పేదలపై బ్రహ్మాస్త్రం కొత్త రెవెన్యూ బిల్లు

ABN , First Publish Date - 2020-09-12T06:05:16+05:30 IST

తెలంగాణ భూమి హక్కులు, పాసుపుస్తకాల బిల్లు -2020ను ముఖ్యమంత్రి తన స్వంత మేథోమధనంతో రూపొందించి శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఉద్దేశాలను సభకు...

పేదలపై బ్రహ్మాస్త్రం కొత్త రెవెన్యూ బిల్లు

మొదటితరం భూ సంస్కరణల్లో వాస్తవ సాగుదారుకు, పన్నులు వసూలు చేసే ప్రభుత్వానికి మధ్య ఉన్న వివిధ రూపాలలోని  భూ యజమానులను తొలగించే పని చేపడితే, ఇప్పుడు నయాతరం భూ సంస్కరణల్లో ప్రభుత్వం భూ యజమానులకు, ప్రభుత్వానికి/కొనుగోలుదారులకు మధ్య ఉన్న సాగుదార్లను తొలగించే పనిని చేపట్టింది. తద్వారా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని శాశ్వతంగా బొందపెట్టింది.


తెలంగాణ భూమి హక్కులు, పాసుపుస్తకాల బిల్లు -2020ను ముఖ్యమంత్రి తన స్వంత మేథోమధనంతో రూపొందించి శాసనసభలో స్వయంగా ప్రవేశపెట్టారు. ఆ బిల్లు ఉద్దేశాలను సభకు వివరించడంతో పాటు తెలంగాణ రాష్ట్రసాధనతో పోలిక పెట్టి ప్రజలను సంబురాలను చేసుకోమని పిలుపునిచ్చారు. ఆ పిలుపుతో క్షీరాభిషేకాలు, టపాసులతో తెరాస శ్రేణులు సంబురాలు చేసుకోవడం చూస్తే ‘చెప్పేటోడికి వినేటోడు లోకువ’ అనే పెద్దల మాట అక్షరసత్యమనిపిస్తుంది. తెలంగాణ సమాజం మేథో అవగాహన స్థాయిని, ప్రస్తుత ప్రభుత్వం ఇంత తక్కువ కాలంలో ఇంత హీనస్థితికి దిగజార్చిందా అని ఆశ్చర్యం కలుగుతుంది. ఈ రాష్ట్రంలో ఏం చేసినా ‘న భూతో న భవిష్యతి’ అని, ఏమి జరిగినా మన ప్రియతమ ముఖ్యమంత్రిగారి మదిలో మాత్రమే మొలిచిన ఆలోచన అని, ఆయన చెప్పిందే సత్యం అనే భావదారిద్య్రం నుంచి బయటపడితేనే ఈ చట్టం నేపథ్యాన్ని, దాని ప్రభావాన్ని సరిగ్గా అర్థం చేసుకోగలం. ప్రస్తుత బిల్లులోని ప్రక్రియల మూలం అంతా ప్రపంచ బ్యాంకు 2007లో భారతదేశంలో భూమి సమస్యల పరిష్కారంపై ఇచ్చిన నివేదికలో ఉంది. భూములను మార్కెట్‌ సరుకు చేయాలని ఆ నివేదిక సూచించింది. తదనుగుణంగానే అభివృద్ధి చెందుతున్న దేశాలు, వాటిలోని రాష్ట్రాలు ఆ బాటనే పట్టాయి. తెలంగాణ సాధనలో పడి మనం కొంత వెనుకపడ్డాం అంతే.


కొండను తవ్వి ఎలుకను పట్టినట్లు, మొత్తం రెవెన్యూ చట్టాలన్నీ క్రోడీకరించి సమగ్ర రెవెన్యూ కోడ్‌ తెస్తామని చెప్పి చివరకు వ్యవసాయ భూములకు పట్టా పాసుపుస్తకాలు ఇచ్చే చట్టం ఒక్కటి తెచ్చారు. ఇప్పటికే అమలులో ఉన్న చట్టంతో పోలిస్తే ముఖ్యమైన మార్పులు ఏమిటంటే- రిజిస్ట్రేషన్‌, పట్టా జారీ అధికారాలను ఒకే అధికారి (తహశీల్దారు) చేతిలో పెట్టడం; రెవెన్యూ కోర్టుల స్థానంలో ట్రైబ్యునళ్లను పెట్టడం; భూమి రికార్డులను ఎలక్ట్రానిక్‌ రూపంలో నమోదు చేయడానికి, భద్రపరచడానికి, మార్పులు చేయడానికి, జారీ చేయడానికి చట్టబద్ధత కల్పించడం; టైటిల్‌ డీడ్‌ పట్టా పాసుపుస్తకం జారీ ప్రక్రియ సమయాన్ని తగ్గించడం. మొత్తంగా ఈ మార్పుల ద్వారా భూములు చేతులు మారడం సులభంగా, వేగంగా జరుగుతుంది. అంటే ‘ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌’ సూచిలో మరిన్ని మార్కులు మన రాష్ట్రానికి పడతాయి. అయితే ఈ ప్రక్రియలో పేదల కష్టాలన్నీ తీరిపోతాయి, రెవెన్యూ వ్యవస్థలో అవినీతి మటుమాయం అయిపోతుందనే మాటలు పూర్తిగా అబద్ధం, అసంబద్ధం, మోసపూరితం, హాస్యాస్పదం. ప్రభుత్వ పరిపాలన ప్రక్రియలు, వాటి చరిత్ర పట్ల కనీస అవగాహన ఉన్న వారెవ్వరూ ఇటువంటి వ్యాఖ్యలు చేయరు, ఇటువంటి అద్భుతాలు ఆశించరు. దీనికి పెద్ద సాక్ష్యాలు అవసరం లేదు. రెవెన్యూ రికార్డుల ప్రక్షాళన సమయంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకుంటే సరిపోతుంది. రికార్డుల ప్రక్షాళన జరిగిన తరువాతే ఇంకా అవినీతి పెరగడంతో పాటు, సాధారణ రైతులు/భూ యజమానులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్న విషయాలు పత్రికాముఖంగా కనబడుతూనే ఉన్నాయి.


పాసుపుస్తకాల జారీ అధికారంతోనే తహశీల్దార్లు అవినీతికి పాల్పడుతున్నారని ఒక పక్క చెబుతూ, ఇప్పుడు రిజిస్ట్రేషన్‌ అధికారం కూడా వారికే కట్టబెట్టి, అవినీతికి ఆస్కారం లేకుండా చేశామనడం విడ్డూరం. ఈ ఏర్పాటుతో రెవెన్యూశాఖలో అవినీతి మరిన్ని రెట్లు పెరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు. భూ లావాదేవీలు, రికార్డులు, కంప్యూటరీకరణ ద్వారా భూమి సమస్యలు విపరీతంగా పెరగడంతో పాటు తీవ్రస్థాయిలో అవినీతికి ఆస్కారముంటుందనడానికి పక్కా ఉదాహరణ పక్కనున్న ఆంధ్రరాష్ట్రమే. అక్కడ 2016లో దాదాపు ఇటువంటి ఏర్పాట్లతోనే చట్టంలో సవరణలు చేసి ఆచరణలో పెట్టిన రెండేళ్లలోనే పేదల భూములు, రికార్డులలో సమస్యాత్మక లోపాలున్న భూములకు సంబంధించి పెద్దపెద్ద కుంభకోణాలు జరిగాయి. పెద్దఎత్తున భూమాఫియా తయారయింది. అదే ఇక్కడ పునరావృత్తమవుతుందనడంలో సందేహం లేదు. ఎందుకంటే పేదలకు ఎలక్ట్రానిక్‌ పద్ధతులపై అవగాహన ఉండదు. వాళ్లు రోజువారీగా తమ భూమి ఉందో లేదో కంప్యూటర్లలో, స్మార్ట్‌ఫోన్లలో తనిఖీ చేసుకోరు. కేవలం భూమి సాగు చేసుకుంటూ ఉంటారు. కాని వాళ్ల భూమికి కంప్యూటర్లలోనే రెక్కలు వచ్చి ఎగిరిపోతుంది. ఆ విషయం వాళ్లకు తెలిసేసరికి వేరేవారి పేరు మీద పట్టాలు, సివిల్‌ కోర్టులో ఇంజంక్షన్‌ ఆర్డర్లు రెడీగా ఉంటాయి. ఇంక వాటిని అధిగమించి తమ భూమిని కాపాడుకోవడం వాళ్లకు ఒక జీవన్మరణ పోరాటమే అవుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మీద సగటు రైతుకు వ్యతిరేకత కలగడానికి ఇది కూడా ఒక కారణమే. అనేక అసమానతలున్న మన సమాజంలో ప్రభుత్వ పాలనా వ్యవహారాలపై అవగాహన, అధికారుల నుంచి సాధికారికంగా, ఒక హక్కుగా సేవలు పొందడం అనేది ఇంకా ప్రాథమికస్థాయిలోనే ఉందని అర్థం చేసుకోవడం ముఖ్యం.


భూ లావాదేవీల సరళీకరణ, కంప్యూటరీకరణ పక్కన పెడితే కొత్త చట్టం ద్వారా ప్రభుత్వం ఒక విప్లవాత్మకమైన మార్పు మాత్రం తీసుకువస్తుంది. అయితే ఆ విషయాన్ని ముఖ్యమంత్రి ఎక్కడా బయటపెట్టలేదు. ఆ మార్పు కారణంగా తెలంగాణ చరిత్ర, అస్తిత్వంలోని ఒక ముఖ్యమైన పార్శ్వం కనుమరుగవుతుంది. అదే, భూమి వాస్తవ సాగుదారు లేదా కౌలుదారు అనే వాళ్లను రికార్డుల నుంచి తొలగించడం; తద్వారా అతి సమీప భవిష్యత్తులో వాళ్లను భూమి నుంచి కూడా తొలగించడం. 1971 చట్టంలో భూమి యజమాని కాని సాగుదారును కూడా గుర్తించి వారికి పట్టా పాసుపుస్తకాలు మాత్రం ఇచ్చే వెసులుబాటు ఉంది. భూమి యజమానికి టైటిల్‌ డీడ్‌, వారు సాగు చేస్తున్న విస్తీర్ణానికి పాసుపుస్తకం ఇచ్చేవారు. ఇప్పుడు ఆ రెండిటినీ కలిపివేసి కేవలం ‘టైటిల్‌ డీడ్‌ కమ్‌ పాసుపుస్తకం’గా మార్పు చేశారు. దాంతో వాస్తవ సాగుదారు/కౌలుదారుకు ఎటువంటి పుస్తకమూ, ఆధారమూ ఉండదు. ఇక నుంచి భూమికి ఒకరే హక్కుదారు. అనగా సొంతదారు, అమ్మకం హక్కు కలిగినవారు. అంటే ఇక నుంచి వ్యవసాయ భూమి కేవలం ఒక ఆస్తి మాత్రమే. అది జీవనాధార వనరు కాదు అని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది. అందుకే ఈ ఆస్తి బదిలీ ప్రక్రియలపైనే ఎక్కువ దృష్టి పెట్టింది. కానీ నిజమైన సాగుదారు బతుకు ప్రయోజనాలకు, వారి సాగుకు ఆసరా కల్పించడానికి సంబంధించి ఎటువంటి ఏర్పాటూ చేయలేదు. వారికి రైతుబంధు, బీమా, బ్యాంకు రుణం, పంట నష్టపరిహారం వంటివి ఏమీ అందవు. ప్రభుత్వ ప్రస్తుత విధానాలతో మొదటి దశలో సాగుదార్లు భూమి నుంచి తొలగించబడతారు. తరువాత భూమి లావాదేవీల సులభతరంతో చిన్న, సన్నకారు రైతులు తమ భూములను తెగనమ్ముకుంటారు. నిజంగా ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వ్యవసాయం చేయనివారు, గ్రామంలో నివాసం ఉండని వారు చేసే వ్యవసాయ భూముల కొనుగోలుపై నియంత్రణలు పెట్టేది. కాని రాజ కుటుంబమే 100 ఎకరాల పైబడిన రైతు కుటుంబం అయినప్పుడు అటువంటివి ఆశించడం అత్యాశే. అందునా గత ఆరు సంవత్సరాలలో ప్రభుత్వ చర్యలన్నీ ‘ఆస్తి’ కలిగిన వారి ప్రయోజనాలు కాపాడటం, వారి సంపద విలువ పెంచడం దిశగానే సాగుతున్నాయి. పెరుగుతున్న సంపద ఎక్కువ మంది, ముఖ్యంగా బడుగులకు అందడంపై దృష్టి పెట్టకపోవడం ఆ భావనకు బలం చేకూరుస్తోంది.


మొదటితరం భూ సంస్కరణల్లో వాస్తవ సాగుదారుకు, పన్నులు వసూలు చేసే ప్రభుత్వానికి మధ్య ఉన్న వివిధ రూపాలలోని జమీందారులను (అనగా భూ యజమానులను) తొలగించే పని చేపడితే, ఇప్పుడు నయాతరం భూ సంస్కరణల్లో ప్రభుత్వం భూ యజమానులకు, ప్రభుత్వానికి/కొనుగోలుదారులకు మధ్య ఉన్న సాగుదార్లను తొలగించే పనిని చేపట్టింది. తద్వారా తెలంగాణ సాయుధ పోరాట స్ఫూర్తిని శాశ్వతంగా బొందపెట్టింది. తెలంగాణ అస్తిత్వాన్ని, ఆత్మను కాపాడుకునే పేరిట ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి నేతృత్వం వహించిన ఉద్యమ పార్టీ ఆధ్వర్యంలోని ప్రభుత్వమే ఈ పనికి పాల్పడటం అతి పెద్ద విషాదం. తెలంగాణ సమాజం తన లక్షలాది శ్రమజీవుల కుటుంబాలకు సాగు యోగ్యమైన వ్యవసాయ భూమి అందుబాటులోకి వచ్చే విధమైన మార్పును సాధించుకుని తన అస్తిత్వాన్ని నిలబెట్టుకుంటుందా? లేక భూమిని కొంతమంది పెత్తందారులు/పెట్టుబడుదారులకే పరిమితం చేస్తున్న ప్రస్తుత ప్రభుత్వం చేతుల్లోనే పూర్తిగా తన భవితవ్యాన్ని పెట్టి ‘బాంచన్‌ దొర’ అంటుందా చూడాలి.

రవికుమార్‌, న్యాయవాది

Updated Date - 2020-09-12T06:05:16+05:30 IST