ఆంధ్రప్రదేశ్‌ 3 రాజధానులకు బ్రేక్‌

ABN , First Publish Date - 2021-11-23T09:31:24+05:30 IST

మూడు రాజధానుల చట్టాల విషయంలో ‘తగ్గేదే లేదు’ అని ఇన్నాళ్లుగా అంటున్న ఏపీ సర్కారు... ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. అమరావతిని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల్లో..

ఆంధ్రప్రదేశ్‌ 3 రాజధానులకు బ్రేక్‌

  • సీఆర్‌డీఏ రద్దు చట్టం కూడా..
  • ఉపసంహరణ బిల్లుకు ఏపీ అసెంబ్లీ ఆమోదం
  • నేడు శాసనమండలి ముందుకు..
  • అది ఆమోదించాక గవర్నర్‌కు
  • ఆయన అంగీకారం రాగానే హైకోర్టుకు వివరాల నివేదన
  • చట్టం రద్దుతో తక్షణమే ఏపీసీఆర్‌డీఏ పునరుద్ధరణ
  • ఏఎంఆర్‌డీఏకు బదిలీ అయిన ఆస్తులు, సిబ్బంది మళ్లీ దాని పరిధిలోకే
  • ఏఎంఆర్‌డీఏలో నియమితులైన ఉద్యోగులు 
  • ఇతర సంస్థల్లో సర్దుబాటు


మూడు రాజధానుల చట్టాల విషయంలో ‘తగ్గేదే లేదు’ అని ఇన్నాళ్లుగా అంటున్న ఏపీ సర్కారు... ఉన్నట్టుండి వెనక్కి తగ్గింది. అమరావతిని కాదని అభివృద్ధి వికేంద్రీకరణ పేరుతో తీసుకొచ్చిన పరిపాలన వికేంద్రీకరణ, సీఆర్డీయే రద్దు చట్టాల్లో సాంకేతిక లోపాలున్నాయని ఇప్పుడు గుర్తించి.. వాటిని ఉపసంహరించుకుంటున్నట్టు సోమవారం ప్రకటించింది. సంబంధిత వర్గాలతో చర్చించి... మరింత పకడ్బందీ బిల్లులతో మళ్లీ ముందుకు వస్తామని తెలిపింది. పాత చట్టాలు చేసి ఇప్పటికి దాదాపు రెండేళ్లు గడిచిపోయాయి. ‘త్వరలో’ అంటున్న కొత్త బిల్లులు ఎప్పుడొస్తాయో తెలియదు! ఎలా ఉంటాయో తెలియని పరిస్థితి! కాగా.. ప్రభుత్వ అనాలోచిత చర్యలతో రాష్ట్రం మరింత అనిశ్చితిలోకి జారుకుందని విపక్షాలు విమర్శించాయి. హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందనే ప్రభుత్వం ‘మూడు’పై వెనక్కి తగ్గిందని పేర్కొన్నాయి. ఇప్పటికైనా భేషజాలు కట్టిపెట్టి అమరావతినే రాజధానిగా ప్రకటించాలని డిమాండ్‌ చేశాయి. ప్రభుత్వ పెద్దలు మాత్రం ఇది ‘ఇంటర్వెల్‌’ మాత్రమే అంటున్నారు. మరి.. క్లైమాక్స్‌లో శుభం కార్డు ఎలా, ఎవరికి పడుతుందో!


అమరావతి, నవంబరు 22 (ఆంధ్రజ్యోతి): మూడు రాజధానుల విషయంలో జగన్‌ సర్కారు వెనక్కి తగ్గింది. హైకోర్టులో ఎదురుదెబ్బ తగులుతుందన్న భయమో.. ఢిల్లీ పెద్దల ఆదేశాల ఫలితమో.. అమరావతి రైతుల మహాపాదయాత్రకు లభిస్తున్న జననీరాజనమో.. కారణమేదైనాగానీ సోమవారంనాడు అనూహ్య నిర్ణయం తీసుకుంది. మూడు రాజధానుల చట్టాన్ని, ఏపీ సీఆర్‌డీఏ రద్దు చట్టాన్ని ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించింది. ఇదే విషయాన్ని హైకోర్టుకు తెలిపి.. ఆంధ్రప్రదేశ్‌ రాజధాని ప్రాంతం అభివృద్ధి అథారిటీ (ఏపీసీఆర్‌డీఏ) రద్దు చట్టం(2020), ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి (మూడు రాజధానులు) చట్టం (2020), వాటి అనుబంధ అంశాలను ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు పెట్టింది. ఆ బిల్లును శాసనసభ ఆమోదించింది. ఆర్థిక, శాసనసభా వ్యవహారాల మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి వీటిని ప్రవేశపెట్టారు. శాసనసభ ఆమోదించిన ఈ ఉపసంహరణ బిల్లు మంగళవారం శాసనమండలి ముందుకు వెళ్తుంది.


మండలి ఆమోదం తర్వాత గవర్నర్‌ అంగీకారానికి పంపుతారు. ఆయన ఆమోద ముద్ర వేసిన అనంతరం వివరాలను హైకోర్టు ముందు ఉంచుతారు. కాగా.. ఏపీసీఆర్‌డీఏ (2014) చట్టాన్ని తక్షణమే పునరుద్ధరిస్తున్నట్లు బిల్లులో పేర్కొన్నారు. అమరావతి మెట్రోపాలిటన్‌ రీజియన్‌ డెవల్‌పమెంట్‌ అథారిటీ(ఏఎంఆర్‌డీఏ)కి బదిలీ అయిన ఆస్తులు తిరిగి సీఆర్‌డీఏ పరిధిలోకి వస్తాయని తెలిపారు. ‘ఏఎంఆర్‌డీఏ చట్టం అమల్లోకి రాకముందు నియమించిన ఉద్యోగులందరూ సీఆర్‌డీఏలో నియమితులవుతారు. ఏఎంఆర్‌డీఏలో నియమించిన సిబ్బందిని ఇతర సంస్థలు, స్థానిక సంస్థల్లో సర్దుబాటు చేసే అధికారం ప్రభుత్వానికి ఉంది. ఆ మేరకు మార్గదర్శకాలు రూపొందించాలి. దానికి సంబంధించి ఏవైనా సమస్యలుంటే రాష్ట్రప్రభుత్వం పరిష్కరించాలి. శ్రీబాగ్‌ ఒప్పందం మేరకు ఉత్తరాంధ్రతో పాటు రాష్ట్రంలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం ఆంధ్రప్రదేశ్‌ వికేంద్రీకరణ, అన్ని ప్రాంతాల సమ్మిళిత అభివృద్ధి చట్టం 2020, ఏపీసీఆర్‌డీఏ ఉపసంహరణ చట్టం-2020లను తీసుకొచ్చాం. వాటికి వ్యతిరేకంగా కోర్టులో వ్యాజ్యాలతో పాటు కౌన్సిల్‌లో కొంత మంది సభ్యుల నుంచి అభ్యంతరాలు రావడంతో సెలెక్ట్‌ కమిటీకి పంపాం. దీనిపై మరింత అధ్యయనం చేయాల్సిన అవసరముంది. వికేంద్రీకరణ విధానంపై అన్నీ వర్గాల ప్రజలతో సంప్రదించి స్పష్టత తీసుకోవాల్సిన అవసరముంది. ఆ చట్టాలను ఉపసంహరించుకుని.. ఆ తర్వాత అందరి ఆమోదంతో మళ్లీ అసెంబ్లీలో అన్ని ప్రాంతాల అభివృద్ధి కోసం చట్టం చేయాలని ప్రభుత్వం భావిస్తోంది’ అని బిల్లులో వివరించారు.


పాపం బొత్స..

మూడు రాజధానుల బిల్లు అసెంబ్లీలో ప్రవేశపెట్టే సందర్భంగా సంబంధిత మంత్రి బొత్స సత్యనారాయణ ప్రేక్షక పాత్ర వహించాల్సి రావడంతో పలువురు ‘పాపం బొత్స’ అని వ్యాఖ్యానించారు. గతంలో సీఆర్‌డీఏ చట్టం ఉపసంహరణ, మూడు రాజధానుల బిల్లులను పురపాలక,పట్టణాభివృద్ధిశాఖ మంత్రిగా బొత్స సత్యనారాయణ ప్రవేశపెట్టారు. అయితే సోమవారం అసెంబ్లీలో వాటి ఉపసంహరణ బిల్లు ప్రవేశపెట్టడంలో ఆయన పాత్ర లేకపోవడం అందరినీ ఆశ్చర్యపరచింది. బొత్స అసెంబ్లీలో ఉన్నప్పటికీ ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి చేతుల మీదుగా ప్రవేశపెట్టడం గమనార్హం. 3 రాజధానుల చట్టం ఉపసంహరణలో తన పాత్ర ఉండకూడదని బొత్స అనుకున్నారా.. లేక జగనే ఆయనకు ఆ అవకాశమివ్వలేదా.. ఇలా రకరకాలుగా చర్చించుకుంటున్నారు.


33 వేల ఎకరాలు తీసుకున్నారు

రాజధాని నిర్మాణం కోసం గత ప్రభుత్వం అమాయకుల నుంచి 33 వేల ఎకరాలు తీసుకుందని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథరెడ్డి అన్నారు. మూడు రాజధానుల ఏర్పాటుపై 3 శాతం మందిలోనే వ్యతిరేకత ఉందని చెప్పారు. సీఆర్‌డీఏ రద్దు చట్టం, 3 రాజధానుల చట్టాలను ఉపసంహరిస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టిన ఆయన.. ఈ సందర్భంగా ప్రసంగించారు. వికేంద్రీకరణపై మరింత అధ్యయనం చేసి.. మూడు శాతం మందిలో ఉన్న వ్యతిరేకతను కూడా నివారించేలా సమగ్రమైన అధ్యయనం చేస్తామని చెప్పారు. ‘ఉమ్మడి ఏపీలో తెలంగాణ ఉద్యమం, జై ఆంధ్రా ఉద్యమం వచ్చాయి. భాషా ప్రాతిపదికన ఏర్పాటైన రాష్ట్రం మళ్లీ 2014లో 2 భాగాలుగా విడిపోయింది. రాష్ట్ర విభజనకు ముందు కేంద్రం వేసిన శ్రీకృష్ణ కమిటీ ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతాలు వెనుకబడ్డాయని వెల్లడించింది. హైదరాబాద్‌తో కూడిన తెలంగాణ అభివృద్ది విషయంలో రాయలసీమ, ఉత్తరాంధ్ర కంటే ఒక మెట్టు ఎత్తులోనే ఉందని తెలిపింది. రాష్ట్ర విభజన జరిగాక.. కేంద్రం శివరామకృష్ణన్‌ కమిటీని నియమించింది. ఈ కమిటీ విభజిత ఆంధ్రప్రదేశ్‌లోని 13 జిల్లాల్లో పది జిల్లాల్లో పర్యటించింది. కానీ రాజధానిపై స్పష్టత ఇవ్వలేదు.


అయితే గుంటూరు, కృష్ణా జిల్లాల్లో సారవంతమైన నేలలు ఉన్నందున భూములు ఖరీదైనవిగా పేర్కొంది. ఈ ప్రాంతంలో రాజధాని నిర్మాణం జరిగితే.. వ్యయం అధికంగా ఉంటుందని చెప్పింది. రాష్ట్రాల అభివృద్ధి కోసం కేంద్రం పలు ప్రభుత్వరంగ సంస్థలను కేటాయించింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అన్నీ హైదరాబాద్‌లో ఏర్పాటు చేయడం వల్ల.. అభివృద్ధి అక్కడే కేంద్రీకృతమైంది. ఇదే రాష్ట్ర విభజనకు దారితీసింది. ఇలాంటి చేదు అనుభవం పునరావృతం కాకుండా.. పరిపాలనా వికేంద్రీకరణ చేయాలని నిర్ణయించాం. ఇప్పుడు అందరి అపోహలూ తీరుస్తూ కొత్తగా 3 రాజధానుల బిల్లును తీసుకొస్తాం’ అని బుగ్గన పేర్కొన్నారు.





Updated Date - 2021-11-23T09:31:24+05:30 IST