటా ఎంపీ ల్యాడ్‌ నిధులు రూ.5కోట్లు కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుంది. రెండు దఫాలుగా దీనిని మంజూరు చేస్తుంది. సదరు ఎంపీ తన నియోజకవర్గంలో చేసిన పనికి సంబంధించిన ఖర్చుల వివరాలను సంబంధిత శాఖకు సమర్పించిన తర్వాత ఈ నిధులను కేంద్రం విడుదల చేస్తుంది. ఇక రాష్ట్రప్రభుత్వం నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) కింద ఏటా రూ.3కోట్ల చొప్పున రూ.15 కోట్లను విడుదల చేస్తుంది. కానీ ప్రస్తుతం ఇది ఆచరణలో కనిపించడం లేదు.


కరోనాతో సున్నా..

కొవిడ్‌-19 ప్రభావం ప్రభుత్వం చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలపైనా పడింది. లోక్‌సభ సభ్యులకు ఏటా ఇచ్చే అభివృద్ధి నిధులు (ఎంపీ లాడ్స్‌) నిలిపివేయనున్నట్టు కేంద్రం ఇప్పటికే ప్రకటించింది. గత ఆర్థిక సంవత్సరం రెండో ఇన్‌స్టాల్‌మెంట్‌తో పాటు 2020-21, 2021-22 సంవత్సరాలకు సంబంధించి మొత్తం గ్రాంట్స్‌ను కేంద్రం నిలిపివేసింది. అంటే రెండున్నరేళ్లకు సంబంధించిన నిధులు విడుదలయ్యే అవకాశాలు లేనట్టు తెలుస్తోంది. ఈమేరకు కేంద్రం ఎంపీలకు, జిల్లా కలెక్టర్లకు సమాచారం అందించింది. 


దీంతో ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో రాజ్యసభ, లోక్‌సభ సభ్యులకు వచ్చే అభివృద్ధి నిధులకు తాత్కాలికంగా బ్రేక్‌ పడింది. ఎంపీ లాడ్స్‌ నిధులను ఎక్కువగా మౌలిక వసతులు అంటే.. రహదారులు, భవనాలు, నీటిపారుదల పనులు, తాగునీటి పథకాలు, అంగన్‌వాడీ, పాఠశాలల భవనాలకు కేటాయిస్తుంటారు. ఎంపీ తన పదవీకాలంలో రూ.25కోట్లు, రాజ్యసభ సభ్యుడైతే రూ.30 కోట్ల విలువైన పనులు ప్రతిపాదించవచ్చు. రెండున్నరేళ్లకు సంబంధించిన నిధులు నిలిచిపోనున్నందున లోక్‌సభ సభ్యులకు తమ పదవీకాలంలో సగం కాలానికి కేంద్రం నుంచి నిధులు రావన్నమాట. కాగా, కేంద్రం ప్రకటన నేపథ్యంలో గత ఆర్థిక సంవత్సరంలో అంటే 2019-20లో తొలి ఇన్‌స్టాల్‌మెంట్‌కు సంబంధించి పనులు ప్రతిపాదించగా, ఆ మేరకు కేటాయింపులు జరిగాయి. ప్రస్తుతం పనులు జరుగుతున్న మేర బిల్లులు మంజూరు చేస్తారు. ఒకవేళ నిధులు సరిపోకపోతే ఇంకా ప్రారంభించని పనులకు సంబంధించిన నిధులు వాటికి కేటాయించనున్నారు. ఎంపీ లాడ్స్‌ నిలిచిపోవడం వల్ల గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో మౌలిక వసతులపై తీవ్ర ప్రభావం చూపుతుందని అధికారులు విశ్లేషిస్తున్నారు.


రాని సీడీపీ నిధులు

ఎమ్మెల్యేల నియోజకవర్గ అభివృద్ధి నిధులు (సీడీపీ) మంజూరు మరీ దారుణంగా మారింది. వరంగల్‌ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌, వరంగల్‌ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌కు 2019-20, 2020-21 సంవత్సరం ఎమ్మెల్యే నిధుల కేటాయింపు ఇప్పటి వరకు జరగలేదు. దీంతో నియోజకవర్గాల్లో అభివృద్ధి పనులు తీవ్ర అటంకం కలుగుతోంది. 


అరకొరగా విదిలింపు

వరంగల్‌ లోక్‌సభ ఎంపీ పసునూరి దయాకర్‌కు 2019-20 సంవత్సరానికి గాను మొదటి విడతగా రూ.2.50 కోట్లను కేంద్రం కేటాయించింది. భవిష్యత్తులో రానున్న నిధులను దృష్టిలో ఉంచుకొని ఆయన రూ4.85కోట్ల అంచనా వ్యయంతో 108 పనులను ప్రతిపాదించారు. వీటిలో రూ.1.47కోట్లు విడుదలయ్యాయి. రూ.3.37 కోట్లతో 73పనులు జరుగుతున్నాయి. 


రాజ్యసభ సభ్యుడు గరికపాటి మోహన్‌రావు పదవీకాలం పూర్తయినా ఆరేళ్ల కాలంలో రూ.30కోట్ల నిధులు రావలసి ఉంది. కానీ ఇప్పటివరకు రూ.19.11కోట్లు మాత్రమే వచ్చాయి. ఆయన రూ.31.04 కోట్ల అంచనా వ్యయంతో 839 పనులు మంజూరు చేయగా ఇందులో రూ.18.24 కోట్ల వ్యయంతో 507పనులకు నిధులు విడదలయ్యాయి. రూ.12.21కోట్ల వ్యయంతో 332 పనులు వివిధ దశల్లో ఉన్నాయి. మోహన్‌రావుకు 2014-15, 2015-16, 2016-17ఆర్థిక సంవత్సరాలకు ఐదేసి కోట్ల రూపాయల చొప్పున రూ.15 కోట్లు మంజూరయ్యాయి. 2017-18 సంవత్సరానికి సగం నిధులు రూ.2.94 కోట్లు, 2018-19 సంవత్సరానికి రూ.58.13లక్షలు, 2019-20 సంవత్సరానికి రూ.9.12 లక్షల నిధులు వచ్చాయి. ఈ ఆరేళ్ల కాలానికి రూ.19.10 కోట్లు రాగా, రూ.5.09కోట్ల అంచనా వ్యయంతో 839 పనులు మంజూరు చేశారు. వీటిలో రూ.507పనులకు రూ.18.24 కోట్లు విడుదలయ్యాయి. రూ.12.21కోట్లతో 332 పనులు పురోగతిలో ఉన్నాయి. 


రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ బండా ప్రకాశ్‌కు 2018-19 సంవత్సరంలో రూ.2.73 కోట్లు నిధులు రాగా 2019-20సంవత్సరానికి ఇప్పటివరకు ఒక్క పైసా కూడా రాలేదు. రూ.2.73 కోట్ల నిధుల్లో రూ.1.58కోట్ల అంచనా వ్యయంతో 20 పనులు మంజూరు చేయగా ఇందులో రూ.1.53 కోట్లతో 19 పనులు పురోగతిలో ఉన్నాయి. 

Updated Date - 2020-09-21T06:47:44+05:30 IST