బీపీసీఎల్‌ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు

ABN , First Publish Date - 2021-06-21T08:45:30+05:30 IST

బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు రూ.12 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న బీపీసీఎల్‌ను ప్రభుత్వం రూ.70,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని పెట్రోలియం అండ్‌ గ్యాస్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా

బీపీసీఎల్‌ ఆస్తుల విలువ రూ.12 లక్షల కోట్లు

విక్రయిస్తే వచ్చేది రూ.80,000 కోట్లే


బీపీసీఎల్‌ ప్రైవేటీకరణను ఉద్యోగ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. దాదాపు రూ.12 లక్షల కోట్ల విలువైన ఆస్తులు ఉన్న బీపీసీఎల్‌ను ప్రభుత్వం రూ.70,000 కోట్ల నుంచి రూ.80,000 కోట్లకు విదేశీ కంపెనీలకు కట్టబెట్టేందుకు ప్రయత్నిస్తోందని పెట్రోలియం అండ్‌ గ్యాస్‌ వర్కర్స్‌ ఫెడరేషన్‌ ఆఫ్‌ ఇండియా (పీజీడబ్ల్యూఎ్‌ఫఐ) డిప్యూటీ జనరల్‌ సెక్రటరీ బీ బాలగోపాలన్‌ ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పారు. ముందుముందు ప్రభుత్వ రంగంలోని మిగతా ఆయిల్‌ అండ్‌ గ్యాస్‌ కంపెనీలనూ ప్రభుత్వం ఇలానే ప్రైవేటు రంగానికి కట్టబెట్టే ప్రమాదం ఉందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది జాతీయ ప్రయోజనాలనూ దెబ్బతీస్తుందని తెలిపాయి. 


10,000 ఎకరాల భూములు: బీపీసీఎల్‌ కంపెనీకి రిఫైనరీలతో పాటు దేశవ్యాప్తంగా 10,000 ఎకరాల వరకు భూములు ఉన్నాయి. ఒక్క ముంబై మహానగరం, దాని శివార్లలోనే 600 ఎకరాల భూమి ఉంది. అక్కడ ఎకరం ఎంత లేదన్నా రూ.300 కోట్ల నుంచి రూ.400 కోట్లు పలుకుతోంది. మిగతా నగరాల్లోని భూముల విలువా భారీగానే ఉంది. బీపీసీఎల్‌ పెట్టుబడుల ఉపసంహరణ ద్వారా ప్రభుత్వానికి వచ్చే రూ.70,000-80,000 కోట్ల కంటే, ఈ భూముల విలువే ఎక్కువగా ఉంటుందని బాలగోపాలన్‌ చెప్పారు. ఇంత విలువైన ఆస్తులున్న బీపీసీఎల్‌ను పెట్టుబడుల ఉపసంహరణ పేరుతో ప్రభుత్వం ప్రైవేటు రంగానికి కారు చౌకగా కట్టబెడుతోందని ఉద్యోగ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 


తదుపరి టార్గెట్‌ ఓఎన్‌జీసీనే..

లాభాల్లో ఉన్న పీఎస్‌యూ కంపెనీలను కొనుగోలు చేసేందుకు మాత్రమే ప్రైవేట్‌ కంపెనీలు ఆసక్తి చూపిస్తున్నాయి. బీపీసీఎల్‌ ప్రైవేటీకరణ తర్వాత ప్రభుత్వం.. తప్పకుండా ఓఎన్‌జీసీపైనే దృష్టి పెడుతుంది. ఇందుకు సంబంధించి ఇప్పటికే స్పష్టమైన సంకేతాలిచ్చింది. ప్రభుత్వ అనాలోచిత విధానాల కారణంగా 20 ఏళ్ల క్రితం రూ.లక్ష కోట్లు ఉన్న ఓఎన్‌జీసీ రిజర్వ్‌ నిధులు ప్రస్తుతం రూ.200 కోట్లకు పడిపోయాయి. 

ప్రదీప్‌ మయేకర్‌, జాతీయ అధ్యక్షుడు, పీజీడబ్ల్యూఎఫ్‌ఐ

బిజినెస్‌ డెస్క్‌


 

Updated Date - 2021-06-21T08:45:30+05:30 IST