బాలుడి సాహసం.. ఉక్రెయిన్ నుంచి ఒంటరిగా స్లొవేకియా ప్రయాణం

ABN , First Publish Date - 2022-03-08T19:23:10+05:30 IST

యుద్ధ వాతావరణం ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితుల్ని సృష్టిస్తోంది. పిల్లలు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు.

బాలుడి సాహసం.. ఉక్రెయిన్ నుంచి ఒంటరిగా స్లొవేకియా ప్రయాణం

యుద్ధ వాతావరణం ఉక్రెయిన్‌లో భయానక పరిస్థితుల్ని సృష్టిస్తోంది. పిల్లలు, మహిళలు సైతం ప్రాణాలు కోల్పోతున్నారని అక్కడి అధికారులు చెబుతున్నారు. దీంతో చాలామంది తమ ప్రాణాలు కాపాడుకునేందుకు సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారు. పిల్లలు కూడా ఇలా దేశం దాటి వెళ్లాల్సిన పరిస్థితి ఉంది. తాజాగా పదకొండేళ్ల బాలుడు, ఉక్రెయిన్ నుంచి ఒంటరిగా స్లొవేకియా వెళ్లిన ఘటన సంచలనం స‌ృష్టిస్తోంది. ఉక్రెయిన్‌లోని జపోరోజై అనే పట్టణం నుంచి బాలుడు ఒంటరిగా ప్రయాణం చేసి, స్లొవేకియా చేరాడు. తన వెంట పెద్దవాళ్లెవరూ లేకపోవడం విశేషం. అతడి తల్లిదండ్రులు జపోరోజైని వీడి రాలేమని చెప్పి, బాలుడిని మాత్రమే పంపిచారు. దీంతో యుద్ధ వాతావరణం, కఠినమైన ఆంక్షల మధ్య బాలుడు పొరుగు దేశానికి చేరుకున్నాడు. బాలుడి వెంట పాస్‌పోర్ట్, ఒక బ్యాగ్, అతడి తల్లి రాసిన లేఖ మాత్రమే ఉన్నాయి. ఆ లేఖను చేతిలో పట్టుకుని బాలుడు ధైర్యంగా స్లొవేకియా చేరాడు. ఆ దేశ అధికారులు కూడా బాలుడిని స్వాగతించి, వసతి కల్పించారు. క్లిష్ట పరిస్థితుల్లో ముందడుగు వేసిన బాలుడి ధైర్యానికి ఉక్రెయిన్ ప్రభుత్వం అభినందించింది. తాజా సమాచారం ప్రకారం ఉక్రెయిన్ నుంచి 15 లక్షల మంది వలస వెళ్లారని ఐక్యరాజ్యసమితి ప్రకటించింది.

Updated Date - 2022-03-08T19:23:10+05:30 IST