బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు

ABN , First Publish Date - 2022-04-22T05:34:22+05:30 IST

వేద సంహితలలోని మంత్రాలకు అర్థాలు వివరించేవాటిని

బ్రాహ్మణాలు, ఉపనిషత్తులు

వేద సంహితలలోని మంత్రాలకు అర్థాలు వివరించేవాటిని ‘బ్రాహ్మణాలు’ అంటారు. ఈ బ్రాహ్మణాలు సంహితలకు అనుబంధంగా ఉంటాయి. ఐతరేయ, కౌషితకి లేదా సాంఖ్యాయన బ్రాహ్మణాలు ఋగ్వేదానికి అనుబంధాలు. సామవేదానికి జైమినీయ, పంచవింశతి బ్రాహ్మణాలు, కృష్ణ యజుర్వేదానికి తైత్తరీయ బ్రాహ్మణం, శుక్ల యజుర్వేదానికి శతపధ బ్రాహ్మణం అనుబంధంగా ఉంటాయి. ఈ బ్రాహ్మణాలు క్రీస్తుపూర్వం 900 నుండి 700 సంవత్సరాల మధ్య కాలానికి చెందినవిగా నిర్ధారించారు. 


బ్రాహ్మణాలకు అనుబంధంగా మళ్లీ రెండు విభాగాలైన గ్రంథాలు ఉన్నాయి. ఒకటి అరణ్యకాలు, రెండవది ఉపనిషత్తులు. ‘అరణ్యకాలు’ అంటే ఆత్మకు సంబంధించిన మర్మాలు, అడవులలో చేసే విధుల గురించి చర్చిస్తాయి. మనకు ఈనాడు లభించే అరణ్యకాలు ఋగ్వేదం, కృష్ణ, శుక్ల యజుర్వేద బ్రాహ్మణాలకు అనుబంధంగా ఉన్నాయి. 


‘ఉప-ని-సద్‌’ అనే పదాల నుండి పుట్టినది ఉపనిషత్‌. అంటే యోగ్యుడైన శిష్యుణ్ణి దగ్గిరగా కూర్చోబెట్టుకొని... గురువు బోధించే రహస్య జ్ఞానం. అయితే ఈ ఉపనిషత్తుల మీద చర్చలన్నీ రాజాస్థానాల్లో జరుగుతూ వచ్చాయి. దాదాపు 200 పైగా ఉపనిషత్తులు ఉన్నప్పటికీ వీటిలో బహుకొద్ది ఉపనిషత్తులు మాత్రమే వైదిక యుగానికి చెందినవి. అవి: ఐతరేయోపనిషత్తు, కౌషితకి ఉపనిషత్తు, తైత్తరీయ ఉపనిషత్తు, బృహదారణ్యక ఉపనిషత్తు, చాందోగ్యోపనిషత్తు, కేనోపనిషత్తు, కఠోపనిషత్తు, శ్వేతాశ్వతర ఉపనిషత్తు, మహా నారాయణ ఉపనిషత్తు, ఈశావాస్యోపనిషత్తు, ముండకోపనిషత్తు, ప్రశ్నోపనిషత్తు, మైత్రి ఉపనిషత్తు, మాండూక్యోపనిషత్తు. ఈ ఉపనిషత్తులు గుప్త కర్మలు, మంత్రాలు మొదలుకొని తాత్త్విక ఊహాగానాల వరకు అనేకమైన అంశాలను చర్చిస్తాయి. వీటిలో కొన్ని బుద్ధుడి ముందు కాలానికి చెందినవీ, మరికొన్ని తరువాతి కాలానికి చెందినవీ ఉన్నాయి. ఉపనిషత్తులన్నీ వేదానంతర కాలంనాటివే. వీటినే ‘వేదాంతం’ అంటారు. వేదాలకు అంతాన ఉన్నాయి కాబట్టి వాటికి ఆ పేరు వచ్చింది. వేద సాహిత్యంలో ఆఖరి భాగంగానూ, జ్ఞాన విషయంలో వేదానికి అంతిమ లక్ష్యం అనే అర్థంలోనూ వీటిని చెబుతారు. 



ఈ ఉపనిషత్తులు ఆత్మ, పరమాత్మ గురించి, ‘ఓం శబ్దం’ మహాత్మ్యం గురించి, బ్రహ్మ జ్ఞానం గురించి, ముక్తి గురించి, పరలోకం గురించి, ఆధ్యాత్మికత గురించి ప్రధానంగా చర్చిస్తాయి. అయితే వీటిలో ఒకటైన ముండకోపనిషత్తు యజ్ఞయాగాదులను, కర్మకాండలను నిరసిస్తుంది. బ్రహ్మచర్యాన్ని, తపస్సును ఆచరించడం ద్వారా ఆత్మజ్ఞానాన్ని పొందవచ్చునంటుంది. యజ్ఞ యాగాల గురించి కర్మకాండ గురించి చెబుతూ ‘‘యజ్ఞాలు అనేవి ఓటి పడవలు. అవి ఒడ్డుకు చేరటానికి ఏ విధంగానూ పనికిరావు. ఈ యజ్ఞాలంటే గొప్పవి అనుకొనేవారు మూర్ఖులు. వారు మళ్లీ మళ్లీ పుడుతూ గిడుతూ... జనన మరణ చక్రభ్రమణంలో కొట్టుమిట్టాడుతుంటారు. అజ్ఞానం కారణంగా తాము ధీరులమని, పండితులమని అనుకొనే వీరు అంధుల సాయంతో నడిచే అంధుల్లా దుఃఖాన్ని పొందుతుంటారు. అజ్ఞానం కారణంగానే తాము కృతార్థులు అయ్యామని గర్విస్తూ ఉంటారు. కర్మకాండలలో మునిగి ఉండే వీళ్లు రోగ కారణాలు తెలుసుకోలేరు. పుణ్య లోకాలను పొందలేరు. కర్మకాండలను వదిలి, శ్రద్ధతో తపస్సు ఆచరిస్తూ, అరణ్యవాసం చేసినవాడు పాపరహితుడు అవుతాడు. పుణ్యలోకాలు పొందుతాడు. ఆత్మ పురుషుణ్ణి (బ్రహ్మను) చేరుతాడు’’ అంటాడు ముండకోపనిషత్‌కారుడు. ఇలా అనేక తాత్విక చర్చల సంకలనమే ఉపనిషత్తులు.                                 



ఉపనిషత్తుల్లో కొన్ని బుద్ధుడి ముందు కాలానికి చెందినవీ, మరికొన్ని తరువాతి కాలానికి చెందినవీ ఉన్నాయి. ఉపనిషత్తులన్నీ వేదానంతర కాలంనాటివే. వీటినే ‘వేదాంతం’ అంటారు. 

 పి.బి.చారి, 

9704934614.


Updated Date - 2022-04-22T05:34:22+05:30 IST