ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరిస్తారా?

ABN , First Publish Date - 2020-10-27T19:18:19+05:30 IST

మహరాజా కళాశాల ప్రైవేటీకరణపై ఇప్పటికే అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో..

ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరిస్తారా?

మంత్రి పరిశీలనతో మరిన్ని అనుమానాలు

విద్యార్థులకు ఇబ్బంది లేకుండా చూస్తామన్న బొత్స


(విజయనగరం- ఆంధ్రజ్యోతి): మహరాజా కళాశాల ప్రైవేటీకరణపై ఇప్పటికే అనేక పరిణామాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది ఇంటర్‌ మొదటి సంవత్సరంలో విద్యార్థుల ప్రవేశానికి మాన్సాస్‌ యాజమాన్యం ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. దీంతో విద్యార్థుల్లో అనుమానాలు మరింత బలపడ్డాయి. ఈ నేపథ్యంలో మంత్రి బొత్స సత్యనారాయణ స్థానిక ప్రభుత్వ జూనియర్‌ కళాశాలను సోమవారం సందర్శించి విద్యార్థుల తరలింపుపై సూచనలు ఇచ్చారు. ఎంఆర్‌ కళాశాలను ప్రైవేటీకరించేందుకు మాన్సాస్‌ నిర్ణయించినప్పటి నుంచి విజయనగరంలో ఆందోళనలు చేస్తున్న విషయం తెలిసిందే. విద్యార్థులు, నాయకులు, సంఘాలు వేర్వేరుగా నిరసన శిబిరాలు నిర్వహిస్తున్నాయి. అయినప్పటికీ మాన్సాస్‌ దిగి రావటం లేదు. కళాశాలను ప్రైవేటీకరించేందుకే నిర్ణయించినట్లు స్పష్టమవుతోంది.


మంత్రి బొత్స సత్యనారాయణ విజయనగరంలోని ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో వసతులపై సోమవారం ఆరా తీశారు. స్వయంగా పరిశీలించారు. ఎంఆర్‌ కళాశాలలో చదువుతున్న ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులను ఇక్కడి ప్రభుత్వ జూనియర్‌  కళాశాలలో సర్దుబాటు చేసేందుకే ఆయన వచ్చినట్లు సర్వత్రా చర్చ నడిచింది. ఇదిలా ఉండగా ఎంఆర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులను ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు తరలిస్తామని మంత్రే స్పష్టం చేశారు. ఆ సమయంలో విలేకరులు కల్పించుకుని ఎంఆర్‌ కళాశాలను ఎత్తివేస్తున్నారా అని ప్రశ్నించగా ఆయన నేరుగా సమాధానం చెప్పలేదు. విద్యార్థుల చదువుకు ఇబ్బందులు రానీయకుండా ప్రభుత్వం చూస్తుందని, మహరాజా కళాశాలను ప్రైవేట్‌ పరం చేయాలా? వద్దా? అన్నది మాన్సాస్‌ వ్యవహారమని అన్నారు. ట్రస్టు కార్యకలాపాల్లో ప్రభుత్వం తల దూర్చదని, అయితే మాన్సాస్‌ ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా చూసే బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పారు. ఎవరికీ ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు.


Updated Date - 2020-10-27T19:18:19+05:30 IST