అంతరంగాన్ని పసిగట్టే కంప్యూటర్లు!

ABN , First Publish Date - 2020-05-30T05:30:00+05:30 IST

మీరు మనసులో అనుకుంటే కంప్యూటర్‌ స్ర్కీన్‌పై అక్షరాలు టైప్‌ అవుతూ ఉంటాయి. మౌస్‌ ముట్టుకోకపోయినా

అంతరంగాన్ని పసిగట్టే కంప్యూటర్లు!

మీరు మనసులో అనుకుంటే కంప్యూటర్‌ స్ర్కీన్‌పై అక్షరాలు టైప్‌ అవుతూ ఉంటాయి.

మౌస్‌ ముట్టుకోకపోయినా

మీ కంటి చూపుతో కావాల్సిన చోటుకు కర్సర్‌ వెళుతుంది. చేతిలో రిమోట్‌ లేకపోయినా మనసులో అనుకుంటే చాలు

టీవీ ఛానెల్స్‌ మారిపోతాయి.

‘బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌’ అనే టెక్నాలజీ సహాయంతో

ఇవన్నీ భవిష్యత్తులో సాధ్యం కానున్నాయి.

మనిషి అంతరంగంలో ఉండే ఆలోచనలను కంప్యూటర్లు అర్థం చేసుకొనే సాంకేతికత భవిష్యత్తులో అందుబాటులోకి రానుంది.

ఆ విశేషాలు ఇవి.


హాన్స్‌ బెర్గర్‌ అనే వ్యక్తి 1924లో మొట్టమొదటిసారి మనిషి బ్రెయిన్‌లో విద్యుత్‌ తరంగాలను గుర్తించాడు. అది మన అందరికీ సుపరిచితమైన ఇఇజి రూపకల్పనకు దారి తీసింది. అధునాతన పరిశోధనలకు అది మార్గం సుగమం చేసింది. పక్షవాతం వచ్చిన రోగులకి చాలా సందర్భాలలో బ్రెయిన్‌ లోని నిర్దిష్టమైన ప్రదేశాలు దెబ్బ తినడం వల్ల వివిధ శరీర భాగాలకు కదలికలను కల్పించే మోటార్‌ సందేశాలు నిలిచిపోతాయి. దాంతో కాళ్లు, చేతులు, నోరు వంటి వివిధ శరీర భాగాలు చచ్చుబడిపోతాయి. ఇలాంటి సందర్భాలలో ఇప్పటివరకు ‘న్యూరోప్రాస్టెటిక్స్‌’ అనే విధానం ద్వారా మెదడులో కొన్ని ప్రత్యేకమైన ఇంప్లాంట్లను పెట్టడం ద్వారా దృష్టి, వినికిడి, కదలికలను పునరుద్ధరించడం వంటి అనేక రకాల అంశాలు సాధ్యపడ్డాయి. అయితే దానికి భిన్నంగా మెదడు లోపల ఎలాంటి అమరిక చేయాల్సిన పనిలేకుండా, కోత లేకుండానే ప్రత్యేకంగా రూపొందించబడిన రిసీవర్లని మెదడు సందేశాలను సంగ్రహించే విధంగా ఏర్పాటు చేయడం ఇటీవల ఊపందుకుంది.


ఆలోచనలకు తగ్గట్లు!

గత ఏడాది కార్నెగీ మెల్లన్‌ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫే్‌సలో భాగంగా ఒక కొత్త మైలురాయికి చేరుకున్నారు. కేవలం మెదడు ఉపరితలం మీద అమర్చగలిగే ఒక ప్రత్యేకమైన పరికరం ద్వారా.. కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీద మౌస్‌ కర్సర్‌ని దానంతట అదే కదిలే విధంగా చేయగలిగారు. అంటే చేయి చచ్చుబడిన వ్యక్తి, తన చేయి కదిలించకపోయినా తన ఎదురుగా ఉన్న స్ర్కీన్‌ మీద ఎక్కడికి వెళ్ళాలి అని మనసులో అనుకుంటే.. దాన్ని మెదడు తరంగాలు అర్థం చేసుకుని, అవి డీకోడ్‌ అయి సంబంధిత ఫలితాన్ని ఓ రోబోటిక్‌ చేయి ద్వారా కంప్యూటర్‌ మీద అందించడం జరిగింది. ఈ పద్ధతిలో మౌస్‌ పాయింటర్లని కదిలించటం మాత్రమే కాదు, పక్షవాతం వచ్చిన వ్యక్తి టీవీ చూసేటప్పుడు ఎవరి సహాయం లేకుండా తనకు కావాల్సిన ఛానల్స్‌ ఒకదాని తర్వాత మరొకటి మార్చుకోవచ్చు, అలాగే యూట్యూబ్‌ వంటి వాటిలో నచ్చిన వీడియోలను ఎంపిక చేసుకోవచ్చు.


కృత్రిమ మేధ ద్వారా...

కోత లేకుండా, బ్రెయిన్‌ లోపల ఎలాంటి ఇంప్లాంట్స్‌ పెట్టాల్సిన పనిలేకుండా ఇటీవల వచ్చిన పద్ధతులు 50 నుంచి 60 శాతం మాత్రమే కచ్చితత్వాన్ని అందిస్తున్నాయి. ఇవి మరింత మెరుగుపడవలసిన అవసరం ఉంది. దీనికోసం పరిశోధకులు ఇటీవలి కాలంలో బాగా చర్చనీయాంశంగా మారిన ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ సహాయం కూడా తీసుకుంటున్నారు. బ్రెయిన్‌లో భద్రపరచబడే సమాచారం, అనుభవాలూ, వాటి ద్వారా ఉత్పత్తి అయ్యే ఆలోచనలు చాలా సందర్భాలలో ఒకే రకమైన ప్యాటర్న్‌ కలిగి ఉంటున్నాయి. దీన్ని ఆధారంగా చేసుకుని  బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫే్‌సకి, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్‌ను కూడా జతచేసి మరింత నిక్కచ్చిగా ఫలితాలు పొందే విధంగా ఇప్పటికే ప్రయత్నాలు జరుగుతున్నాయి.


ఎలాంటివి సాధ్యపడతాయి?

ప్రస్తుతం బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్‌ఫేస్‌ కేవలం పక్షవాతం, ప్రమాదాల్లో మెదడు దెబ్బతిన్న వారికి రోజు వారీ పనులు పూర్తి చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించటం మీదే ప్రధానంగా దృష్టి పెట్టింది. అయితే ఇది మరింత విస్తరించిన తర్వాత అనేక అంశాలు సాధ్యం కాబోతున్నాయి. ముఖ్యంగా మీరు మనసులో అనుకున్నది టైప్‌ చెయ్యడం, మాట్లాడాల్సిన పని లేకుండా కంప్యూటర్‌ స్ర్కీన్‌ మీద అక్షరరూపం దాల్చుతుంది. ఎలాంటి ట్రాకింగ్‌ డివైజ్‌లు వాడాల్సిన పనిలేకుండా మీ చూపుతోనే మీ ఫోన్‌, కంప్యూటర్‌లో అప్లికేషన్స్‌ ఓపెన్‌ కావటం, క్లోజ్‌ కావడం జరుగుతుంది. ఇప్పటివరకు ఇలాంటి వాటి కోసం ఫోన్‌, కంప్యూటర్‌లో కెమెరా వాడుతూ కనుగుడ్డు కదలికలను బట్టి మనకు కావలసిన ఫలితాలను అందించే విధంగా ఏర్పాటు చేశారు. బ్రెయిన్‌ కంప్యూటర్‌ ఇంటర్ఫేస్‌ మరింత అభివృద్ధి చెందితే ఇలాంటివేమీ అవసరం లేదు.


బ్రెయిన్‌లోని డేటా సంగతి?

ఈ ప్రపంచంలో గొప్ప గొప్ప శాస్త్రవేత్తలు, మేధావులు వయసు పైబడిన తరువాత ఈ ప్రపంచం నుంచి నిష్క్రమిస్తున్నారు. వారి ఆలోచనలను గనుక సంగ్రహించగలిగితే అవి తర్వాతి తరాలకు ఒక నాలెడ్జ్‌ బ్యాంకుగా నిలుస్తాయి. దీని గురించి చాలాకాలంగా పరిశోధనలు జరుగుతున్నాయి. ఒక అంచనా ప్రకారం మనిషి బ్రెయిన్‌ 2500 టెరాబైట్ల (2..5 పెటాబైట్ల) స్టోరేజ్‌ సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆ డేటా మొత్తాన్ని వెలికితీయడం, దాన్ని సురక్షితంగా భద్రపరచడం ఇప్పటికిప్పుడు కష్టమే అయినప్పటికీ మరో యాభై సంవత్సరాలలో ఇది ఆచరణ రూపం దాల్చుతుందని అంచనా. శాస్త్ర సాంకేతిక రంగాలు ఇప్పుడు వైద్య శాస్త్రంతో కలిసి పని చేయడం వల్ల విప్లవాత్మకమైన మార్పులు రాబోతున్నాయి.


నల్లమోతు శ్రీధర్‌

fb.com/nallamothusridhar

Updated Date - 2020-05-30T05:30:00+05:30 IST