రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

ABN , First Publish Date - 2022-10-05T02:20:38+05:30 IST

తిరుమల బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం వేంకటేశ్వరస్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు.

రేపటితో బ్రహ్మోత్సవాలు పరిసమాప్తం

తిరుమల: తిరుమల బ్రహ్మోత్సవాల్లో మంగళవారం ఉదయం వేంకటేశ్వరస్వామి మహారథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఆలయంలో శాస్త్రోక్తంగా కైంకర్యాలు అందుకున్న ఉత్సవర్లు ఉదయం 5.10 - 5.40 గంటల మధ్య కన్యా లగ్నంలో మహారథంలోకి వేంచేపు చేశారు. అనంతరం ఉదయం 7గంటలకు స్వామివార్ల రథోత్సవం ప్రారంభమైంది. శ్రీదేవి, భూదేవి సమేతంగా మలయప్పస్వామి వజ్రాలతో కూడిన కిరీటం, శంఖు, చక్రాలు, తిరువాభరణాలు ధరించి ఊరేగుతూ భక్తుల మనోరథాన్ని నెరవేర్చారు. భక్తులు సైతం స్వామివారికి అడుగడుగునా నీరాజనాలు సమర్పించారు. భక్తి సంకీర్తనలు, పలురకాల కళాబృందాలు ప్రదర్శనలు కోలాహలంగా జరిగాయి. రథం కదులుతున్న సమయంలో భక్తుల గోవిందనామ స్మరణలతో తిరుమల గిరులు పులకరించాయి. ఎలలాంటి ఆటంకాలు లేకుండా రెండుగంటల్లో మహారథోత్సవం ముగిసింది. మంగళవారం రాత్రి బ్రహ్మోత్సవాల్లో చివరి వాహనమైన అశ్వవాహన సేవ  వేడుకగా జరిగింది. శ్రీవారు కల్కి అవతారంలో నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు అభయమిచ్చారు. ఏపీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌, మంత్రి వేణుగోపాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. బుధవారం ఉదయం శ్రీవారి ఆలయం పక్కనే ఉన్న పుష్కరిణిలో చక్రస్నాన వేడుక జరగనుంది. బ్రహ్మోత్సవాల్లో ప్రాధాన్యత కలిగిన ఈ ఘట్టం ప్రశాంతంగా పూర్తయ్యేలా అధికారులు ఏర్పాట్లు చేశారు.బుధవారం రాత్రి ధ్వజావరోహణంతో తిరుమల శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు పూర్తవుతాయి. 

Updated Date - 2022-10-05T02:20:38+05:30 IST