అమెరికా ఎన్నికల్లో మోసం జరిగింది.. ఇక్కడ కూడా జరగొచ్చు: బ్రెజిల్ అధ్యక్షుడు

ABN , First Publish Date - 2020-11-30T08:35:19+05:30 IST

అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల

అమెరికా ఎన్నికల్లో మోసం జరిగింది.. ఇక్కడ కూడా జరగొచ్చు: బ్రెజిల్ అధ్యక్షుడు

రియో డీ జనైరో: అమెరికా ఎన్నికల్లో మోసం జరిగిందంటూ బ్రెజిల్ అధ్యక్షుడు జైర్ బొల్సొనారో సంచలన వ్యాఖ్యలు చేశారు. మున్సిపల్ ఎన్నికల సందర్భంగా ఓటు వేసిన ఆయన.. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చేస్తున్న ఆరోపణల గురించి ప్రస్తావించారు. అమెరికా ఎన్నికల్లో మోసం జరిగినట్టు తన దగ్గర చాలా సమాచారం ఉన్నట్టు జైర్ బొల్సొనారో చెప్పుకొచ్చారు. బైడెన్ గెలుపును అంగీకరిస్తారా అని ఆయనను మీడియా ప్రశ్నించగా.. మరికొంతకాలం వేచి చూస్తానంటూ సమాధానమిచ్చారు. ఇక బ్రెజిల్ ఎలక్ట్రానిక్ ఓటింగ్ సిస్టమ్‌పై కూడా ఆయన సందేహం వ్యక్తం చేశారు. బ్రెజిల్ ఎన్నికల్లో కూడా మోసం జరిగే అవకాశముందని, 2022 అధ్యక్ష ఎన్నికల్లో తిరిగి పేపర్ బ్యాలెట్ సిస్టమ్‌ అమలు చేయాలన్నారు. 


మొదటి నుంచి ట్రంప్, జైర్ బొల్సొనారో మాటల్లో, చేతల్లో అనేక పోలికలను గమనించవచ్చు. కరోనా కేసులు పెరుగుతున్నా లాక్‌డౌన్ విధించడానికి అటు ట్రంప్, ఇటు బొల్సొనారో అంగీకరించలేదు. లాక్‌డౌన్ విధిస్తే మహమ్మారి కంటే ఆర్థిక రంగం వల్లే ఎక్కువ నష్టపోతామంటూ ఇద్దరూ కూడా చెప్పుకొచ్చారు. ఇక ఈ ఇద్దరు అధ్యక్షులు కరోనా బారిన పడిన విషయం కూడా తెలిసిందే. ప్రపంచవ్యాప్తంగా అత్యధిక కరోనా కేసులు, మరణాలు నమోదైన దేశాల జాబితాలోనూ మొదటి స్థానంలో అమెరికా ఉండగా.. రెండో స్థానంలో బ్రెజిల్ ఉండటం గమనార్హం.

Updated Date - 2020-11-30T08:35:19+05:30 IST