బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ABN , First Publish Date - 2022-10-07T07:13:52+05:30 IST

బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం రాత్రి వైభవంగా జరగడంతో శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.

బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

దేవతలను సాగనంపిన గరుడాళ్వార్‌

తిరుమల, అక్టోబరు 6 (ఆంధ్రజ్యోతి):బ్రహ్మోత్సవాల చివరి ఘట్టమైన ధ్వజావరోహణం బుధవారం రాత్రి వైభవంగా జరగడంతో శ్రీవారి సాలకట్ల  బ్రహ్మోత్సవాలు పరిసమాప్తమయ్యాయి.ధ్వజారోహణం సందర్భంగా ఆహ్వానించిన దేవతలను గరుడాళ్వార్‌ కృతజ్ఞతలతో తిరిగి పంపే ఈ కార్యక్రమంలో భాగంగా బుధవారం సాయంత్రం ఆలయంలో స్వామివారి ఉత్సవర్లకు విశేష సమర్పణ కావించారు. అనంతరం స్వామివారిని ఉభయ దేవేరుల సమేతంగా బంగారు తిరుచ్చిలో సాయంత్రం 7 గంటలకు తిరువీధుల్లో ఊరేగించారు.తిరిగి ఆలయం చేరుకున్న ఉత్సవర్లు ధ్వజస్తంభం వద్దకు వేంచేశారు. 9 గంటలకు అర్చకస్వాములు పూజాదికార్యక్రమాలు నిర్వహించి ధ్వజస్తంభంపై ఉన్న గరుడ పటాన్ని శాస్త్రోక్తంగా కిందకు దించారు. గరుడధ్యానం, భేరిపూజ, భేరితాడనం, గరుడగ ధ్యం,దిక్పాలక గద్యం, గరుడ లగ్నాష్టకం, గరుడ చూర్ణిక మంత్రాలను అర్చకులు జపించిన అర్చకస్వాములు బ్రహ్మోత్సవాలు ముగిసినట్టు వేదపారాయణం ద్వారా ప్రకటించారు. అనంతరం ధ్వజపడి నివేదన కావించి, ఆలయంలోని బంగారువాకిలిలో ఉత్సవర్లకు ఆస్థానం నిర్వహించారు.బుధవారం ఉదయం బ్రహ్మోత్సవాల ప్రధాన ఘట్టాల్లో ఒకటైన చక్రస్నానం కనులవండువగా జరిగింది. ఉదయం 3 నుంచి 6 గంటల మధ్యలో ఆలయం నుంచి ఉత్సవర్లు తిరుచ్చిలో, చక్రత్తాళ్వార్‌ పల్లకీలో తిరుమాడ వీధుల్లో ఊరేగింపుగా వరాహస్వామి ఆలయానికి చేరుకున్నారు.9 గంటల దాకా  స్నపన తిరుమంజనం, ఇత్యాది కైంకర్యాలు శాస్త్రోక్తంగా నిర్వహించాక చక్రత్తాళ్వార్‌ను అర్చకస్వాములు పుష్కరిణిలో మూడుమునకలు వేయించారు.పుష్కరిణిలో అప్పటికే వేచివున్న వేలాదిమంది భక్తులు గోవింద నామస్మరణలతో స్నానమాచరించారు.అంతకు ముందు గేటువద్ద భక్తు లు స్వల్పవత్తిడికి గురయ్యారు.సుప్రీం కోర్టు మాజీ సీజే జస్టిస్‌ ఎన్వీరమణ దంపతులు, జార్ఘండ్‌ హైకోర్టు సీజే రవిరంజన్‌, ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ప్రవీణ్‌కుమార్‌, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి దంపతులు,టీటీడీ చైర్మన్‌ సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, బోర్డు సభ్యులు, అధికారులు పాల్గొన్నారు. 

రెండేళ్ళ తర్వాత భక్తుల నడుమ...

కరోనా కారణంగా రెండేళ్లపాటు ఆలయానికే పరిమితమైన  శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు ఈసారి  మాడవీధుల్లో భక్తులమధ్య వైభవంగా జరిగాయి.అయితే భక్తులు భారీగా వస్తారని టీటీడీ అంచనా వేసినప్పటికీ గరుడసేవ, కల్పవృక్ష,  సూర్యప్రభ, చంద్రప్రభ వాహన సేవల్లో మినహా గ్యాలరీల్లో భక్తులు పలుచగానే కనిపించారు.సర్వదర్శనాన్ని అమలుచేస్తూ ప్రత్యేక దర్శనాలన్నీ రద్దు చేయడమే దీనికి కారణమనే అభిప్రాయాలు వ్యక్తమయినప్పటికీ వాహనసేవలకు హాజరైన, మూలమూర్తిని దర్శించుకున్న భక్తులందరూ సామాన్యులేననే సంతృప్తిలో ఉంది టీటీడీ. మాడవీధుల్లోని హారతి పాయింట్ల వద్ద ఈ ఏడాది ప్రవేశపెట్టిన వాహనసేవ దర్శనం విజయవంతమైంది. గరుడ వాహన సేవలో ఈ పద్ధతి ద్వారా దాదాపు 15 నుంచి 20 వేల మందికి వాహన దర్శనం కల్పించారు. గరుడోత్సవం వీక్షించేందుకు వచ్చిన వీఐపీల వాహనాలను ఈ ఏడాది రాంభగీచా సర్కిల్‌ వరకే అనుమతించడంతో రాంభగీచా 1, 2, 3 వద్ద వాహనాల హడావుడి, రద్దీ లేకుండా ప్రశాంతంగా కనిపించింది.గరుడసేవ రోజు ఉదయం 11 గంటలకే గ్యాలరీలు నిండిపోవడంతో మాడవీధుల గేట్లన్నీ మూసివేశారు. దీంతో సాయంత్రం 5 గంటల సమయంలో లేపాక్షి సర్కిల్‌ వద్ద తోపులాట జరిగింది.భద్రతాసిబ్బంది అప్రమత్తమై భక్తులను అక్కడి నుంచి ఒక్కొక్కర్నీ పంపడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది.ఎస్వీ మ్యూజియం, నందకం వద్ద కూడా చిన్నపాటి తోపులాటలు జరిగాయి.పోలీసులు, టీటీడీ ఉద్యోగులు, ప్రెస్‌ పాసులపై కుటుంబ సభ్యులను అనుమతించే క్రమంలో సప్తగిరి విశ్రాంతి భవనం వద్ద తోపులాట జరిగి ఓ మహిళ కిందపడి  స్వల్పంగా గాయపడింది. అలాగే ఆ ప్రాంతంలోనే  పాసులు కలిగిన వారిని లోపలికి అనుమతించే క్రమంలో ఇద్దరు పోలీసులు ఒకరినొకరు నెట్టుకోవడం విమర్శలకు దారితీసింది.అన్నప్రసాద భవనం నుంచి గరుడవాహనసేవ దర్శనానికి భక్తులను అనుమతించే క్రమంలో రద్దీ అధికమై క్యూలైన్‌ పక్కకు ఒరిగిపోయి ఓ యువతి కాలికి గాయమైంది.గరుడవాహనసేవ సందర్భం గా మధ్యాహ్నం ఒంటిగంటకే తిరుమలకు వచ్చే ప్రైవేటు వాహనాలను అలిపిరి వద్దే గంటలకొద్దీ నిలిపివేయడం పట్ల భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు.తిరుమలలో ఏ చిన్నపాటి ఉత్సవం జరిగినా డాలర్‌ శేషాద్రి హడావుడి కనిపించేది.అయితే గత నవంబరు నెలలో ఆయన మృతి చెందిన విషయం తెలిసిందే.ఈసారి ఉత్సవాల సమయంలో చాలామంది ఉన్నతాధికారులు, ఉద్యోగులు, అర్చకులు, భక్తులు డాలర్‌ శేషాద్రిని గుర్తుచేసుకోవడం కన్పించింది. 

సహకరించిన అందరికీ కృతజ్ఞతలు : టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి

టీటీడీలోని అన్ని విభాగాల అధికారులు, సిబ్బంది, జిల్లా యంత్రాంగం, పోలీసులు, శ్రీవారి సేవకుల కృషి, భక్తుల సహకారంతో శ్రీవారి బ్రహ్మోత్సవాలు విజయవంతమయ్యాయని టీటీడీ చైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. తిరుమలలో ఆయన బుధవారం ఈవో ధర్మారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.5.69 లక్షల మంది సామాన్య భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారన్నారు.గరుడసేవరోజు 81,318 మందికి దర్శనం లభించగా వాహనసేవలో 3 లక్షల మందికిపైగా పాల్గొన్నారన్నారు.హుండీ ఆదాయం రూ.20.43 కోట్లు లభించిందన్నారు.2.20 లక్షలమంది తలనీలాలు సమర్పించగా, 20.99 లక్షల భోజనాలు, ఆల్పాహారం అందించామన్నారు.తిరుపతి నుంచి తిరుమలకు 12,638 ట్రిప్లుల్లో 3.47 లక్షలమంది భక్తులను ఆర్టీసీ చేరవేసిందని, తిరుమల నుంచి తిరుపతికి 12,835 ట్రిప్పుల్లో 4.47 లక్షలమందిని చేరవేసిందన్నారు.వాహనసేవలను వీక్షించేందుకు తగినన్ని ఎల్‌ఈడీ స్ర్కీన్లను ఏర్పాటు చేయాలేకపోయామని,గరుడవాహనసేవరోజు లేపాక్షి సర్కిల్‌ వద్ద స్వల్పతోపులాట జరిగిందన్నారు. అలిపిరిలో కొంతసమయం వాహనాలు నిలిపివేయడంతో భక్తులు ఇబ్బంది పడ్డారన్నారు. భవిష్యత్తులో ఈ సమస్యలు ఏవీ లేకుండా తగిన ఏర్పాట్లు చేస్తామన్నారు. ఈ సమావేశంలో టీటీడీ బోర్డు సభ్యుడు మధుసూదన్‌ యాదవ్‌, ఢిల్లీ ఎల్‌ఏసీ చైర్మన్‌ ప్రశాంతిరెడ్డి, చెన్నై ఎల్‌ఏసీ చైర్మన్‌ శేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-10-07T07:13:52+05:30 IST