బ్రహ్మజ్ఞానం

ABN , First Publish Date - 2020-11-04T07:33:54+05:30 IST

బాలాకియని జనులచే పిలువబడిన గార్గ్యుడు.. గర్విష్ఠి. ఒకనాడు అతడు కాశీరాజైన అజాత శత్రువు వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తానన్నాడు. అందుకు సంతోషించిన అజాత శత్రువు సరేనన్నాడు...

బ్రహ్మజ్ఞానం

బాలాకియని జనులచే పిలువబడిన గార్గ్యుడు.. గర్విష్ఠి. ఒకనాడు అతడు కాశీరాజైన అజాత శత్రువు వద్దకు వెళ్లి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశిస్తానన్నాడు. అందుకు సంతోషించిన అజాత శత్రువు సరేనన్నాడు. ఆదిత్యపురుషునే బ్రహ్మమని నేనుపాసిస్తున్నాను అన్నాడు గార్గ్యుడు. దానికి కాశీరాజు.. ‘‘కాదు, కాదు, ఈ ఆదిత్యుడు అన్ని భూతములలో శ్రేష్ఠుడు. నేను దీనినిట్లే ఉపాసిస్తున్నాను. బ్రహ్మముగా కాదు’’ అన్నాడు. ఆ తరువాత గార్గ్యుడు వరుసగా చంద్రుని, మెరుపును, ఆకాశంలో ఉండే పరమ పురుషుని, వాయువును, అగ్ని పురుషుని, జల పురుషుని, అద్దంలోని పురుషుని, శబ్దాన్ని, దిక్కుల్లో ఉన్న పరమ పురుషుని, నీడలో ఉండే మహా పురుషుని, బుద్ధిలో ఉన్న పురుషుని.. బ్రహ్మముగా ఉపాసిస్తున్నట్టు చెప్పాడు. వాటన్నింటినీ అజాతశత్రువు ఖండిస్తూ వచ్చాడు. ఆయా పరమ పురుషుల దైవీగుణాలను, ఆయా దేవతలను ఆరాధించడం వల్ల కలిగే ఫలితాలను వివరిస్తాడు. చివరకు గార్గ్యుడు శరీరంలోని పురుషుడే బ్రహ్మమని అంతకన్నా తనకు తెలియదని చెబుతాడు. అప్పుడు అజాత శత్రువు.. ‘శరీరగత పురుషుని నేను ఆత్మగలవానిగా ఉపాసిస్తున్నాను. తనను తాను ఆత్మగా ఎరిగిన వాడు ఆత్మవంతుడవుతాడు. దేహంలోని ఆత్మ మరియొక ఆత్మను కోరుతుంది. అది లేకుండా ఈ ఆత్మ ఏమీ చేయలేదు’’ అని తెలిపాడు. అప్పుడు గార్గ్యుడు ‘మీరే నాకు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించండి’ అని కోరగా.. అజాతశత్రువు అతణ్ని తనతో తీసుకెళ్లాడు. ఇద్దరూ కలిసి.. నిద్రిస్తున్న ఒక వ్యక్తి వద్దకు వెళ్లారు. అతడి పేరు పెట్టి బిగ్గరగా పిలిచినా అతడు లేవలేదు.


తట్టి లేపితే లేచి నిలబడ్డాడు. అప్పుడు అజాత శత్రువు.. ‘‘ఈ విజ్ఞానమయపురుషుడు నిద్రించినప్పుడు ఎక్కడ ఉన్నాడు? నిద్ర నుండి లేచినపుడు ఎక్కడ నుండి వచ్చాడు? నిద్రించినప్పుడు ఇంద్రియాల జ్ఞానాన్నంతా తీసుకుని తన హృదయాకాశంలో నిద్రించాడు. ఇలా ఇంద్రియాల జ్ఞానాన్ని పురుషుడు గ్రహించినప్పుడు నిద్రపోతున్నాడు అని చెబుతాము. అప్పుడీ విజ్ఞానమయ పురుషుడు ప్రాణాలతో పాటు వాక్కును, చూపును, వినికిడి శక్తిని, మనసును తనలో పట్టి ఉంచుతాడు. ఇదే సుషుప్తి. ఇట్లు నిద్రించినవానిని లోకంలో ‘స్వపితి’ అంటారు. అంటే ఆత్మను పొందినవాడు. సుషుప్తిలో అతడు తన నిజ(ఆత్మ)రూపంలో చేరి ఉంటాడు. స్వప్నంలో విహరించే ఆత్మకు ఎన్నో లోకాలు, అనుభవాలు. కలలో ఒకొకప్పుడు చక్రవర్తిగా, జ్ఞానిగా, గొప్పవానిగా సేవకునిగా వ్యవహరిస్తాడు. సేవకులను వెంట తీసుకుని రాజు తన రాజ్యంలో తిరిగినట్లుగా జీవుడు ఇంద్రియాలతో తన దేహమందు తిరుగుతాడు. గాఢనిద్ర సమయంలో హృదయకోశం నుండి వెలువడే  72 వేల హిత నాడులు శరీరమంతా వ్యాపించి పురీతతములవుతాయి. వీటిలో శ్రేష్ఠమైనది ‘సుషుమ్న’నాడి. ఆత్మ ఆనందంగా సుషుప్తిలో నిద్రిస్తుంది. ఆ సమయంలో ఆత్మ పరమాత్మను చేరుతుంది. ఆనందాన్ని అనుభవిస్తుంది. అదే బ్రహ్మానుభూతి. ఆత్మే ఇంద్రియాలను చైతన్యం చేస్తుంది. సాలీడు తన శరీరం నుండే వెలువడిన దారాన్ని ఆధారంగా చేసుకుని క్రిందికి పైకి పోయినట్లు ఈ శరీరంలోని జీవుడు జీవుడు జాగ్రత్‌, స్వప్న, సుషుప్తి అవస్థలలో సంచరిస్తుంటాడు. అగ్ని నుండి నిప్పురవ్వలు లేచినట్లు ఆత్మ నుండి జ్ఞానం ఇంద్రియాలను చైతన్యం చేస్తుంది. శరీరంలో ఆత్మ విజ్ఞానఘనం. బ్రహ్మాండంలో పరమ విజ్ఞాన ఘనం.. ఆ పరమాత్మ(బ్రహ్మము). ఆ బ్రహ్మము నిమిత్త కారణంగానే అన్నిలోకాలు సృజించబడతాయి. ఈ పిండమండలి ఆత్మ సత్యం. బ్రహ్మాండమండలి ఆత్మ.. ఆత్మకు ఆత్మ. సత్యస్య-సత్యమ్‌.. అనగా సత్యానికి సత్యం. ఈ తత్వాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం అంటూ గార్గ్యునికి అజాతశత్రువు బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించాడు.

- జక్కని వేంకటరాజం 


Updated Date - 2020-11-04T07:33:54+05:30 IST