బ్రెయిన్‌ జిమ్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..!

ABN , First Publish Date - 2022-05-17T17:05:41+05:30 IST

మెదడుకూ, జిమ్‌కూ పొంతనెక్కడ అనుకుంటున్నారా? నిజానికి కొన్ని వ్యాయామాలతో మెదడు చురుకుదనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాలు కొన్ని

బ్రెయిన్‌ జిమ్‌ ఎక్సర్‌సైజ్‌తో ఆరోగ్య ప్రయోజనాలు..!

ఆంధ్రజ్యోతి(17-05-2022)

మెదడుకూ, జిమ్‌కూ పొంతనెక్కడ అనుకుంటున్నారా? నిజానికి కొన్ని వ్యాయామాలతో మెదడు చురుకుదనం పెరుగుతుంది. జ్ఞాపకశక్తి, ఏకాగ్రత, అభ్యాస సామర్థ్యాలు కొన్ని రకాల వ్యాయామాలతో పెరుగుతాయి కాబట్టి పిల్లల కోసం బ్రెయిన్‌ జిమ్‌ ఎక్సర్‌సైజ్‌ అనే వ్యాయామ విధానాన్ని రూపొందించడం జరిగింది. అయితే ఈ బ్రెయిన్‌ జిమ్‌ వ్యాయామాలతో పెద్దలకూ ఆరోగ్య ప్రయోజనాలు దక్కుతాయి.  


బ్రెయిన్‌ జిమ్‌ వ్యాయామం ప్రయోజనాలు

మెదడు చురుగ్గా పని చేస్తుంది

ఆత్మవిశ్వాసం పెరుగుతుంది

ఆత్మస్థైర్యం పెరుగుతుంది

ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతాయి

ఆలోచనా సామర్ధ్యంతో పాటు, నిర్ణయం తీసుకునే సామర్ధ్యం కూడా పెరుగుతుంది

స్వతఃసిద్ధంగా వ్యాధులు నయం కాగలిగేలా శరీర జీవక్రియ బలం పుంజుకుంటుంది

కంటిచూపు మెరుగు పడుతుంది

సృజనాత్మకత అలవడుతుంది

మానసిక కుంగుబాటు తగ్గుతుంది


వ్యాయామాలు ఇవే!

శరీరంతో పాటు మెదడునూ చురుగ్గా ఉంచగలిగే తేలికపాటి వ్యాయామాలు ఉన్నాయి. శరీరాన్ని తీవ్రమైన శ్రమకు లోను చేయకుండా, సున్నితమైన వ్యాయామ ఫలితం దక్కేలా చేసే ఈ వ్యాయామాలు ఎవరి సహాయం లేకుండానే చేసుకోవచ్చు.


మార్చింగ్‌ ఇన్‌ ప్లేస్‌: కండరాలన్నీ కదలడానికి తోడ్పడే ఈ వ్యాయామంతో శ్వాస, సంతులనం, హ్యాండ్‌ లెగ్‌ కొఆర్డినేషన్‌ మెరుగవుతాయి. ఈ వ్యాయామం కోసం రెండు కాళ్ల మధ్య అడుగు జాగా ఉంచి నిలబడాలి. అదే భంగిమలో జాగింగ్‌ చేస్తున్నట్టుగా నెమ్మదిగా కాళ్లను కదిలించాలి. ఇలా నెమ్మదిగా మొదలుపెట్టి, క్రమేపీ వేగం పెంచాలి. కనీసం 30 సెకండ్ల పాటు ఆపకుండా కాళ్లను కదిలించాలి. 


క్రాస్‌ క్రాల్‌:  రెండు కాళ్ల మధ్య ఒక అడుగు ఎడం ఉంచి నిలబడాలి. కుడి కాలు మడిచి పైకి లేపి, ఎడమ మోచేత్తో తాకాలి. అలాగే ఎడమ మోకాలిని పైకి లేపి, కుడి మోచేతితో తాకాలి. ఈ వ్యాయామం కూడా ఆపకుండా 30 సెకండ్ల పాటు చేయాలి.


యాంకిల్‌ టచ్‌: రెండు కాళ్ల మధ్య అడుగు దూరం ఉండేలా నిలబడాలి. ఎడమ కాలిని లేపి, పక్కకు వంచు తూ కాలి గిలకను కుడి చేత్తో తాకాలి. అలాగే కుడి కాలిని మడిచి పైకి లేపి, పక్కకు వంచుతూ యాంకిల్‌ను ఎడమ చేత్తో తాకాలి. ఇలా 15 నుంచి 20 సార్లు చేయాలి.


యాంకిల్‌ టచ్‌ బిహైండ్‌ యువర్‌ బాడీ: ఎడమ కాలును వెనకకు మడిచి, వంచి యాంకిల్‌ను కుడి చేత్తో తాకాలి. కుడి కాలును వెనక్కి మడిచి, యాంకిల్‌ను ఎడమ చేత్తో తాకాలి. ఇలా 15 నుంచి 20 సార్లు చేయాలి.


స్టెప్‌ టచ్‌: రెండు కాళ్లూ దగ్గరకు ఉంచి నిలబడాలి. తర్వాత కుడి కాలును ఒక అడుగు పక్కకు జరిపి, ఎడమ కాలును కుడి కాలు దగ్గరకు తీసుకువెళ్లాలి. తర్వాత ఎడమ కాలును తిరిగి యధాస్థానానికి తీసుకువచ్చి, కుడి కాలును కూడా ఎడమ కాలు దగ్గరకు తీసుకురావాలి. ఇలా ఎడమ వైపు కూడా చేయాలి. 


నెక్‌ సర్కిల్స్‌: నిటారుగా నిలబడాలి. తలను ముందుకు వంచి, నెమ్మదిగా కుడి వైపు నుంచి ఎడమ వైపు గుండ్రంగా తిప్పాలి. అలాగే ఎడమ వైపు నుంచి కుడి వైపుకు గుండ్రంగా తిప్పాలి. ఇలా పదిసార్లు చేయాలి.


కుక్స్‌ హుకప్‌: కుర్చీలో కూర్చుని రెండు చేతులను కలిపి పట్టుకుని ముందుకు చాపాలి. ఇలా వేళ్లు కలిపిన చేతులను లోపలి వైపుకు తిప్పి, శరీరం దగ్గరకు తీసుకు రావాలి. ఈ భంగిమలో ఆరు సార్లు బలంగా గాలి పీల్చుకుని వదలాలి. ఇలా 3 నుంచి 5 సార్లు చేయాలి.


లేజీ ఎయిట్స్‌: గోడ మీద ఎనిమిది అంకె గీసుకుని, దాని కి ఎదురుగా నిలబడాలి. శరీరాన్ని కదల్చకుండా, కేవలం కళ్లను ఆ ఎనిమిది అంకె గీత వెంబడి కదిలించాలి. ఈ వ్యాయామంతో కంటి కండరాలు బలపడతాయి. 


ట్రేస్‌ ఎక్స్‌: కుర్చీలో కళ్లు మూసుకుని కూర్చోవాలి. కనురెప్పలు మూసి ఉంచి, కనుగుడ్లను ఎక్స్‌ ఆకారంలో కదిలించాలి. తర్వాత కళ్లు తెరచి, ఎక్స్‌ ఆకారంలో కనుగుడ్లను 8 సార్లు కదిలించాలి. తర్వాత 10 సెకండ్ల పాటు కళ్లు మూసుకోవాలి.


మెదడు పనితీరులను మెరుగుపరచడానికి ఈ బ్రెయిన్‌ జిమ్‌ వ్యాయామాలు ఉపయోగపడతాయి. ఈ వ్యాయామాలను క్రమం తప్పకుండా చేయడం వల్ల ఏకాగ్రత, స్పీచ్‌, విద్య, క్రీడల్లో నైపుణ్యాలు పెరుగుతాయి. 

Updated Date - 2022-05-17T17:05:41+05:30 IST