పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా

ABN , First Publish Date - 2021-12-22T18:00:27+05:30 IST

పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంనాడు ముగిసాయి. ఉభయ సభలూ..

పార్లమెంటు సమావేశాలు నిరవధిక వాయిదా

న్యూఢిల్లీ: పార్లమెంటు శీతాకాల సమావేశాలు బుధవారంనాడు ముగిసాయి. ఉభయ సభలూ నిరవధికంగా వాయిదా పడ్డాయి. షెడ్యూల్ తేదీ కంటే ఒకరోజు ముందే సమావేశాలు ముగియడం విశేషం. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 29న పార్లమెంటు సమావేశాలు ప్రారంభం కాగా, డిసెంబర్ 23తో ముగియాల్సి ఉన్నాయి.


కీలకమైన ఎలక్టోరల్ జాబితాను ఆధార్‌తో అనుసంధానం చేసే బిల్లు మంగళవారంనాడే పార్లమెంటు ఆమోదం పొందింది. బిల్లుకు వ్యతిరేకంగా నిరసన తెలిపిన విపక్షాలు సభ నుంచి వాకౌట్ చేశాయి. గత వర్షాకాల సమావేశాల చివరిరోజు సస్పెండ్ అయిన 12 మంది రాజ్యసభ సభ్యులపై ఈ సమావేశాల చివరివరకూ సస్పెన్షన్ ఎత్తివేయకపోవడంతో వారు నిరసనలకే పరిమితమయ్యారు. ప్రతిరోజూ పార్లమెంటు ఆవరణలో గాంధీ విగ్రహం వద్ద నిరసనలు తెలుపుతూ వచ్చిన ఎమ్మెల్యేలకు విపక్షాలు సంఘీభావం తెలపడం, ఉభయసభల్లోనూ సస్పెన్షన్ ఎత్తివేతకు డిమాండ్ చేయడంతో పలు అవాంతరాలు తలెత్తాయి. మంగళవారంనాడు తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరిక్ ఒబ్రెయిన్‌పై రాజ్యసభలో సస్పెన్షన్ వేటు పడింది. ఎన్నికల సవరణ బిల్లుపై చర్చ జరుగుతున్న సమయంలో కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ డెరెక్‌ ఓబ్రెయిన్‌ రాజ్యసభ నియమాల పుస్తకాన్ని విసిరిగొట్టినందుకు ఆయనపై శీతాకాల సమావేశాలు ముగిసేంతవరకూ సస్పెన్షన్‌ వేటు పడింది.

Updated Date - 2021-12-22T18:00:27+05:30 IST