‘పౌర’ పోరులో బ్రహ్మపుత్ర బడబాగ్ని

ABN , First Publish Date - 2020-03-10T06:46:36+05:30 IST

పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా అసోంలో ప్రారంభమైన ఆందోళన దేశవ్యాప్తంగా ఊపందుకుని మరింత ఉధృతమవుతోన్నది. ఎన్నడూ లేని విధంగా ఎల్లెడలా ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్ని...

‘పౌర’ పోరులో బ్రహ్మపుత్ర బడబాగ్ని

1985 అసోం ఒప్పందం నేపథ్యంలో వచ్చిన జాతీయ జనాభా పట్టిక, జాతీయ పౌరసత్వ జాబితా నిర్ణయాలు కేంద్రంలోని బిజెపి రాజకీయ అవసరాలకు అనుగుణంగా వున్నవే. పౌరసత్వ చట్టాలపై ఈశాన్య భారత రాష్ట్రాల్లో ఉధృతమవుతున్న వ్యతిరేకత భారత రాజ్యాంగానికి కొత్త సవాళ్ళను సృష్టిస్తోంది. ఈ సమస్యను రాజకీయ లబ్ధి దృష్టితో చూడకుండా రాజ్యాంగ నైతికతతో విశ్లేషించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.


పౌరసత్వ సవరణ చట్టాలకు వ్యతిరేకంగా అసోంలో ప్రారంభమైన ఆందోళన దేశవ్యాప్తంగా ఊపందుకుని మరింత ఉధృతమవుతోన్నది. ఎన్నడూ లేని విధంగా ఎల్లెడలా ఈ ఉద్యమం ఎప్పటికప్పుడు కొత్త రూపాన్నిసంతరించుకుంటున్నది. ఒక సామాజిక ఉద్యమంలా దేశాన్ని కుదిపివేస్తోంది. ఈ ఉద్యమంలో ముస్లిం మహిళలు పెద్ద ఎత్తున పాల్గొనడమే కాకుండా ముందుండి ఉద్యమాన్ని నడుపుతున్నారు. ‘జాతీయ పౌర పట్టిక’ (ఎన్‌ఆర్‌సి) ప్రక్రియను మొదటి సారిగా అమలు చేసిన అసోంలో 19 లక్షల మందికి ఆ జాబితాలో స్థానం దక్కలేదు! దీన్ని బట్టి ఎన్‌ఆర్‌సి అనేది ఎంత లోపభూయిష్టమైనదో అర్థమవుతున్నది. ఎన్‌ఆర్‌సిపై అసంతృప్తి, పౌర సవరణ చట్టం(సిఏఏ)పై వ్యతిరేకత వున్న అసోం ప్రజలు 2019లో జరిగిన ఎన్నికల్లో తిరిగి బిజెపికి ఎందుకు పట్టం కట్టారు? 


ఈశాన్య భారతంలోని ఏడు రాష్ట్రాల్లో అసోం ఒకటి. మిగతావి మేఘాలయ, అరుణాచల్‌ ప్రదేశ్‌, నాగాలాండ్‌, మణిపూర్‌, మిజోరం, త్రిపుర. ఈ ప్రాంతం బంగ్లాదేశ్‌, టిబెట్‌, మయన్మార్‌, భూటాన్‌ దేశాల మధ్యలో వున్నది. సిలిగురి (బెంగాల్‌)- అసోం సరిహద్దులో వున్న చికెన్‌ నెక్‌ కారిడార్‌ ద్వారా ఈశాన్య రాష్ట్రాలు విశాల భారతదేశంతో అనుసంధానమవుతున్నాయి. ఈశాన్య భారతంలో చమురు నిక్షేపాలు, తేయాకు తోటలు, అడవులు సమృద్ధిగా వున్నాయి. అభివృద్ధి జరగడంతో పాటు అసమానతలూ పెరిగాయి. 1952లో ప్రారంభమయిన నాగా ఉద్యమం క్రమంగా ఉధృతమై భారత రాజ్యాన్ని ఎదిరించింది. భారత్ నుంచి విడిపోయే లక్ష్యంతో అసోంలో ఆరంభమైన ఉల్ఫా ఉద్యమం సాయుధ పోరాటంగా పరిణమించింది. దీన్ని అరికట్టడానికి భారత ప్రభుత్వం సైన్యాన్ని ఉపయోగించింది. 1989-–90లో అత్యవసర పరిస్థితిని ప్రకటించి, అసోంను ‘కల్లోల ప్రాంతం’ గా గుర్తించి  వాటి కట్టడికి Disturbed Area Act, Armed Forces Special Powers Act(AFSPA), TADA, Unlawful Activities Prevention Act‌ మొదలైన చట్టాలను తెచ్చింది. ఈ చట్టాలతో మానవ హక్కుల ఉల్లంఘన సర్వసాధారణమై పోయింది. మణిపూర్‌లో AFSPA చట్టాన్ని రద్దు చేయమని మహిళలు నగ్న ప్రదర్శన చేయడం, దేశ ప్రజలను దిగ్భ్రాంతికి గురి చేసింది. ఇరోమ్ షర్మిల నిరవధిక నిరాహార దీక్ష ఆవేదనకు లోను చేసింది. అనేక అస్తిత్వ ఉద్యమాలను ఈశాన్య ప్రాంత ప్రజలను చైతన్యపరిచాయి.


ఈశాన్య భారతం మన దేశానికి ఒక ముఖ్యమైన సరిహద్దు. నాటి తూర్పు పాకిస్థాన్/ నేటి బంగ్లాదేశ్‌లో భూమి కొరత వల్ల ఆ దేశ ప్రజలు పెద్ద ఎత్తున అసోంకు వలస వచ్చారు. దీంతో అసోంలోని పూర్వపు నివాసులు, కొత్తగా స్థిరపడ్డ వారి మధ్య నిరంతర సామాజిక ఘర్షణలు అనివార్యమయ్యాయి. అసోంలో అస్సామీ భాష మాట్లాడని వారు లేదా అక్కడి బోడో సంబంధింత మాండలిక భాషలు గానీ, అహోం, తివా, రభా మిషింగ్‌ లాంటి లిపిలేని మాండలిక భాషలు గానీ మాట్లాడని వారిని ‘బయటి’ వారిగా పరిగణిస్తారు. చాలా సంవత్సరాలుగా స్థిరపడిన వారిని కూడా బయటివారిగానే చూస్తారు. అస్సామీ మాట్లాడే ముస్లింలు, సిక్కులు ఈ కోవలోకిరారు. అందుచేత బెంగాలీ మాట్లాడే ముస్లింలు, బంగ్లాదేశ్‌ ముస్లింలు భాష రీత్యా, మతం రీత్యా పరదేశీయులే. బ్రహ్మపుత్ర నదీలోయలో నివసించే లింగ్విస్టిక్‌ ఎథ్నిక్‌ సమూహాలైన బెంగాలీలు బ్రిటిష్‌వారితో కుమ్మక్కై బెంగాలీ భాషను రాష్ట్ర భాషగా అసోంపై రుద్దారని నిరసించడమనేది ఒక చారిత్రక వాస్తవం. అసోం అస్తిత్వానికి భాష, భూమి చాలా ముఖ్యమైనవి. పేదరికం నుంచి బయటపడి మెరుగైన జీవితాన్ని నిర్మించుకునేందుకు ఇరుగు పొరుగు దేశాలకు వలస వెళ్ళడమనేది కొత్త విషయం కాదు.


యూరోపియన్ సామ్రాజ్యవాదులు తమ వలస రాజ్యాలలోని పేద ప్రజలను శ్రామికులు (కాంట్రాక్ట్ లేబర్)గా తమ అధీనంలోని ఇతర దేశాల పరిశ్రమల్లో, వ్యవసాయ క్షేత్రాల్లో పని చేయించడం ఒక దశ అయితే ఆ తర్వాత జీవనోపాధిని వెతుక్కుంటూ ఈ దేశం నుంచి అమెరికా, యూరప్‌, గల్ఫ్ దేశాలకు వలస పోవడం ఆ తర్వాతి దశ. అంతర్గత వలసలు చాలా వరకు అసంఘటిత రంగంలో పేద ప్రజల వలసలే. తూర్పు పాకిస్థాన్‌/ బంగ్లాదేశ్‌ నుంచి ఈశాన్య భారతంలోకి ఈ వలసలు జరుగుతూనే వున్నాయి. 


1998 ఎన్నికల మేనిఫెస్టోలో బిజెపి బంగ్లాదేశ్ నుంచి అక్రమ వలసలను అరికడతామని, తిరుగుబాటు ఉద్యమాలను అణచివేస్తామని పేర్కొంది. అక్రమ వలసలపై చర్య తీసుకొని అసోం ఉద్యమ ఆకాంక్షను నెరవేర్చేందుకై జాతీయ పౌర పట్టికను తయారు చేయడానికి పూనుకోవాలని సంకల్పించింది. పౌరసత్వ సవరణ బిల్లు తమ ప్రభుత్వ ఎజెండాలో మొదటిదని 2016లోనే అమిత్ షా మొదలైన బీజేపీ నాయకులు ప్రకటించారు. 2019 సార్వత్రక ఎన్నికలలో బీజేపీ అత్యధిక సీట్లు సాధించింది. 1951 జనాభా లెక్కల ఆధారంగా రూపొందించిన ఎన్‌ఆర్‌సి ప్రకారం అసోంలో ఉన్న బయటివారు, అక్రమ వలసదారుల సంఖ్య 19 లక్షలకు చేరింది. వీరిలో అత్యధికులు హిందువులేనని తేలింది. గూర్ఖా, రభాస్‌, తివాస్‌, మార్వాడీ, బీహారీ, అస్సామీ భాష మాట్లాడే వారుకూడా ఇందులో ఉన్నారు. ఈ ఎన్‌ఆర్‌సిని బీజేపీ పూర్తిగా తిరస్కరించింది. కొత్తగా 1955 పౌరసత్వ చట్టానికి మార్పు తెచ్చి అఫ్ఘానిస్తాన్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ నుంచి 2014 డిసెంబర్‌ 31 కి పూర్వం వచ్చిన హిందూ, సిక్కు, బౌద్ధ, జైన, క్రైస్తవ మతస్థులకు పౌరసత్వం ఇవ్వడానికి సిద్ధపడింది.


ఈ జాబితాలో ముస్లింలు లేరు. 1985 అసోం ఒప్పందం ప్రకారం 1971 మార్చి 25 చివరి తేదీ. అయితే, సిఏఏ దీన్ని సవరించి 2014 డిసెంబర్ 31గా మార్చింది. అంటే 1971లో బంగ్లాదేశ్ విముక్తి తరువాత 2014 దాకా వచ్చిన వారికి కూడా (ముస్లింలు మినహా) పౌరసత్వ హక్కు ఇస్తుంది. చట్టం అమలులోకి వస్తే బంగ్లాదేశీ హిందువులతో అసోం నిండిపోతుందనే భయాందోళనలను సంకీర్ణ ప్రభుత్వంలో భాగస్వాములైన అస్సాం గణ పరిషత్‌, బోడో పీపుల్స్‌ ఫ్రంట్‌ పదే పదే వ్యక్తం చేసాయి. 1971 మార్చి తర్వాత అసోం వచ్చి స్థిరపడిన వారు 1971 పూర్వపు ధ్రువ పత్రాలను, పుట్టిన తేది, వివాహ పత్రంలాంటివి ఎన్‌ఆర్‌సి అధికారులకు చూపించాలనే నిబంధన ప్రజలను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ముఖ్యంగా స్త్రీలకు వారి వివాహం తర్వాత పేరులో వచ్చిన మార్పుతో ఏర్పడ్డ ఇబ్బందులు, పేద ప్రజలకు యాభై సంవత్సరాల పూర్వపు ధ్రువ పత్రాలు రాబట్టడంలో వచ్చిన చిక్కులు మొదలైన వాటిని గ్రహించిన ప్రజలు ఉద్యమ బాట పట్టారు. దీనికి స్పందిస్తూ కేంద్ర ప్రభుత్వం కొన్ని ప్రాంతాలను ఈ చట్టం నుంచి మినహాయించింది. రాజ్యాంగంలోని ఆరో షెడ్యూలులో ట్రైబల్‌ మెజార్టీ ఉన్న ప్రాంతాలను (అసోం, మిజోరం, మేఘాలయ, త్రిపుర) దానితోపాటు ఇన్నర్‌ లైన్‌ పర్మిట్‌ (ఐఎల్‌పి) కింద ఉన్న ప్రాంతాల (అరుణాచల్‌ ప్రదేశ్‌, మిజోరం, నాగాలాండ్‌)ను ఆ చట్టం పరిధి నుంచి మినహాయించింది. అసోంలో స్వయం ప్రతిపత్తి ఉన్న మూడు ప్రాంతాలు, బోడోలాండ్‌ టెరిటోరియల్‌ ప్రాంతాన్ని కూడా ఐఎల్‌పి నుండి మినహాయించారు. అదే విధంగా త్రిపురలో డెబ్బై శాతం భూభాగం, షిల్లాంగ్‌ తప్ప మేఘాలయలో పూర్తి ప్రాంతం, మణిపూర్‌, నాగాలాండ్‌, మిజోరం పూర్తి ప్రాంతాలను మినహాయించారు. ఐఎల్‌పి  ప్రకారం ఇతర ప్రాంతాల నుంచి వచ్చే పౌరులకు తప్పని సరిగా అనుమతి పత్రం ఉండాలి.


అస్సామీల వ్యతిరేకత పౌరసత్వ జాబితాలో ముస్లింలను చేర్చనందుకు కాదు. ఈ వ్యతిరేకత అన్ని మతాల, ప్రాంతాల నుంచి అసోంకు వలస వచ్చేవారిపైనే. ఈశాన్య రాష్ట్రాల్లో ప్రజల ఆందోళన తమ అస్తిత్వాన్నే చెదరగొడుతున్న అక్రమ వలసదారులు; ఉద్యోగాలు, వనరులను స్వాధీనం చేసుకుంటున్న ‘బయటివారి’ పైనే. సరిహద్దుదాటి చట్టాన్ని ఉల్లంఘించి భారత్‌లో స్థిరపడిన బెంగాలీలు- (వారి మతంతో సంబంధం లేకుండా) బయటి వారేనని, కనుక తిరిగి వెళ్ళి పోవలిసిందే అన్నది అసోం ప్రజల వాదన. ‘బయటివారి’పై ఈ వ్యతిరేకత మతంతో ముడిపెట్టడానికి వీలు లేదు. ‘మా డిమాండ్‌ చాలా సాధారణమైంది. బంగ్లాదేశీయిులు ఏ మతానికి చెందిన వారైనా, ఏ కులానికి చెందిన వారైనా మా రాష్ట్రం నుంచి తరిమివేయాల్సిందే’ నని వారు అంటున్నారు. 2014 డిసెంబర్‌ 31 దాకా అఫ్ఘానిస్తాన్‌, పాకిస్థాన్‌, బంగ్లాదేశ్‌ నుంచి వచ్చిన ముస్లిమేతర శరణార్థులకు పౌరసత్వ హక్కును కల్పించేందుకు కొత్తగా తెచ్చిన పౌరసత్వ చట్ట సవరణను అమలు చేయడానికి బీజేపీ నిర్ణయించింది. అయితే 2003లో పౌరసత్వ చట్టాన్ని (1955) సవరించిన వాజపేయి ప్రభుత్వం భారత సంతతి ప్రజలను గుర్తించి హక్కు కల్పించడమే కాకుండా, అసలైన భారత పౌరులతో జాతీయ పౌరసత్వ జాబితాను తయారు చేయాలని, దానికోసం జాతీయ జనాభా పట్టికను కూడా తయారు చేయాల్సిన అవసరం వుందని గుర్తించింది. దీనికి కావలసిన వివరాలు ఇవ్వకపోయినా, ఇచ్చేందుకు నిరాకరించినా నేరమవుతుందని, శిక్షార్హులవుతారని కూడా హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం 2010లో మొదటిసారి జాతీయ జనాభా పట్టికను తయారు చేసింది. 2014లో అధికారంలోకి వచ్చిన బీజేపీ ఈ పట్టికను 2015లో సవరించింది. మళ్ళీ ఐదు సంవత్సరాల లోపే అంటే 2019లో జనాభా పట్టికను సవరిస్తామని, జాతీయ పౌరసత్వ జాబితా కూడా తయారు చేస్తామని ప్రధానమంత్రి, హోంమంత్రి పార్లమెంటులో ప్రకటనలు చేసారు. 1985 అసోం ఒప్పందం నేపథ్యంలో వచ్చిన ఈ నిర్ణయాలు బీజేపీ రాజకీయ అవసరాలకు, హిందూత్వ భావజాలాన్ని దేశవ్యాప్తంగా బలపరచి, దేశాన్ని ఒక హిందూ రాష్ట్రంగా రూపొందించడానికి అనుగుణంగా వున్నవే. 


2019 లోక్‌సభ ఎన్నికల్లో 2019 బిజెపి పెద్ద ఎత్తున గెలుపొందిన తర్వాత, అసోంలో పౌర జాబితా, సిఏఏ ప్రకటించబడ్డాయి. వీటికి వ్యతిరేకంగా ప్రజలు పెద్ద ఎత్తున ఉద్యమించారు. జాతీయ పౌర చట్ట సవరణ బిల్లుని పలు పౌర, రాజకీయ సంఘాల కూటమి వ్యతిరేకించినప్పటికీ, తరువాత జరిగిన అస్సాం రాష్ట్ర ఎన్నికలలో అనుకున్న విజయాన్ని సాధించలేక పోయింది. దీనికి కారణం కూటిమిలో ఐక్యత లోపించటం. బీజేపీకి ప్రత్యామ్నాయం లేకపోవటమే. సిఏఏ ను వ్యతిరేకించిన మేధావి హీరేన్ గేహెన్ నేతృత్వంలోని ఆయిన్‌ షంషోధన్‌ విరోధి మంచ్‌ (ఫోరం అగైనెస్ట్ సిటిజెన్‌షిప్‌ అమెండ్‌మెంట్‌ ఆక్ట్) కలుపుకున్నప్పటికీ ఒక కామన్‌ ప్లాట్‌ ఫాంను ఏర్పరచ లేకపోయారు. వీటిలో ఏవీ కూడా కాంగ్రెస్ పార్టీని ప్రత్యామ్నాయంగా చూడలేదు. సిఏఏ వ్యతిరేక ఉద్యమం బిజెపి వ్యతిరేక ఉద్యమంగా మారకుండా అరికట్టడానికి ఆర్‌ఎస్‌ఎస్‌ తోడ్పడింది. దీంతో హిందుత్వ భావజాలంతో మత ద్వేషాలు కూడా పెరిగేందుకు ఆస్కారమేర్పడింది. కొత్తగా వచ్చిన పౌరసత్య చట్టాలపై ఈశాన్య రాష్ట్రాల్లో ఉధృతమవుతున్న వ్యతిరేకత రాజ్యాంగానికి కొత్త సవాళ్ళను సృష్టిస్తోంది. ఈ సమస్యను రాజకీయలబ్ధి దృష్టితో చూడకుండా రాజ్యాంగ నైతికతతో విశ్లేషించి పరిష్కరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 

రమా మెల్కోటె 

రిటైర్డ్ ప్రొఫెసర్, ఉస్మానియా యూనివర్సిటీ

Updated Date - 2020-03-10T06:46:36+05:30 IST