ఫర్‌ఫెక్ట్‌గా చంపేశారు.. క్లియర్‌గా క్లీన్‌ చేశారు

ABN , First Publish Date - 2020-08-04T11:11:59+05:30 IST

కురిచేడు మండలంలో శానిటైజర్‌ తాగి 16మంది మృతిచెందిన విషయంలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు.

ఫర్‌ఫెక్ట్‌గా చంపేశారు.. క్లియర్‌గా క్లీన్‌ చేశారు

కొందరు కడుపులో మంటగా ఉందని, దాహం అని అన్నారు. కొంతమంది శానిటైజర్‌ తాగిన కొన్నిగంటల తర్వాత కాళ్లూ చేతులు గిలగిలా కొట్టుకుంటూ కేకలు వేస్తూ మృతిచెందారు. గతంలో లేని బాధలు కొత్త రకం తాగినప్పుడే వచ్చాయి. అంటే వాటిలో తేడా ఉందని మృతుల కుటుంబసభ్యుల అనుమానం. అవి తాగిన వారు మాత్రమే మృతిచెందారని స్థానికుల సమాచారం. కురిచేడులో శానిటైజర్‌ తాగి 16మంది మృతిచెందిన ఘటనలో వెలుగుచూస్తున్న వాస్తవాలివి.


కొత్తరకం శానిటైజర్లే వారి ప్రాణాలను బలితీసుకున్నాయి.  కురిచేడులో 100మంది వరకూ శానిటైజర్‌ తాగడానికి అలవాటుపడ్డారు. ప్రధానంగా మృతుల్లో ఎక్కువమంది 3 మెడికల్‌ షాపుల్లోనే ఆ రెండురకాలే కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది. కాగా మృతుల గృహాల వద్ద వారు సంఘటన రోజు ఉన్న శానిటైజర్‌ బాటిళ్లు నేడు కనపడటం లేదు. అంటే అధికారులు ‘పర్ఫెక్ట్‌’గానే వ్యవహారం నడిపి, అంతా ‘క్లియర్‌’ చేస్తున్నారనే ఆరోపణలు  వెల్లువెత్తుతున్నాయి. 



శానిటైజర్‌ మృతుల కేసులో ముమ్మర దర్యాప్తు

మెడికల్‌ షాపుల యజమానుల గృహాల్లో సోదాలు

గుంటూరు జిల్లా సాతులూరులో తనిఖీలు


కురిచేడు, ఆగస్టు 3: కురిచేడు మండలంలో శానిటైజర్‌ తాగి 16మంది మృతిచెందిన విషయంలో అధికారులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. ప్రధానంగా రెండు కంపెనీలకు చెందిన శానిటైజర్‌ తాగిన వారిలో ఎక్కువమంది మృతిచెందినట్లు సమాచారం. పోలీసు లు, డ్రగ్‌ ఇన్‌స్పెక్టర్లు కూడా సదరు కంపెనీలపై విచారణ చేస్తున్నట్లు తెలిసింది. బాధితుల ఇళ్ల వద్ద మృతి చెందిన సమయంలో ఉన్న శానిటైజర్‌ బాటిళ్లు నేడు మాయమైపోవడం గమనార్హం. ఇందులో అధికారుల పాత్ర ప్రముఖంగా ఉందనే ప్రచారం స్థానికంగా ఉంది. 

 

ఎక్కడో తేడా జరిగింది 

కురిచేడులో వంద మంది వరకు శానిటైజర్‌ తాగడానికి అలవాటు పడ్డారు. ఇక్కడ పది వరకు మెడికల్‌ షాపులు ఉండగా వీరంతా ఎక్కడ పడితే అక్కడ శానిటైజర్‌ కొనుగోలు చేశారు. మృతులలో ఎక్కువమంది మూడు మెడికల్‌ షాపులలో శానిటైజర్‌లు కొనుగోలు చేసినట్లు అధికారుల విచారణలో తేలింది.  కాగా, పది రోజుల నుంచి శానిటైజర్లు తాగుతుంటే లేని బాధలు తాజాగా కొత్త రకం శానిటైజర్లు కొనుగోలు చేసి తాగినపుడే ఎందుకు వచ్చిందనేది ప్రశ్న. ఇక్కడే ఏదో తేడా జరిగిందనే వారి అనుమానాలకు తావిస్తోంది. 


ఆ రెండు రకాలే 

పోలీసులు సైతం సదరు శానిటైజర్లు ఏఏ షాపుల లో అమ్మారనే విషయం ఆరా తీశారు. మెడికల్‌ షాపు ల యజమానులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచార ణ చేశారు.


ఒంగోలు, పామూరులో కూడా మరణాలు సంభవించడంతో అక్కడా కూడా ఈ రకం శానిటైజర్‌ తాగారా అని విచారణ జరిపినట్లు సమాచారం. కురిచేడు నుంచి సదరు శానిటైజర్‌ బాటిల్‌ ఫొటోలు తెప్పించి ఒంగోలు, పామూరులో మృతిచెందిన వారి కుటుంబ సభ్యులకు శానిటైజర్‌ బాటిల్‌ ఫొటో చూపించి ఇదే తాగారా అని విచారణ చేసినట్లు సమాచారం. రెండు కంపెనీలకు చెందిన శానిటైజర్లు ప్రధానంగా మూడు మెడికల్‌ షాపులలో కొనుగోలు చేసినట్లు మృతుల కుటుంబ సభ్యులు తెలియజేశారు. ఆయా మెడికల్‌ షాపుల వారిని పోలీసులు ప్రత్యేకంగా విచారించారు. తాము లూజ్‌ అమ్మలేదని బాటిళ్ళు తమకు వచ్చినవి వచ్చినట్లే అమ్మామని వారు పేర్కొన్నారు.. వారివద్ద ఈ శానిటైజర్లకు సంబంధించి పక్కాగా బిల్లులు, లెక్కలు ఉన్నాయి. 


ఫార్మాస్యూటికల్స్‌లోనూ సోదాలు 

గుంటూరు జిల్లా నాదెండ్ల మండలం సాతులూరు గ్రామంలో ఉన్న  ఫార్మాసూటికల్‌ కంపెనీలో సోమవారం స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో(ఎస్‌ఈబీ) డీఎస్పీ ఆధ్వర్యంలో విచారణ చేశారు. అక్కడ ఏఏ రకాల శానిటైజర్లు తయారు అవుతున్నాయో పరిశీలించారు. అక్కడ నుంచి ఎక్కడెక్కడకు శానిటైజర్లు సరఫరా చేశారో వివరాలు సేకరించారు.. కురిచేడుకు వచ్చిన శానిటైజర్లలో కొన్ని అక్కడ నుంచే వచ్చాయి. ఆ శానిటైజర్లపై అనుమానంతో సదరు కంపెనీలో విచారణ చేసినట్లు సమాచారం. మరోవైపు సిట్‌ అధికారులు గుంటూరు జిల్లా తాడేపల్లి నుకలపేట సికో బయోటెక్‌ మెడికల్‌ కంపెనీలో కూడా తనిఖీలు చేశారు. 


పోలీసుల సోదాలు..

 మెడికల్‌ షాపులు నిర్వహిస్తున్న వారి గృహాలలో సోమవారం దర్శి డీఎస్పీ ప్రకాశరావు ఆధ్వర్యంలో సోదాలు నిర్వహించారు. ఎస్‌ఐ జి.రామిరెడ్డి తన సిబ్బందితో కలసి క్షుణ్ణంగా గృహాలలో పరిశీలించారు. దుకాణాలలో కాకుండా ఇంకా ఇళ్ళలో ఏమైనా శానిటైజర్‌లు ఉన్నాయా అని పరిశీలించారు. మెడికల్‌ షాపుల యజమానులను పోలీస్‌ స్టేషన్‌కు పిలిపించి విచారించారు. వారికి తెలిసిన సమాచారం చెప్పమని అడిగారు. 


Updated Date - 2020-08-04T11:11:59+05:30 IST