ప్రియురాలికి సెల్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అదే సెల్‌ఫోన్ కోసం ఆమె ప్రాణం తీశాడు!

ABN , First Publish Date - 2022-04-05T17:31:03+05:30 IST

ప్రేమలో ఉన్న సమయంలో ప్రేమికులు పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సాధారణ విషయమే.

ప్రియురాలికి సెల్‌ఫోన్ గిఫ్ట్‌గా ఇచ్చాడు.. అదే సెల్‌ఫోన్ కోసం ఆమె ప్రాణం తీశాడు!

ప్రేమలో ఉన్న సమయంలో ప్రేమికులు పరస్పరం బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం సాధారణ విషయమే. వారు బహుమతుల ద్వారా తమ ప్రేమను అవతలి వ్యక్తికి తెలియజేస్తూ ఉంటారు. ప్రేమలో ఉన్నంత సేపూ బహుమతులు ఇచ్చి పుచ్చుకోవడం బాగానే ఉంటుంది. ఒకవేళ బ్రేకప్ అయితే ఆ బహుమతులు ప్రేమికుల మధ్య మరింత చిచ్చు పెడతాయి. తాజాగా జార్ఖండ్‌లో ఇలాంటి ఘటనే ఒకటి జరిగింది. ప్రేమలో ఉన్నప్పుడు తను ఇచ్చిన ఖరీదైన సెల్‌ఫోన్‌ను తిరిగి ఇవ్వలేదనే కోపంతో ఓ వ్యక్తి తన మాజీ ప్రేయసిని చంపేశాడు. 


జార్ఖండ్‌లోని పాకుర్‌‌కు చెందిన 20 ఏళ్ల యువకుడు ఓ యువతితో రెండేళ్లు ప్రేమాయణం సాగించాడు. ఇద్దరూ వివాహం చేసుకోవాలనుకున్నారు. అయితే అబ్బాయి ఇంట్లో అభ్యంతరాలు రావడంతో ఆ వివాహం ఆగిపోయింది. యువకుడు ఆమెకు బ్రేకప్ చెప్పేశాడు. ఇటీవల ఆ యువకుడికి మరో యువతితో నిశ్చితార్థం కూడా జరిగింది. దీంతో మాజీ ప్రేయసి తీవ్ర మనస్థాపానికి గురైంది. గతంలో తాను కొనిచ్చిన ఖరీదైన ఫోన్‌ను తిరిగి ఇచ్చేయాలని ప్రియుడు అడగడంతో ఆమె మరింత వేదనకు గురైంది. ఆ ఫోన్‌ను తిరిగిచ్చేందుకు ఆమె అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఆ ఫోన్‌ను తిరిగి ఇచ్చేది లేదని ఆమె తెగేసి చెప్పింది. 


ఆదివారం సాయంత్రం ఆమెను ఆ యువకుడు ఫుట్‌బాల్‌ మ్యాచ్‌‌ చూద్దామని చెప్పి తన బైక్ ఎక్కించుకున్నాడు. ఓ నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఆమె గొంతు కోసి చంపేశాడు. అనంతరం సెల్‌ఫోన్‌ తీసుకుని పరారయ్యాడు. రక్తపు మడుగులో పడి ఉన్న ఆ యువతి మృతదేహాన్ని సోమవారం ఉదయం కొందరు స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ ప్రారంభించారు. ప్రియుడే ఆమెను బయటకు తీసుకెళ్లినట్లు కొందరు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. ఆ యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించడంతో నేరం అంగీకరించాడు. 


Updated Date - 2022-04-05T17:31:03+05:30 IST