ప్లాట్‌ ఇస్తే.. ప్లాంటు గోవిందా !

ABN , First Publish Date - 2020-07-03T10:48:59+05:30 IST

తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో వ్యర్థంతో విద్యు త్‌ ప్లాంట్‌ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. అర్బన్‌

ప్లాట్‌ ఇస్తే.. ప్లాంటు గోవిందా !

వ్యర్థంతో విద్యుత్‌ ప్లాంట్‌కు బ్రేక్‌

ఆ భూముల్లో ఇళ్ల స్థలాలకు కసరత్తు

అక్కడే డంపింగ్‌ యార్డు


(తాడేపల్లిగూడెం-ఆంధ్రజ్యోతి): తాడేపల్లిగూడెం విమానాశ్రయ భూముల్లో వ్యర్థంతో విద్యు త్‌ ప్లాంట్‌ నిర్మాణానికి గత ప్రభుత్వ హయాంలో చర్యలు తీసుకున్నారు. అర్బన్‌ హౌసింగ్‌ ప్రాజెక్ట్‌ సమీపంలో ఉన్న 13 ఎకరాలు భూమిని గుర్తించారు. మహారాష్ట్రకు చెందిన ఎస్సెల్‌ కంపెనీకి ప్రాజెక్ట్‌ బాధ్యతలను అప్పగించారు. ప్రాజెక్ట్‌కు కేటా యించిన స్థలం చుట్టూ ప్రహరీ నిర్మించి కార్యాలయాన్ని ప్రారంభించారు. కారణాలు ఏమైౖనా ప్రాజెక్ట్‌ బాధ్యతల నుంచి ఎస్సెల్‌ కంపెనీ తప్పుకుంది. అదే స్థలంలో కొంత భాగాన్ని తాడేపల్లిగూడెం మునిసిపాలిటీ డంపింగ్‌ యార్డుగా ఉపయో గించుకుంటోంది. మిగిలిన స్థలంలో ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.  రెవెన్యూ శాఖ అదే భూమిని ఇళ్ల స్థలాల కోసం గుర్తించింది. పట్టణంలో 713 మందికి అక్కడ ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు సన్నాహాలు చేస్తు న్నారు. తాడేపల్లిగూడెం అధికారుల చర్యలపై సర్వత్రా విమర్శ లు వెల్లువెత్తుతున్నాయి.


వ్యర్థంతో విద్యుత్‌ ప్లాంట్‌ ఏర్పాటైతే జిల్లాలోని ఏలూరు, భీమవరం, తాడేపల్లిగూడెం, తణుకు, పా లకొల్లు, నర్సాపురం, నిడదవోలు, జంగారెడ్డిగూడెంల నుంచి చెత్తను తరలించేందుకు అవకాశం ఉండేది. ప్లాంట్‌ నిర్వహణ కు ప్రతిరోజు కనిష్ఠంగా 350 టన్నుల చెత్త అవసరమయ్యేది. ఫలితంగా పట్టణాల్లో డంపింగ్‌ యార్డుల సమస్య గట్టెక్కేది. ప్రస్తుతం అధికారుల చర్యలతో వ్యర్థంతో విద్యుత్‌ ప్లాంట్‌ ప్రాజెక్ట్‌ శాశ్వతంగా తెరమరుగైనట్లే. ప్రాజెక్ట్‌ నిర్మాణం కోసం ఎస్సెల్‌ కంపెనీ ఏర్పాటు చేసిన ప్రహరీ మధ్యలో స్థలాన్ని లబ్ధిదారులకు పట్టాలు ఇచ్చే ప్రక్రియను ప్రారంభించారు. దానికి ఆనుకునే డంపింగ్‌ యార్డు ఉండడంతో పట్టణ చెత్త అంతటినీ అక్కడే వేస్తున్నారు. ఆ ప్రదేశం చెత్త కొండల మాదిరిగా కనిపిస్తోంది. మళ్లీ చెత్త డంప్‌చేయడానికి చోటు చాలకపోవడంతో చెత్తను తగులబెడుతున్నారు. చెత్తకు నిప్పం టించడం వల్ల నిత్యం పొగ మేఘంలా కమ్ముకుని చుట్టుపక్క ల వారు ఇబ్బందులు పడుతున్నారు.


అటువంటిచోట ఇప్పుడు ఇళ్లస్థలాలు ఇవ్వడం విస్మయం కలిగిస్తుంది. ఇళ్ల స్థలాలు ఇస్తే డంపింగ్‌ యార్డు వేరొక చోటికి తరలించాలి. ఇప్పటికే యార్డు సమీపంలో రాజీవ్‌ గృహకల్ప ఉంది. కొత్తగా నిర్మిస్తున్న అర్బన్‌ హౌసింగ్‌ ఇళ్లు ఉన్నాయి. అదే ప్రాంతంలో ప్రైవేటు వెంచర్లు వెలుస్తున్నాయి. డంపింగ్‌ యార్డును తరలించడానికి ఇప్పటినుంచే మున్సిపాలిటీ చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.


పట్టణాల్లో స్థలాలపై స్టే

పట్టణాల్లో అత్యంత విలువైన భూములను ఇళ్ల స్థలాల కోసం కేటాయించడంపై కొందరు హైకోర్టును ఆశ్రయించడం తో స్టే మంజూరైంది. రహదారులకు ఆనుకుని పట్టాలు ఇచ్చే ప్రక్రియను చేపడుతున్నారు. గణేశ్‌ నగర్‌ రోడ్డు నుంచి శశి కళాశాల రహదారి మాస్టర్‌ ప్లాన్‌లో వంద అడుగులు ఉంది. నిట్‌ రెండో వైపు గేటు వేస్తే ఇదే రహదారిని ఉపయోగించు కోనున్నారు. మరోవైపు అదే రహదారి వెంబడి ఆనుకుని ఉన్న భూముల్లో మెడికల్‌ కళాశాల ఏర్పాటుకు ప్రయత్నం చేస్తు న్నారు.అటువంటి కీలకమైన రహదారిని కుదిస్తూ ఇరువైపులా పట్టాలు ఇవ్వాలని చూస్తున్నారు.


భవిష్యత్తులో రహ దారులు విస్తరించాలంటే ఇబ్బందులు తప్పదు. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకుని హైకోర్టు ఆశ్రయించిన వారికి సానుకూల తీ ర్పు వెలువడింది. పట్టాలు పంపిణీకి చెక్‌ పెడుతూ స్టే ఇచ్చింది. హైకోర్టులో వ్యాజ్యం వేసిన వారు తహసీల్దార్‌ను ప్రతివాదిగా చేర్చారు. ప్రస్తుతం తహసీల్దార్‌ సెలవులో ఉండడంతో ఆయన స్థానంలో కమిషనర్‌ బాధ్యత వహించి పట్టాలు ఇచ్చేందుకు చర్యలు చేపడుతున్నారు. దీనిని గమనించి హైకోర్టు స్టే విషయంపై న్యాయవాదితో మునిసిపల్‌ కమిషనర్‌కు నోటీసు ఇచ్చేందుకు పావులు కదుపుతున్నారు.

Updated Date - 2020-07-03T10:48:59+05:30 IST