గుర్రం గడ్డ బ్రిడ్జి నిర్మాణానికి బ్రేక్‌

ABN , First Publish Date - 2020-07-04T10:57:12+05:30 IST

గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణ పనులకు మరో సారి బ్రేక్‌ పడింది. నిర్మాణ సామగ్రిని తరలించేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధం కావడంతో శుక్రవారం గ్రామస్థులు

గుర్రం గడ్డ బ్రిడ్జి నిర్మాణానికి బ్రేక్‌

సామాగ్రి తరలింపునకు సిద్ధమైన కాంట్రాక్టర్‌

అడ్డుకునేందుకు గ్రామస్థుల యత్నం


గద్వాల రూరల్‌, జూలై 3 : గుర్రంగడ్డ బ్రిడ్జి నిర్మాణ పనులకు మరో సారి బ్రేక్‌ పడింది. నిర్మాణ సామగ్రిని తరలించేందుకు కాంట్రాక్టర్‌ సిద్ధం కావడంతో శుక్రవారం గ్రామస్థులు అడ్డుకునేందుకు యత్నించారు. దీంతో పెబ్బేరు పోలీసులు రంగంలోకి దిగి గ్రామస్థులకు నచ్చచెప్పారు. వారు అంగీకరించకపోవడంతో వారిని చెదరగొట్టారు. ఈ సందర్భంగా గ్రామస్థులు మాట్లాడుతూ  బ్రిడ్జి నిర్మాణం కోసం రెండేళ్లుగా ఎదురు చూస్తున్నామన్నారు. ఇప్పటిదాకా కాలయాపన చేసి, ఇప్పుడు ఏకంగా మొత్తం సామగ్రిని తరలించుకపోవడం ఏమిటని ప్రశించారు. సాయంత్రం వరకు గ్రామస్థులు వాహనాలను కదలనివ్వలేదు.


అక్టోబర్‌లో పనులు చేపడతాం

ప్రస్తుతం పనులు చేసే పరిస్థితి లేదని, మెటీరియల్‌కు రక్షణ లేకుండా పోయిందని బ్రిడ్జి నిర్మాణ అనుమతులు పొందిన విఎస్‌సీ ఇన్‌ఫ్రా కంపినీ ప్రతినిధి తెలిపారు. దానికి తోడు ఇతర ప్రాంతాలలో పనులు చేయడానికి సామగ్రి అవసరం ఉంది. ఈ ఏడాది అక్టోబర్‌లో నదీ ప్రవాహం తగ్గిన తర్వాత అడ్డుకట్ట వేసైనా నిర్మాణం చేపడతామని చెప్పారు. 


కంపెనీకి నోటీసు ఇచ్చాం

ఈ ఏడాది నిర్మాణం చేపట్టాలని వీఎస్‌సీ ఇన్‌ఫ్రా కంపెనీకి నోటీసులు ఇచ్చామని పీజేపీ ఈఈ రహిముద్దీన్‌ తెలిపారు. కరోనా వైరస్‌, లాక్‌డౌన్‌ కారణంగా పనులు చేపట్టలేమని, అక్టోబర్‌లో నదికి అనకట్టవేసైన నిర్మాణం చేపడతామని వారు జవాబు ఇచ్చారని చెప్పారు. సామగ్రి తరలిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. వచ్చే ఏడాది వరదల నాటికి పనులు పూర్తి చేయాలని, లేదంటే కంపెనీపై చర్యలు తీసుకుంటామని అన్నారు. 

Updated Date - 2020-07-04T10:57:12+05:30 IST