వలస గండాల్లో గుత్తికోయలు

ABN , First Publish Date - 2022-06-14T06:27:40+05:30 IST

ఆదివాసీ రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 2005లో హింసాకాండ హఠాత్తుగా పెచ్చరిల్లింది. మావోయిస్టు వ్యతిరేక సల్వాజుడుంకు ప్రభుత్వ మద్దతు కారణంగానే ఆ హింసాగ్నులు ప్రజ్వరిల్లాయి....

వలస గండాల్లో గుత్తికోయలు

ఆదివాసీ రాష్ట్రమైన ఛత్తీస్‌గఢ్‌లో 2005లో హింసాకాండ హఠాత్తుగా పెచ్చరిల్లింది. మావోయిస్టు వ్యతిరేక సల్వాజుడుంకు ప్రభుత్వ మద్దతు కారణంగానే ఆ హింసాగ్నులు ప్రజ్వరిల్లాయి. ఆ దారుణకాండలో దాదాపు 55,000 మంది గిరిజనులు తమ ఇళ్లను, ఊళ్లను వదిలివేసి పొరుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌కు పలాయనమై అక్కడే శరణార్థులుగా ఉండిపోయారని ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ప్రభుత్వ గణాంకాలే తెలుపుతున్నాయి.


ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని దండకారణ్య దక్షిణ ప్రాంతాలకు గుత్తికోయల (ఛత్తీస్‌గఢ్‌లో వీరిని ‘మురియా’లుగా పిలుస్తారు) ఆర్థిక వలసలు ఏనాటి నుంచో కొనసాగుతూ వస్తున్నాయి. అయితే పొరుగు రాష్ట్రాలు అయిన ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు వలసపోయిన వారిలో 90 శాతం మంది ఛత్తీస్‌గఢ్‌లో ఎడతెగని హింసాకాండ వల్లే ఆయా రాష్ట్రాలకు వెళ్లడం జరిగిందని గుత్తికోయలే స్వయంగా చెపుతున్నారు.


ఇటీవల ‘మిషన్ కశ్మీర్’ అనే సినిమా కశ్మీరీ పండిట్‌ల నిర్బంధ వలసల దుస్థితిని ప్రపంచం దృష్టికి తెచ్చింది. అయితే గుత్తికోయల వలస కడగండ్లను ఎవరూ పట్టించుకోవడం లేదు. అదొక అజ్ఞాత విషాదగాథగా మిగిలిపోయింది. కశ్మీర్ ఉగ్రవాదుల వలే మావోయిస్టులు కూడా, ఛత్తీస్‌గఢ్‌లోని స్వస్థలాలకు తిరిగిరాదలుచుకున్న ఆడవి బిడ్డలను అంతమొందిస్తున్నారు. ఈ అమానుషాలు ప్రింట్ మీడియాలో కనీసం వార్తలు కూడా కావడం లేదు; ఎలక్ట్రానిక్ మీడియాలో కనిపించనే కనిపించడం లేదు.


ఛత్తీస్‌గఢ్ నుంచి ఆదివాసీల వలసల సమస్యకు శాశ్వత పరిష్కారాన్ని కనుగొనేంతవరకు పరిస్థితులు యథాతథంగా కొనసాగేలా చూడాలని తెలంగాణ హైకోర్టు 2018లో ఆదేశించింది. వలస వచ్చిన వారి చేతుల్లో ఉన్న భూములను తిరిగి తీసుకోవడం గానీ, వారి ఇళ్లను ధ్వంసం చేయడానికి గానీ పూనుకోవద్దంటూ ఉత్తర్వులు ఇచ్చింది. అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టు ఆదేశాన్ని పాటించడం లేదు. వలస వచ్చిన వారు ఆక్రమించుకున్న అటవీ భూములను తిరిగి స్వాధీనం చేసుకునేందుకు ‘హరిత హారం’ కార్యక్రమాన్ని ఒక సాకుగా ఉపయోగించుకుంటోంది. కరోనా ఆపత్సమయంలో ప్రారంభమైన ఈ పునఃస్వాధీన కార్యక్రమం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది.


ఛత్తీస్‌గఢ్ నుంచి వచ్చిన వలసకారులు తాము అక్రమంగా ప్రవేశించిన అటవీ భూములపై ఎలాంటి యాజమాన్య హక్కులు కలిగిలేరు. ఇది స్పష్టం. అయితే మొక్కలు నాటే కార్యక్రమం (ఇదే హరితహారం) పేరిట ఆ అటవీ భూములను తిరిగి కైవసం చేసుకోవడమనేది తెలంగాణ హైకోర్టు ఉత్తర్వును ఉల్లంఘించడమే. 2018లో తెలంగాణ హైకోర్టు ఆదేశం జారీ అయిన తరువాత వలసకారులు తాము కబ్జాచేసిన అడవులను నరికివేస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, నిజం లేశ మాత్రం లేని వివరణలు ఇస్తోంది.


కరోనా కార్చిచ్చు ప్రారంభం కాకముందు మిజోరం, త్రిపుర రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించి బ్రూ తెగ గిరిజనుల పునరావాసానికి కేంద్ర ప్రభుత్వం ఒక ప్రణాళికను ప్రకటించింది. మిజోరంలో ఆదివాసీ తెగల మధ్య ఘర్షణల మూలంగా బ్రూ గిరిజనులు చాలా కాలం క్రితమే త్రిపురకు బలవంతంగా వలసపోయారు. అలా వలసవెళ్లిన వారిలో కొంత మంది తిరిగి మిజోరంకు వెళ్ళడానికి నిర్ణయించుకున్నారు. వెనక్కి వెళ్లిపోయేందుకు నిరాకరించిన వారు కేంద్ర ప్రభుత్వం నుంచి నగదు రూపేణా నష్ట పరిహారాన్ని అంగీకరించారు.


సరే, ఛత్తీస్‌గఢ్ నుంచి వలసలు ఆగలేదు. వలస వేదనలకు అంతముంటుందా? ఆంధ్రప్రదేశ్, తెలంగాణలలో నివశిస్తున్న గుత్తికోయలకు స్వస్థలాలలో పునరావాసం కల్పించే విషయమై సంబంధిత రాష్ట్రాలు అన్నిటితోనూ చర్చలు ప్రారంభించేందుకు కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకోవాల్సిన సమయమాసన్నమయింది. ప్రజా సంఘాలు ఈ విషయమై కేంద్రాన్ని గట్టిగా డిమాండ్ చేయాలి. ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర పాలకులు ఈ విషయంలో ఎటువంటి శ్రద్ధ చూపడం లేదు.


ఛత్తీస్‌గఢ్‌కు తిరిగిరాదలుచుకున్న వలసకారుల పునరాగమనానికి అన్ని ఏర్పాట్లు చేస్తామని ఆ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించింది. అయితే మావోయిస్టులకు ఈ ప్రకటన ఎంతమాత్రం అంగీకారయోగ్యంగా లేదు. ఆ నిర్ణయం అమలుకు ప్రభుత్వం చేపట్టే చర్యలను విఫలం చేసేందుకు వారు ఉద్యుక్తులై ఉన్నారు. కారణమేమిటి? భవిష్యత్తులో తాము ఆంధ్రప్రదేశ్, తెలంగాణలకు తిరిగి వెళ్లేందుకై వలసపోయిన గుత్తికోయ గిరిజనులను ఉపయోగించుకోవాలనే ఆలోచనలో మావోయిస్టులు ఉన్నారు. ఉభయ తెలుగు రాష్ట్రాల పోలీసధికారులు కూడా ఆదివాసీ వలసకారుల మూలంగా మావోయిస్టుల బెడద పెరుగుతుందని భయపడుతున్నారు. ఈ కారణంగా ఆ నిస్సహాయ గిరిజనులను ఛత్తీస్‌గఢ్‌కు బలవంతంగానైనా సరే పంపించేందుకు వారు ప్రయత్నిస్తున్నారు.


ఇదొక సంక్లిష్ట సమస్య. చాలామంది వలసకారులు ఛత్తీస్‌గఢ్‌కు వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఎందుకంటే ఇప్పటికీ అక్కడ హింసాకాండ ప్రజ్వరిల్లుతూనే ఉంది. దాన్ని తప్పించుకోవడానికే అన్నీ వదులుకుని కన్న ఊళ్ల నుంచి వచ్చి, పరిస్థితులు ఏ మాత్రం మారకుండానే అక్కడికి తిరిగిపోవడమెందుకని వారు ఆలోచిస్తున్నారు. గత పదిహేనేళ్లలో ప్రభవించిన కొత్తతరం వారు స్వరాష్ట్రంలో కంటే ఉభయ తెలుగు రాష్ట్రాలలోనే తమకు అపార అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు.


ఈ ఆదివాసీ వలసకారులలో అత్యధికులు తెలంగాణలోనే ఉన్నందున, సమస్యకు శాశ్వత పరిష్కారం కనుగొనేలా కేంద్రంపై ఆ రాష్ట్రమే ఒత్తిడి తీసుకురావలసిన అవసరం ఎంతైనా ఉంది. దక్షిణాది రాష్ట్రాలు తమ రాష్ట్రానికి ‘విప్లవకారుల’ను ఎగుమతి చేస్తున్నాయని, తత్కారణంగానే వాటికి వలసకారుల సమస్య అనివార్యమవుతోందని ఛత్తీస్‌గఢ్ అధికారులు కొంతమంది వ్యక్తిగత చర్చల్లో వ్యాఖ్యానిస్తున్నారు.


సమస్య తీవ్రతను అర్థం చేసుకునేందుకు అవసరమైన సమాచారం అందుబాటులో లేదు. నక్సలైట్ల హింసాకాండ మూలంగా ఒక్క వ్యక్తికూడా ఇరుగు పొరుగు రాష్ట్రాలకు వెళ్లలేదని, కనుక రాష్ట్రంలో వారికి పునరావాసం కల్పించే ప్రసక్తి అంటూ లేదని 2021లో ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో ఒక ప్రశ్నకు సమాధానంగా హోం మంత్రి తెలిపారు. వలసకారులు తెలంగాణలోనే అత్యధికంగా ఉన్నప్పటికీ వారి సంఖ్య ఎంత అనేది కచ్చితంగా తెలియదు. వలసకారులు అడవులను నరికివేస్తున్నారనే మాట గట్టిగా వినిపిస్తోంది. అయితే తమ జిల్లాలో అటవీ భూములను చట్టవిరుద్ధంగా ఆక్రమణకు గురైన అటవీ భూములలో కేవలం ఎనిమిదో వంతు మాత్రమే వలసకారుల అధీనంలో ఉన్నాయని ఒక జిల్లా ఉన్నతాధికారి చెప్పాడు. 


హింసాకాండ మూలంగా ఎంతమంది వలస వెళ్లారో కచ్చితంగా లెక్క తీయాలని 2019లో ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాన్ని జాతీయ షెడ్యూల్డ్ తరగతుల కమిషన్ ఆదేశించింది. ఈ విషయమై తాము రాసిన లేఖలకు ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శుల నుంచి ఎలాంటి ప్రతిస్పందన రాలేదని ఛత్తీస్‌గఢ్ చెప్పింది.


చట్ట విరుద్ధంగా స్థానభ్రంశం చెందిన లేదా తమ ఆక్రమణలో ఉన్న అటవీ భూముల నుంచి గెంటివేయబడ్డ ఆదివాసీలకు ప్రత్యామ్నాయ భూమి ఇవ్వాలని అటవీహక్కుల చట్టంలోని నిబంధన 3.1.ఎమ్ నిర్దేశించింది. ఈ నిబంధనను తమకు వర్తింపచేయాలని వెయ్యి మందికి పైగా వలసకారులు దరఖాస్తు చేసుకున్నారు. అయితే సంవత్సరాలుగా అవి అటక మీద దుమ్ముకొట్టుకుని పోతున్నాయి.


అంతర్గతంగా స్థానభ్రంశం చెందిన ప్రజల (ఇంటర్నల్లీ డిస్‌ప్లేస్డ్ పీపుల్-) విషయంలో భారత్‌కు ఒక జాతీయ విధానం లేదు. రాజకీయ, సామాజిక సంఘర్షణలు, హింసాకాండతో అనివార్యంగా వలస వెళ్లవలసి వచ్చిన లేదా స్వస్థలాల నుంచి గెంటివేతకు గురైన వారి సమస్యలకు సంబంధించిన ఏ అంతర్జాతీయ ఒడంబడికలోనూ మనం భాగస్వాములుగా లేము. ఈ నిరాశ్రయుల విషయమై కేంద్రం ఒక సమగ్ర విధానాన్ని రూపొందించేందుకు భారత స్వాతంత్ర్య అమృత మహోత్సవాలే సరైన సమయం, సందర్భం. ఒక సమగ్ర జాతీయ విధానాన్ని అనుసరించడానికి బదులుగా విడి విడి రాష్ట్రాల ఇష్టాయిష్టాలు, నిరాధార నమ్మకాలకు వలసవెళ్లిన అభాగ్యగతుల శ్రేయస్సును ఎందుకు వదిలివేయాలి?

శుభ్రాంశు చౌధరి

(బీబీసీ మాజీ విలేఖరి)

Updated Date - 2022-06-14T06:27:40+05:30 IST