యాపిల్ వాచ్ 6ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బ్రెజిల్ నటుడు.. ప్యాక్ విప్పి చూస్తే రాయి!

ABN , First Publish Date - 2021-12-22T02:53:44+05:30 IST

ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ఒకదానికి బదులు మరోటి రావడం, లేదంటే ఓ రాయో, రప్పో రావడం మన దగ్గరే కాదు..

యాపిల్ వాచ్ 6ను ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన బ్రెజిల్ నటుడు.. ప్యాక్ విప్పి చూస్తే రాయి!

బ్రసిలియా: ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసేటప్పుడు ఒకదానికి బదులు మరోటి రావడం, లేదంటే ఓ రాయో, రప్పో రావడం మన దగ్గరే కాదు.. దీనికి దేశాలతో సంబంధం లేదని తేలింది. బ్రెజిల్ నటుడు ఒకరు ఆన్‌లైన్‌లో ‘యాపిల్ వాచ్ 6’ను ఆర్డర్ చేశాడు. పార్శిల్ అందాక దానిని తెరిచి చూసిన అతడు నిర్ఘాంతపోయాడు. లోపలున్నది వాచ్ కాదు.. రాయి.


బ్రెజిల్‌కు చెందిన మురిలో బెనిసియో ప్రముఖ నటుడు. యాపిల్ వాచ్ 6ను కొనుగోలు చేయాలని భావించిన మురిలో.. రిటైలర్ క్యారీఫోర్ నుంచి ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేశాడు. 12 రోజుల తర్వాత అతడికి పార్శిల్ అందింది. అన్ని రోజులపాటు వాచ్‌కోసం ఎదురుచూసిన అతడు పార్శిల్ రాగానే ఆత్రుతతో దానిని విప్పి చూసి షాకయ్యాడు. అందులో అతడు ఆర్డర్ చేసిన వాచ్‌కు బదులుగా రాయి ఉంది.


యాపిల్ వాచ్ కోసం అతడు 530 డాలర్లు (దాదాపు రూ. 40 వేలు) చెల్లించాడు. వాచ్‌కు బదులు రాయి ఉండడంతో షాకైన బెనిసియో తేరుకుని క్యారీఫోర్ సంస్థను సంప్రదిస్తే నిరాశే ఎదురైంది. రిటైలర్ నుంచి సరైన సమాధానం రాకపోవడంతో నటుడు కంపెనీపై కోర్టుకెక్కాడు. వాచ్‌ కోసం తాను చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇప్పించాలని కోర్టును అభ్యర్థించాడు. నటుడు కోర్టుకెక్కడంతో దిగి వచ్చిన కంపెనీ సయోధ్య కుదుర్చుకుంది. 1500 డాలర్లు చెల్లించేందుకు అంగీకరించింది.

Updated Date - 2021-12-22T02:53:44+05:30 IST