మెదడు పోటు... మహా చేటు

ABN , First Publish Date - 2021-10-29T05:13:47+05:30 IST

శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్‌ స్ట్రోక్‌. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు.

మెదడు పోటు... మహా చేటు

అవగాహన లోపం, నిర్లక్ష్యంతో పక్షవాతం ముప్పు

యువకులపై కూడా ప్రభావం

జిల్లాలో 1.15 లక్షల మందికిపైగా బాధితులు

నేడు ప్రపంచ బ్రెయిన్‌ స్ర్టోక్‌ నివారణ దినం 



నెల్లూరు (వైద్యం), అక్టోబరు 28 : 

శరీర అవయవాల పనితీరును నియంత్రించే మెదడు దెబ్బతినడం వల్ల కలిగే వ్యాధి బ్రెయిన్‌ స్ట్రోక్‌. మెదడులో రక్తం సరఫరా సరిగ్గా జరగక పోవటం, రక్తనాళాలు చిట్లటం వంటి కారణాలతో బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురై పక్షవాతం బారిన పడతారు. మెదడుకు ఆక్సిజన్‌ సరఫరా మూడు నుంచి నాలుగు నిమిషాలు నిలిచిపోతే నరాలు చచ్చుబడి మెదడులోని వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతుంది. ఈ వ్యాధి ఒకప్పుడు వృద్ధాప్యంలో ఉన్న వారికే వచ్చేది. కానీ ప్రస్తుతం 30 ఏళ్ల యువకులు కూడా దీని బారిన పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. జీవన విధానంలో మార్పులు, తీవ్రమైన ఒత్తిడి, ఆహారపు అలవాట్లు, శారీరక శ్రమ లేకపోవటం వంటి కారణాల వల్ల అనేక మంది పక్షవాతానికి గురవుతున్నారు. కేన్సర్‌, గుండె వ్యాధుల తరువాత అత్యధికంగా మరణాలకు కారణమవుతున్న వ్యాధి పక్షవాతం అని, దీని విషయంలో తస్మాత్‌ జాగ్రత్త అని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.  కేవలం 10శాతం మందికే పక్షవాతంపై అవగాహన ఉండటంతో సగానికి పైగా వ్యాధిగ్రస్తులు అంగవైకల్యానికి గురవుతున్నట్టు వైద్యులు చెబుతున్నారు. ఈ నేపఽథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏటా ఆక్టోబరు 29వ తేదీని ప్రపంచ బ్రెయిన్‌స్ట్రోక్‌ నివారణ దినంగా జరుపుకోవాలని తీర్మానించింది. ముందస్తు జాగ్రత్తలతోనే వ్యాధిని నియంత్రించుకో వచ్చని పిలుపునిచ్చింది.


జిల్లాపై తీవ్ర ప్రభావం ..

ప్రస్తుతం జిల్లాలో బ్రెయిన్‌ స్ట్రోక్‌ వ్యాధిగ్రస్తుల సంఖ్య నానాటికీ పెరుగుతోంది. బ్రెయిన్‌స్ట్రోక్‌ వచ్చిన 4గంటలలోపు వైద్య నిపుణులను సంప్రదించి చికిత్స చేయించుకోవాల్సి ఉన్నప్పటికీ అవగాహన లోపంతో చేసే ఆలస్యం కారణంగా అనేక మంది కాళ్లు, చేతులతోపాటు ఇతర అవయవాలు చచ్చుబడి పక్షవాతానికి గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా ఈ వ్యాధిగ్రస్తుల సంఖ్య 1.15 లక్షలకుపైగా ఉన్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. ప్రస్తుతం నెల్లూరు నగరంలోని పలు కార్పొరేట్‌ ఆసుపత్రుకు పక్షవాత వ్యాధిగ్రస్తులు ఎక్కువగా వస్తున్నారు. ఈ వ్యాధిపై ప్రతి ఒక్కరు అవగాహన పెంచుకోవాలని, జీవన శైలిని మార్చుకోవాల్సిన అవసరం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కుటుంబంలో ఎవ్వరికైనా పక్షవాతం ఉన్నట్లైతే తప్పనిసరిగా కుటుంబ సభ్యులు తరచూ వైద్య పరీక్షలు చేయించుకోలని సూచిస్తున్నారు. 

Updated Date - 2021-10-29T05:13:47+05:30 IST