ప్రభుత్వ సలహాదారుడిగా బ్రహ్మానందరెడ్డి

ABN , First Publish Date - 2022-05-21T05:40:02+05:30 IST

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేతల్లో ఒకరైన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. వ్యవసాయ మార్కెటింగ్‌, కోఆపరేటివ్‌ సలహాదారుడిగా వ్యవహరించబోతున్నారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది.

ప్రభుత్వ సలహాదారుడిగా బ్రహ్మానందరెడ్డి

(ఆంధ్రజ్యోతి ఒంగోలు)

ఉమ్మడి ప్రకాశం జిల్లాలో సీనియర్‌ నేతల్లో ఒకరైన వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి బత్తుల బ్రహ్మానందరెడ్డిని రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సలహాదారుడిగా నియమించింది. వ్యవసాయ మార్కెటింగ్‌, కోఆపరేటివ్‌ సలహాదారుడిగా వ్యవహరించబోతున్నారు. ఆ మేరకు ప్రభుత్వం శుక్రవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం బాపట్ల జిల్లా పర్చూరు నియోజకవర్గం ఎర్రంవారిపాలేనికి చెందిన బ్రహ్మానందరెడ్డి వైసీపీ ఆరంభం నుంచి ఆ పార్టీలో ఉన్నారు. అంతకుముందు టీడీపీ నుంచి 1994లో పర్చూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత ఆ పార్టీకి జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. వైసీపీ ఆవిర్భావం తర్వాత తొలుత ఓదార్పు యాత్ర ఉమ్మడిప్రకాశం జిల్లా కన్వీనర్‌గా, ఆ తర్వాత జిల్లా అధికార ప్రతినిధిగా, ప్రస్తుతం రాష్ట్ర అధికార ప్రతినిధిగా పనిచేస్తున్నారు. సుమారు 20 ఏళ్ల పాటు సొసైటీ అధ్యక్షుడిగా, చీరాల సహకార స్టోర్స్‌ అధ్యక్షుడిగా, ఆ తర్వాత రైతు సంఘాల్లో పనిచేసిన అనుభవం ఉన్న ఆయనను ప్రభుత్వం మార్కెటింగ్‌ శాఖ సలహాదారుడిగా నియమించింది. సీఎంకి, ఆ పార్టీ నేతలు సజ్జల, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ప్రోత్సాహంతో పదవి లభించిందని ఆయన ఆంధ్రజ్యోతికి చెప్పారు. పర్చూరు వైసీపీ ఇన్‌చార్జిగా రామనాథంబాబుకు మద్దతుగా ఆయన ఉండడం, ప్రస్తుతం రామనాథంబాబును మార్చి మరొకరిని నియమించాలని ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో బ్రహ్మానందరెడ్డికి పదవి దక్కడం విశేషంగా రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు. కాగా, మార్కెటింగ్‌, సహకార రంగాల్లో ఆయనకు ఉన్న అనుభవాన్ని వినియోగించి ప్రజలకు సేవచేస్తానని, ఆ రంగాల ప్రజల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన చెప్పారు. 

Updated Date - 2022-05-21T05:40:02+05:30 IST