ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు

ABN , First Publish Date - 2022-08-14T05:39:04+05:30 IST

మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీకి గుణపాఠం తప్పదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు

ఆ రెండు పార్టీలకు గుణపాఠం తప్పదు
చౌటుప్పల్‌లో పాదయాత్ర చేస్తున్న అనిల్‌కుమార్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి తదితరులు

 మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి

 సంస్థాన్‌నారాయణపురం నుంచి చౌటుప్పల్‌ వరకు ఆజాదీకా గౌరవ్‌యాత్ర

చౌటుప్పల్‌, సంస్థాన్‌నారాయణఫురం, ఆగస్టు 13: మునుగోడు ఉప ఎన్నికలో టీఆర్‌ఎస్‌, బీజేపీకి గుణపాఠం తప్పదని మాజీ మంత్రి రాంరెడ్డి దామోదర్‌రెడ్డి అన్నారు. స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి శనివారం నిర్వహించిన ఆజాదీకా గౌరవ్‌యాత్రలో ఆయన మాట్లాడారు. సంస్థాన్‌నారాయణపురంలో పాదయాత్రను దామోదర్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించగా, చౌటుప్పల్‌ వరకు 12కిలోమీటర్ల మేర సాగింది. మహ్మదాబాద్‌, చిమిర్యాల, గుడిమల్కాపురం, దామెర, తంగడపల్లి మీదుగా పాదయాత్ర కొనసాగింది. దారి పొడవున ప్రజలు పాల్గొని సంఘీభావం తెలిపారు. పాదయాత్రలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను నాయకులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం చౌటుప్పల్‌లో నిర్వహించిన ముగింపు సభలో దామోదర్‌రెడ్డి మాట్లాడారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ మూడో స్థానానికి పరిమితమం అవుతుందని అన్నారు. కాంగ్రెస్‌, టీఆర్‌ఎస్‌ మధ్యే ఉప పోరు సాగనుందని తెలిపారు. పీసీసీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, మాజీ ఎంపీ మల్లు రవి మాట్లాడుతూ మునుగోడు నియోజకవర్గంలో కాంగ్రెస్‌ గెలుపు ఒక చారిత్రక అవసరమని అన్నారు. ఇక్కడి గెలుపుతో రాష్ట్ర రాజకీయాల్లో మార్పుకు నాంది పలుకుతుందని అన్నారు. కేంద్ర మాజీ మంత్రి బలరాంనాయక్‌ మాట్లాడుతూ, సోనియాగాంధీ లేకుంటే తెలంగాణ వచ్చేది కాదన్నారు. బీజేపీని మునుగోడు నుంచి తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పార్టీ అభ్యర్థి ఎవరైనా గెలుపునకు ప్రతీ ఒక్కరు పాటుపడాలన్నారు. కాంగ్రెస్‌ రాష్ట్ర నేత చెరుకు సుధాకర్‌ మాట్లాడుతూ, సీఎం కేసీఆర్‌, కేంద్రమంత్రి అమిత్‌షాలు ఆడుతున్న నాటకంలో భాగంగానే మునుగోడు ఉపఎన్నిక అన్నారు. మునుగోడు ఉప ఎన్నిక రాజగోపాల్‌రెడ్డి స్వలాభం కోసమేనని పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ సీఎం కేసీఆర్‌కు ఏటీఎంలా మారేందుకు బీజేపీ దోహదం చేసిందని ఆరోపించారు.


మోసం చేసిన రాజగోపాల్‌ను ఓడించాలి

మునుగోడు ప్రజలను మోసం చేసిన రాజగోపాల్‌రెడ్డిని ఓడించాలని డీసీసీ అధ్యక్షుడు కుంభం అనిల్‌కుమార్‌రెడ్డి అన్నారు. సంస్థాన్‌నారాయణపురం నుంచి నిర్వహించిన ఆజాదికా గౌరవ్‌ యాత్రలో ఆయన మాట్లాడారు. తొలుత రాజీవ్‌గాంధీ, మహాత్మాగాంధీ, అంబేడ్కర్‌ విగ్రహాలకు పూలమాల వేసి నివాళులర్పించారు. స్థానిక శివాలయంలో ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. పాదయాత్రలో గిరిజన మహిళలు సంప్రదాయ దుస్తులతో నృత్యాలు చేస్తూ వెంట నడిచారు. ఈ సందర్భంగా అనిల్‌కుమార్‌ మాట్లాడుతూ, మునుగోడు కాంగ్రెస్‌ అడ్డా అని, కల్యాణ లక్ష్మి చెక్కులు పంచలేని ఎమ్మెల్యే ఉంటే ఏంది, పోతే ఏందని విమర్శించారు. స్వలాభం కోసం రాజగోపాల్‌రెడ్డి మానాన్ని, ఆత్మాభిమానాన్ని బీజేపీకి తాకట్టు పెట్టారని విమర్శించారు. కార్యక్రమంలో మహిళ కాంగ్రెస్‌ రాష్ట్ర అధ్యక్షురాలు సునితరావు, నాయకులు పున్న కైలాస్‌, పల్లె రవికుమార్‌, పాల్వాయి స్రవంతి, చల్లమల్ల కృష్ణారెడ్డి, సుర్వి నర్సింహ, ఆకుల ఇంద్రసేనారెడ్డి, తిరుపతి రవీందర్‌, చెర్కు లింగస్వామి, చౌట వేణు, కొర్పూరి సైదులు, ఆకుల శ్రీకాంత్‌, బడేటి సత్యనారాయణ, లందగిరి బీమయ్య, రాజే్‌షఖన్నా, గౌస్‌ఖాన్‌, బొంగు రమేష్‌, తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2022-08-14T05:39:04+05:30 IST