Abn logo
Sep 15 2021 @ 00:00AM

ఎనిమిదిమందికి ప్రాణంపోశాడు

మృతుడు నలగాటి వీరబాబు

రోడ్డు ప్రమాదంలో గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన కానిస్టేబుల్‌ అవయవాల దానం 

మునిగేపల్లివాసికి గుండెను అమర్చిన వైద్యులు


కూసుమంచి: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి బ్రెయిన్‌డెడ్‌ అయిన ఓ కానిస్టేబుల్‌ తాను చనిపోతూ మరో ఎనిమిది మందికి ప్రాణం పోశాడు. ఖమ్మంజిల్లా కూసుమంచి మండల కేంద్రానికి చెందిన నలగాటి వీరబాబు(34) హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో టీఎస్‌ఎస్సీలో 8వ బెటాయియన్‌ కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నాడు. సొంతపనుల నిమిత్తం ఇటీవల స్వగ్రామానికి రాగా ఈనెల 12న తన ద్విచక్రవాహనంపై ఖమ్మం వచ్చిన ఆయనను గొల్లగూడెం వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. దాంతో అతడిని ఖమ్మంలోని మమత ఆసుపత్రికి తీసుకెళ్లగా పరిస్ధితి విషమంగా ఉండటంతో హైదరాబాద్‌లోని మలక్‌పేటలోని యశోదా ఆసుపత్రికి తరలించారు.


కాగా వైద్యుల చికిత్సకు ఏమాత్రం సహకరించకపోవడంతో మంగళవారం రాత్రి బ్రెయిన్‌డెడ్‌ అయినట్టుగా వైద్యులు ధ్రువీకరించారు. దీంతో వీరబాబు కుటుంబసభ్యులు ఆయన అవయవాలను దానం చేసేందుకు ముందుకు వచ్చారు. ఈ క్రమంలో వీరబాబు గుండెను సేకరించి... కూసుమంచి మండలం మునిగేపల్లికి చెందిన పెయింటర్‌ తుపాకుల హుస్సేన్‌కు అమర్చారు. మిగిలిన అవయవాలను కూడా సేకరించారు. అయితే రోడ్డుప్రమాదంలో నలగాటి వీరబాబు మరణించడంతో కూసుమంచిలో విషాదం అలుముకుంది. నిరుపేద కుటుంబంలో పుట్టిన వీరబాబుకు 2013లో పోలీస్‌ ఉద్యోగం వచ్చింది. ఇప్పుడిప్పుడే జీవితంలో స్ధిరపడుతున్నవీరబాబు రోడ్డుప్రమాదంలో మరణించడంతో తల్లితండ్రులు వెంకన్న, మంగమ్మ, కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదిస్తున్నారు. వీరబాబు మృతదేహాన్ని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి సందర్శించి నివాళులర్పించారు. కుటుంబ సభ్యులకు తన సానుభూతిని తెలిపారు. 


జీవన్‌దాన్‌లో నమోదుచేసుకున్న ఒక్కరోజులోనే..

కూసుమంచి మండలం మునిగేపల్లి గ్రామానికి చెందిన తుపాకుల హుస్సేన్‌ మూడేళ్లుగా గుండె సంబంధ వ్యాధితో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో వైద్యం నిమిత్తం నిమ్స్‌ ఆసుపత్రికి వెళ్లగా అక్కడ పరీక్షలు నిర్వహించిన వైద్యులు గుండె మార్పిడి తప్పదని సూచించడంతో జీవన్‌దాన్‌లో గుండె కోసం మంగళవారం దరఖాస్తు చేసుకున్నారు. అలా దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే కానిస్టేబుల్‌ వీరబాబు బ్రెయిన్‌డెడ్‌ కావడంతో అవయవదానం ఇచ్చేందుకు కుటుంబసభ్యులు అంగీకరించారు. వెంటనే నిమ్స్‌వైద్యులు యశోదకు వెళ్లి వీరబాబు గుండెను సేకరించి 11 నిమిషాల్లో పోలీసుల సాయంతో నిమ్స్‌కు తరలించి హుస్సేన్‌కు అమర్చారు. దరఖాస్తు చేసుకున్న ఒక్కరోజులోనే గుండె దొరకడం అరుదని వైద్యులు తెలిపారు. ఈ సందర్భంగా మనిషిగా మరణించి పలువురికి అవయవదానం చేసి పునర్జన్మనిచ్చి వీరబాబు చిరంజీవిగా నిలిచాడని నెటిజన్లు కొనియాడారు. మహనీయుడిగా పోలుస్తూ నివాళులర్పించారు. 

వీరబాబు మృతదేహానికి నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే కందాళ ఉపేందర్‌రెడ్డి