మంత్రి బొత్స సోదరుడి భూదందా!

ABN , First Publish Date - 2020-07-01T08:42:33+05:30 IST

రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము కొనుక్కున్న భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని...

మంత్రి బొత్స సోదరుడి భూదందా!

మేం కొనుక్కున్న భూముల్లో కంచె వేశారు

మొత్తం 3 ఎకరాల ఆక్రమణకు సిద్ధమయ్యారు

గతంలో రైల్వే సొసైటీ మాకు విక్రయించింది

36 మంది కొనుగోలుదారుల ఆందోళన

కలెక్టర్‌, ఎస్పీలను ఆశ్రయించినా ‘స్పందన’ లేదని వెల్లడి


విజయనగరం, జూన్‌ 30(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రి బొత్స సత్యనారాయణ సోదరుడు బొత్స ఆదిబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని తాము కొనుక్కున్న భూములను ఆక్రమించేందుకు ప్రయత్నిస్తున్నారని 36 మంది కొనుగోలుదారులు ఆందోళన వ్యక్తం చేశారు. తాము ఎన్ని పర్యాయాలు భూములను రక్షించుకునేందుకు ప్రయత్నించినా ఆదిబాబు కబ్జాకు పాల్పడుతున్నారని అన్నారు. బాధితుల కథనం మేరకు.. విజయనగరం నుంచి విశాఖ వెళ్లే ప్రధాన రహదారికి పక్కన సర్వే నెంబరు 53లో 138 ఎకరాల భూములు ఉన్నాయి. దీనిని 6 సబ్‌ డివిజన్లుగా విభజించారు. 1977లో బొత్స గురునాయుడు(బొత్స తండ్రి) సర్వే నెంబర్‌ 53/2లో 76 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇదే సర్వేనెంబరు 53/5లో మూడు ఎకరాలను 1982లో  రైల్వే సొసైటీ కొనుగోలు చేసింది. ఇందులో లేఅవుట్‌ వేసి విక్రయించింది. 1982లో ప్రస్తుత బాధితులు 36 మంది వీటిని కొనుగోలు చేశారు. అయితే, ఈ స్థలం తమదేనని బొత్స ఆదిబాబు గత కొంత కాలంగా పేర్కొంటున్నారు. కొన్నాళ్ల కిందట కంచె కూడా వేయించారు. దీంతో బాధితులు జిల్లా కలెక్టర్‌కు, ఎస్పీకి ‘స్పందన’లో ఫిర్యాదు చేశారు. అయితే, ఇది సివిల్‌ మేటర్‌ అని, కోర్టుకు వెళ్లాలని వారు సూచించారు. ఈ నేపథ్యంలో వారు కోర్టును ఆశ్రయించి ఇంజక్షన్‌ ఆర్డర్‌ తీసుకువచ్చారు. అయినా ఆదిబాబు అక్రమణలకు పాల్పడుతున్నారని బాధితులు చెబుతున్నారు. కోర్టు నిర్దేశాలను సైతం ఖాతరు చేయకుండా తమ స్థలాల చుట్టూ ఆయన వేయించిన కంచెను బాధితులు తొలగించారు.

Updated Date - 2020-07-01T08:42:33+05:30 IST