టార్గెట్‌ ‘టోక్యో’

ABN , First Publish Date - 2020-03-18T09:42:41+05:30 IST

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి అసోం క్రీడాకారిణిగా 22 ఏళ్ల లవ్లీనా.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల అమ్మాన్‌లో జరిగిన ఆసియన్‌ ఒలింపిక్స్‌

టార్గెట్‌  ‘టోక్యో’

లవ్లీనా.. పేరులో సున్నితత్వం ఉందేమోకానీ.. పంచ్‌ మాత్రం అదిరిపోద్ది. భారత బాక్సింగ్‌లో వేగంగా ఎదుగుతున్న యువ ప్లేయర్‌ లవ్లీనా బోర్గాయిన్‌. అసోంలోని మారుమూల ప్రాంతం నుంచి వచ్చినా.. అనతి కాలంలోనే భారత మహిళా బాక్సర్లలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల జరిగిన ఆసియా ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌లో సెమీస్‌ చేరి టోక్యో టికెట్‌ దక్కించుకున్న లవ్లీనా.. విశ్వక్రీడల పతకమే లక్ష్యంగా శ్రమిస్తోంది. 


సక్సెస్‌ సీక్రెట్‌.. ధ్యానం

బాక్సింగ్‌ పవర్‌ పంచ్‌ లవ్లీనా

ఒలింపిక్స్‌కు అర్హత సాధించిన తొలి అసోం క్రీడాకారిణిగా 22 ఏళ్ల లవ్లీనా.. అందరి దృష్టినీ ఆకర్షించింది. ఇటీవల అమ్మాన్‌లో జరిగిన ఆసియన్‌ ఒలింపిక్స్‌ క్వాలిఫయర్స్‌లో లవ్లీనా (69 కిలోలు) సెమీస్‌ చేరి టోక్యో బెర్త్‌ పట్టేసింది. అయితే, ఆమె ఫైనల్‌ చేరడంలో విఫలమైనా.. కెరీర్‌లో మాత్రం గొప్ప అడుగుపడింది. 


తోబుట్టువుల స్ఫూర్తితో..

లవ్లీనా స్వస్థలం అసోంలోని గోలాఘాట్‌ జిల్లా, బోరో ముఖియా గ్రామం. తల్లిదండ్రులు టికెన్‌, మమోని బోర్గాయిన్‌ చిన్ననాటి నుంచి ఆమెకు ఎంతో ప్రోత్సాహం అందించారు. లవ్లీనా ఆటలపట్ల ఆకర్షితురాలు కావడానికి కిక్‌ బాక్సర్లయిన ఆమె కవల సోదరీమణులు లిచా, లీమా కారణం. లవ్లీనాలోని సహజ ప్రతిభను గుర్తించిన సాయ్‌ కోచ్‌ పాదుమ్‌.. గువాహటిలోని సాయ్‌ సెంటర్‌లో శిక్షణకు ఎంపిక చేశాడు.  


నిలకడగా రాణించి..

శిక్షణలో రాటుదేలిన లవ్లీనా.. 2017లో తొలిసారి అంతర్జాతీయ పతకాన్ని సాధించింది. అస్తానాలో జరిగిన ప్రెసిడెంట్స్‌ కప్‌లో కాంస్యం, ఆ తర్వాత వియత్నాంలో జరిగిన ఆసియా బాక్సింగ్‌ చాంపియన్‌షి్‌ప్సలో మరో కంచు పతకంతో మెరిసింది. ఈ ప్రదర్శనతో గోల్డ్‌కో్‌స్టలో జరిగిన కామన్వెల్త్‌ క్రీడలకు ఎంపికైంది. 2018, 2019 మహిళల వరల్డ్‌ బాక్సింగ్‌ చాంపియన్‌షిప్స్‌లో కాంస్య పతకాలు నెగ్గింది. దీంతో ఆమెలోని ప్రతిభను గుర్తించిన భారత బా క్సింగ్‌ ఫెడరేషన్‌ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ ట్రయల్స్‌లో పాల్గొనే అవకాశం కల్పించింది. 


అదే విజయం రహస్యం

ఆరంభంలో ఆమెలో ఆత్మవిశ్వాసం తక్కువగా ఉండేది. దీంతో గట్టి ప్రత్యర్థులతో పోరు అనగానే ముందుగానే మానసికంగా ఓటమిని అంగీకరించేది. కారణంగానే కామన్వెల్త్‌ గేమ్స్‌లో పతకాన్ని సాధించలేక పోయింది. తన బలహీనతను గుర్తించిన లవ్లీనా దాన్ని అధిగమించేందుకు తీవ్రంగా కృషి చేసింది. ఆలోచనలను అదుపు చేయడానికి ధ్యానాన్ని సాధన చేసి.. మానసికంగా బలంగా తయారైంది. ఒత్తిడికి గురైనప్పుడు కుటుంబ సభ్యులతో మాట్లాడడంతోపాటు దక్షిణాది యాక్షన్‌ సినిమాలు చూస్తూ సేదతీరుతానంది. ఆమె అభిమాన బాక్సర్‌ అమెరికాకు చెందిన ఫ్లాయిడ్‌ మేవెదర్‌. 


పతకమే లక్ష్యంగా...

ఒలింపిక్స్‌లో పాల్గొనాలనేది నాన్న కల. అది నెరవేరింది. సెమీస్‌కు అర్హత పొందగానే ఇంటికి వీడియో కాల్‌ చేసినప్పుడు ఆయన కళ్లలో ఆనందం, తన కూతురు సాధించిందనేగర్వం కనిపించింది. ఇక అమ్మ అయితే సంతోషంతో ఉక్కిరిబిక్కిరైంది. ఒలింపిక్స్‌కు అర్హత సాధించడంతో నాన్న కల నెరవేరింది. ఇక మిగిలింది నా కలే.. అది ఒలింపిక్‌ పతకం. 

Updated Date - 2020-03-18T09:42:41+05:30 IST